రాష్ట్రంలో ఐదు గ్లోబల్ ట్రేడ్ సెంటర్లు
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:16 AM
చిన్న పరిశ్రమల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు రాష్ట్రంలో ఐదు గ్లోబల్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తిరుపతి, అమరావతి, విశాఖ, మరో రెండుచోట్ల ఏర్పాటు
ఎంఎ్‌సఎంఈ పాలసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): చిన్న పరిశ్రమల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు రాష్ట్రంలో ఐదు గ్లోబల్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి, అమరావతి, విశాఖపట్నంతో పాటు మరో రెండుచోట్ల వీటి ఏర్పాటుకు ప్రతిపాదించింది. స్థానికంగా ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక మైక్రో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం ద్వారా 175 నియోజకవర్గాల్లో లక్షా 75వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మైక్రో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఎంఎ్‌సఎంఈ పాలసీ రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల మహిళలతో విస్తృత స్థాయిలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిని కేంద్ర పథకాలతో అనుసంధానం చేయాలని సూచించారు. ‘ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త’ నినాదంతో ముందుకు సాగుదామని చెప్పారు. ఎంఎ్‌సఎంఈల అభివృద్ధికి ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి భరోసా ఏర్పడుతుందని చెప్పారు. అధికారులు తయారు చేసిన ఎంఎస్‌ఎంఈ పాలసీ డ్రాఫ్ట్‌లో మార్పులు, చేర్పులను సీఎం సూచించారు. ఎక్కువమందికి ఉపాధి కల్పన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంగా దూరదృష్టితో సాహసోపేతమైన చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా అత్యుత్తమ ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంఎ్‌సఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రిజిస్ర్టేషన్ల ఆదాయం 6 నెలల్లో రూ.3,971 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ రూ.3,971 కోట్ల ఆదాయం సాధించింది. గతఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయం కంటే 18 శాతం తగ్గడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.13,500 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. సీఎం చంద్రబాబు శుక్రవారం ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించారు. సొంత ఆదాయాలను మెరుగుపరచి ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.13,500 కోట్ల ఆదాయం సాధ్యం కాకపోవచ్చని, రూ.11,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని రిజిస్ర్టేషన్ల శాఖ అధికారులు వెల్లడించారు. భూముల మార్కెట్ విలువ సవరిస్తే రూ.1000 కోట్ల అదనపు ఆదాయం సాధించవచ్చన్నారు.