Share News

AP News: వెలంపల్లి రాజకీయానికి.. కాపు యువకుడి బలి!

ABN , Publish Date - Feb 16 , 2024 | 03:58 AM

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని దేవీనగర్‌కు చెందిన కైకాల చరణ్‌ మృతిపై కాపు నాయకులు భగ్గుమంటున్నారు.

AP News: వెలంపల్లి రాజకీయానికి.. కాపు యువకుడి బలి!

వెలంపల్లి రాజకీయానికి.. కాపు యువకుడి బలి!

విజయవాడలో కైకాల చరణ్‌

అనుమానాస్పద మృతి

ఎమ్మెల్యే వెలంపల్లి వేధింపులు

తట్టుకోలేకేనని కాపు సంఘాల ఆగ్రహం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని దేవీనగర్‌కు చెందిన కైకాల చరణ్‌ మృతిపై కాపు నాయకులు భగ్గుమంటున్నారు. సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్‌ ఒత్తిళ్ల కారణంగా చరణ్‌ చనిపోయాడని కాపు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దేవీనగర్‌కు చెందిన చరణ్‌ తొలి నుంచీ వైసీపీలో చురుగ్గా తిరిగేవారు. మల్లాది విష్ణు అనుచరుడిగా గుర్తింపు పొందారు. అదే సమయంలో చరణ్‌పై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడని, పలువురి వద్ద అప్పులు చేసి ఇవ్వకుండా తిప్పుకొంటున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.

వెలంపల్లి సెంట్రల్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చరణ్‌ వెలంపల్లికి మద్దతుగా బ్యానర్లు కూడా కట్టారు. ఆతర్వాత ఏం జరిగిందో కానీ చరణ్‌ తన మాట వినడం లేదంటూ వెలంపల్లి అతడిని దూరం పెట్టడం ప్రారంభించారు. మరోవైపు చరణ్‌కు అప్పులు ఇచ్చిన వారిని ఎగదోసి అతనిపై ఒత్తిడి పెంచేవిధంగా చేశారని, పోలీసులతో పాత కేసులను తిరగదోడించారని వెలంపల్లిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు ఓవైపు, పోలీసుల ఒత్తిడి మరోవైపు తట్టుకోలేక చరణ్‌ మూడు నాలుగు రోజులుగా విపరీతంగా మద్యం తాగుతూ బయటకు రావడం లేదు. గురువారం ఉదయం చరణ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈలోగానే చరణ్‌ మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే చరణ్‌ ఇంటికి ఎమ్మెల్సీ రుహుల్లా చేరుకుని, అంత్యక్రియలు అయ్యే వరకు అక్కడే ఉన్నారు.

కాపులంటే వెలంపల్లికి ద్వేషం

వెలంపల్లి శ్రీనివాసరావుకు తొలి నుంచీ కాపులంటే ద్వేషమని కాపు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ‘2023 జనవరిలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో వెలంపల్లి వాగ్వాదానికి దిగి పరుషపదజాలంతో దూషించడంతోపాటు కాపు సామాజికవర్గాన్నీ కించపరిచేలా ‘కాపు రౌడీలు’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు కాపు నేత సి.రామచంద్రయ్యను, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను వెలంపల్లి అసభ్యపదజాలంతో దూషించారు’ అని ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు పేర్కొన్నారు.

కాగా, కైకాల చరణ్‌ మృతికి వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆల్‌ ఇండియా కాపు ఫెడరేషన్‌ కార్యదర్శి ఏటీ రామారావు ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి మృతి చెందడం అనుమానాలకు తావిస్తోందన్నారు. చరణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయనీయకుండా ఖననం చేశారని విమర్శించారు. వెలంపల్లి తన రాజకీయ అవసరాలకు చరణ్‌ను బలి చేశారని ఆరోపించారు.

Updated Date - Feb 16 , 2024 | 08:20 AM