ఈ ఓఎస్డీలు మహాముదుర్లు!
ABN , Publish Date - Sep 30 , 2024 | 04:04 AM
రాష్ట్రంలోని కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎ్‌సడీ)అధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల ఎంపికలో సీఎం చంద్రబాబు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, మంత్రులు తమ దగ్గర పనిచేసే ఓఎస్డీ, వ్యక్తిగత
మంత్రులను మించిపోయిన అధికారులు
వైస్ చాన్సలర్నే రప్పించుకుని వార్నింగ్‌లు
కావాలనుకున్న వారికి కీలక పోస్టింగులు
వైసీపీ హయాంలో భారీ అవినీతి ఆరోపణలు
అయినా.. ఏరికోరి ఎంచుకున్న కీలక మంత్రులు
సీఎం చంద్రబాబు హెచ్చరించినా మారని తీరు
నిఘా నివేదిక ఇచ్చినా పట్టించుకోని వైనం
పీఎస్, ఓఎస్డీలతో సర్కారుకు చెడ్డపేరు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎ్‌సడీ)అధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల ఎంపికలో సీఎం చంద్రబాబు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, మంత్రులు తమ దగ్గర పనిచేసే ఓఎస్డీ, వ్యక్తిగత కార్యదర్శు(పీఎ్‌స)లను మాత్రం ఇష్టానుసారం ఎంపిక చేసుకున్నారు. దీంతో మంత్రులకు సర్వాధికారాలున్నప్పటికీ ఓఎ్‌సడీ, పీఎ్సలే వారిని నడిపించే పరిస్థితి వచ్చింది. చాలా మంది మంత్రులకు పాలనా వ్యవహారాల మీద సరైన అవగాహన, పట్టు ఉండదు. ఫైళ్లు చదవడం, అర్థం చేసుకోవడం, ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం వంటివి మంత్రులు ఒక్కరే చేసుకోవడం అసాధ్యం. దీంతో పీఎస్, ఓఎస్డీలపైనే మంత్రులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. దాన్ని తమకు అవకాశంగా తీసుకున్న కొందరు ఓఎస్డీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సహజ శైలికి భిన్నంగా వీరిపోకడలు ఉంటున్నాయి. కీలక విషయాల్లో మంత్రులను తప్పుదారిపట్టించడం, సొంతంగా లాబీయింగ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడం, కీలక శాఖల్లో సొంత మనుషులకు పోస్టింగ్‌లు ఇప్పించుకోవడం, తెరచాటు దందాలకు పాల్పడుతుండటం, శాఖేతర వ్యవహారాల్లో వేలుపెడుతూ అవినీతి ఆరోపణల్లో మునిగిపోతున్నారు. వీరిలో ఇద్దరు ముగ్గురయితే తామే చక్రం తిప్పే నాయకులమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ కీలకమంత్రికి ఓఎస్డీగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారి మొత్తం ఆర్డీవో పోస్టింగ్‌ల్లో చక్రం తిప్పారు. మరో మంత్రి దగ్గర పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి శైలే భిన్నంగా ఉంది. మంత్రి చెప్పినా పీఎస్ వినరు. అదేమంటే... పెద్దల సిఫారసుతో వచ్చానంటారు. దీంతో మంత్రికి ఏంచేయాలో పాలుపోక కోపాన్ని అణుచుకుంటున్నారు. ఇక వీరి వద్దకు ప్రజాఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోరుతూ వినతలు రావు. వచ్చినా తీసుకోరు. అన్నీ పెద్ద వ్యవహారాలే చూస్తుంటారు. పెద్ద మంత్రుల దగ్గర ఉన్నామనే ధీమాతో వారుచేస్తున్న పనులు ఇటు ప్రభుత్వానికి, అటు మంత్రులకు చెడ్డపేరు తీసుకొస్తున్నాయి.
అవినీతి ఆరోపణలున్నా
ఓ కీలక మంత్రి దగ్గర ఓఎ్‌సడీగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారి గతంలో ఆర్డీవోగా పనిచేశారు. అప్పుడే ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. నేరుగా క్లర్క్‌లు, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌తోపాటు తహసీల్దార్లతో అవినీతి చైన్ ఏర్పాటుచేసుకుని లంచాలు మేశారన్న ఆరోపణలున్నాయి. నిషేధ భూముల జాబితాను సెటిల్ చేయడంలో, నాలా అనుమతులు జారీచేయడంలో ఆయన చేయని సెటిల్మెంట్ లేదని రెవెన్యూ అదికారులే చెబుతారు. ఆర్డీవోగా ఉండగా జగన్ ప్రభుత్వంలో ఆయనపై అవినీతికి సంబంధించి ఆరు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆయన అప్పటి సీఎంవోలోని ఓ అధికారి అండతో బుట్టదాఖలు చేయించారు. ఫిర్యాదులు చేసిన వారినే ఆఫీసుకు పిలిపించుకొని సెటిల్మెంట్ చేయించుకున్నారు. దీనికి తోడు నైతికంగా, వ్యక్తిగతంగా దిగజారుడు పనులు చేయడంలో ఆయనకు మహా చెడ్డ రికార్డే ఉంది. ఇలాంటి ఘనపాఠిని ప్రభుత్వంలో ఓ కీలకమంత్రి ఏరికోరి ఓఎస్డీగా తీసుకున్నారు. దీనిపై అప్పట్లోనే రెవెన్యూవర్గాలు పెదవి విరిచాయి. ఆ రెవెన్యూ అధికారి పనితీరు చెత్తగా ఉందని, అవినీతి ఆరోపణలు, నైతిక పతనం, ఇలా అనేక రకాలుగా భ్రష్టుపట్టారని నిఘా విభాగం కూడా లిఖితపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అయినా ఆ మంత్రి వెనక్కి తగ్గలేదు. ఆయననే ఓఎస్డీగా కొనసాగించారు. ఆ తర్వాత ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వంలో 8 మంది మంత్రుల వద్ద ఓఎ్‌సడీ, పీఎ్సలను ఆయనే సిఫారసు చేయడం విశేషం. పేరు మంత్రిది, సిఫారసు మాత్రం ఆయనదే కావడం గమనార్హం. దీంతో ఆ మంత్రులు తమకొచ్చేవారు ఇష్టం లేకున్నా కీలక మంత్రి కార్యాలయం సిఫారసు కావడంతో కిమ్మనకుండా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన రెవెన్యూశాఖలో వేలుపెట్టారు. ఇటీవల ప్రభుత్వం 57 రెవెన్యూ డివిజన్లకు కొత్త ఆర్డీవోలను నియమించింది. పాత అధికారులను బదిలీ చేసింది. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి చిక్కులు వచ్చేలా తెరవెనక మంత్రాంగం నడిపారన్న ఆరోపణలున్నాయి.
ఈయనో తిమింగలం
గత ప్రభుత్వంలో ఓ ఉపముఖ్యమంత్రి వద్ద పనిచేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఓ సీనియర్ మంత్రి వద్ద పీఎ్‌సగా పనిచేస్తున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేడర్‌లో ఉండే ఈయన చేసే పనులు గవర్నర్ స్థాయిలో ఉంటాయి. ఆయన తలుచుకుంటే గవర్నర్‌కు ఉండే అధికారాలను కూడా తన చేతిలోకి తీసుకుని పెత్తనం చెలాయిస్తారన్న పేరుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం.. ఇటీవల ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ను తన పేషీకి రావాలని హుకుం జారీచేశారు. సాధారణంగా వర్సిటీల విసీలను పిలిచి మాట్లాడే అధికారం గవర్నర్‌కే ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రులు సైతం వీసీలో మర్యాదగా మాట్లాడుతారు. కానీ, సీనియర్ మంత్రి వద్ద పనిచేస్తున్న పీఎస్ అంతకంటే ఎక్కువ. అందుకే తాము చెప్పిన పనిచేయడం లేదని తీవ్ర ఒత్తిడి చేసేందుకు వర్సిటీ వీసీని తన పేషీకి పిలిపించారు. ప్రభుత్వం ఇటీవల రంగా వర్సిటీ పరిధిలో 160 మందిని బదిలీ చేసింది. అయితే, వీరిలో తిరిగి 18 మందిని పాత స్థానాల్లోనే కొనసాగించాలని పీఎస్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై పలుమార్లు వర్సిటీ వీసీపై ఒత్తిడి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా 18 మందిని తిరిగి పాత స్థానాల్లో కొనసాగించడం(రిటైన్) కుదరదని వీసీ స్పష్టం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన వీసీని సైతం తన చాంబర్‌కు రావాలని ఆదేశించారు. ఆ 18 మందిని తిరిగి వర్సిటీలో సర్దుబాటు చేయాల్సిందేనని వీసీపై తీవ్ర ఒత్తిడి చేశారు. అయినా ఆ వీసీ అంగీకరించలేదు. ఇది మంత్రికి తెలియకుండానే జరిగిందనుకోవాలా? లేక మంత్రే తన పాత్ర కనిపించకుండా పీఎ్‌సను ముందుపెట్టి వ్యవహారం నడిపించారనుకోవాలా? అనేది అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏవో కేడర్ అధికారులకు బకాయిలు విడుదలయ్యాయి. వాటిని చెల్లించేందుకు ఈ పీఎస్ చాలా తతంగమే నడిపారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లోనూ కోరుకున్న వారికి కోరుకున్న చోట పోస్టింగ్ కోసం ‘పెద్ద కౌంటరే’ తెరిచారని, కొన్ని పోస్టులకు వేలంపాట నిర్వహించారని అధికార వర్గాలు, ఉద్యోగులు మండిపడుతున్నారు. నిజానికి ఈయనపై నిఘా విభాగం నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఓ మంత్రికి పీఎ్‌సగా పనిచేస్తున్న క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు, ఇంజనీర్లు, ఇతర సిబ్బంది వద్ద పదోన్నతుల విషయంలో భారీగా డబ్బు వసూలు చేశారని వివరించింది. అయినా.. సీనియర్ మంత్రి ఏరికోరి ఈయన్నే పీఎ్‌సగా నియమించుకున్నారు.
ముఖ్యమంత్రి చెప్పినా!!
గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారిని పీఎస్, ఓఎస్డీలుగా తీసుకోవద్దని సీఎం చంద్రబాబు చెప్పారు. అయినా, ఈ సీనియర్ మంత్రి గత ప్రభుత్వంలో అవినీతిలో నిండా మునిగిపోయిన అధికారినే ఏరికోరి పీఎ్‌సగా తీసుకున్నారు. ఇక, ఈయనపై అత్యాచారం కేసుతోపాటు అవినీతి కేసులు బాగానే ఉన్నాయి. మూడుసార్లు సస్పెండ్ అయ్యారు. మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆయనను ఎందుకు కొనసాగిస్తున్నారన్నది కీలక ప్రశ్న. ఓ మహిళను లాడ్జీకి తీసుకెళ్లి బలత్కారం చేయబోయిన కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఆ కేసులో ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ కేసులో రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. ఇలాంటి అధికారి ఓ మహిళా మంత్రికి పీఎ్‌సగా ఉండొచ్చా? అనేది మౌలిక ప్రశ్న. ఇలాంటి వారిపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
గతంలో టీడీపీ పోరాటం
2022 బ్యాచ్‌లోని 27 మందికి కీలకమైన డివిజన్లు ఇచ్చేలా ఓఎ్‌సడీ చక్రం తిప్పారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా 2022 బ్యాచ్ గ్రూప్-1 నియామకాలపై నిరసన తెలిపింది. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని, 2022 బ్యాచ్ కింద ఎంపిక వారిని ఆర్డీవోలుగా, ఎన్నికల అధికారులుగా నియమించవద్దని పెద్ద పోరాటమే చేసింది. ఇప్పుడు ఈ రెవెన్యూ అధికారి మంత్రాంగంతో ప్రభుత్వం 57 ఆర్డీవో పోస్టులకుగాను 27 పోస్టులను 2022 బ్యాచ్వారికే కట్టబెట్టింది. ఈ నియాకాలపై మళ్లీ విచారణ డిమాండ్ తెరమీదకు రాకుండా ఉండేందుకు సదరు రెవెన్యూ అధికారి భారీ సెటిల్మెంట్ చేశారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.