AP Politics : కాకనాడే సిటీలో టీడీపీ, వైసీపీ హోరా హోరీ
ABN , Publish Date - May 12 , 2024 | 04:29 AM
కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈసారి పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు...,
సిటీలో టీడీపీ, వైసీపీ హోరాహోరీ
వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి
కూటమి తరఫున బరిలో వనమాడి
కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈసారి పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు, వైసీపీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మరోసారి బరిలోకి దిగారు. గత ఐదేళ్లలో సీఎం జగన్ సంపూర్ణ అండదండలతో ద్వారంపూడి ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్థానిక ప్రత్యర్థి వరకు ఎవరినైనా పచ్చిబూతులు తిడుతున్న ఆయనపైౖ నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అటు టీడీపీ అభ్యర్థి కొండబాబుకు సౌమ్యుడిగా పేరు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన బీసీ నేత. అయితే ఆర్థికంగా అంత బలవంతుడు కాదు. కాపులు, మత్స్యకారుల్లో ద్వారంపూడిపై తీవ్ర అసంతృప్తి తనకు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ద్వారంపూడిని ఓడించేందుకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కొండబాబుకు కలిసివచ్చే అంశం.
అక్రమాల ద్వారంపూడి
ఈ ఐదేళ్లలో ద్వారంపూడి రకరకాల అక్రమ వ్యాపారాలతో ఓ సామ్రాజ్యాన్నే స్థాపించారు. రేషన్ బియ్యం వ్యాపారం నుంచి అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, దందాలు, రౌడీయిజంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తాన్నీ శాసించారు. రేషన్‌బియ్యం రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి వందల కోట్లలో ఆర్జించారు. తన తండ్రికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పదవి, తమ్ముడికి మిల్లర్ల సంఘం అధ్యక్ష పదవి తెచ్చుకున్నారు. గ్రావెల్ తవ్వుకుని రూ.500 కోట్లకుపైగా సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్తిపాడులో తన సోదరుడి రొయ్యల ఫ్యాక్టరీకి రూ.24 కోట్ల ప్రభుత్వ నిధులతో బ్రిడ్జి నిర్మించారు.
పేకాట క్లబ్‌లతో రెండుచేతులా సంపాదించారు. ఉమ్మడి జిల్లాలో పేదల ఇళ్లకు భూముల కోనుగోళ్లలో రూ.250 కోట్లకుపైగా సంపాదించారు. ఇళ్లస్థలాల చదును కాంట్రాక్టులు కూడా ఆయనే చేశారు. టీడీఆర్ బాండ్ల పేరుతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి వందల కోట్లు ఆర్జించారు. సీఎం అండదండలు చూసుకుని తరచూ చంద్రబాబు, పవన్, లోకేశ్‌లను దుర్భాషలాడుతూ వచ్చారు. దీంతో ఈసారి ఆయన ఎలా గెలుస్తారో చూస్తానని పవన్ గతేడాది వారాహి యాత్రలో హెచ్చరించారు.
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటే..
టీడీపీ ఆవిర్భావం నుంచి కాకినాడ సిటీ టీడీపీకి కంచుకోటగానే ఉంది. 1983 నుంచి పది సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు ఆ పార్టీ గెలుపొందింది. 1983, 85ల్లో ముత్తా గోపాలకృష్ణ విజయం సాధించారు. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1994లో మళ్లీ ముత్తా గోపాలకృష్ణ, 1999లో వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున గెలిచారు. 2004లో గోపాలకృష్ణ కాంగ్రె్‌సలో చేరి గెలిచారు.
2009లో కాంగ్రెస్ నుంచి ద్వారంపూడి ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ అభ్యర్థి వనమాడి ఆయన్ను ఓడించారు. 2019లో వనమాడి ఓడిపోయారు. టీడీపీ ఓట్లను జనసేన చీల్చడమే దీనికి ప్రధాన కారణం. ఈసారి రెండు పార్టీలూ కలిసి పోటీచేస్తుండటంతో గెలుపుపై ధీమా నెలకొంది.
- కాకినాడ, ఆంధ్రజ్యోతి
కొండబాబు బలాలు..
సౌమ్యుడు.. మత్స్యకారుల్లో పట్టు, నిరంతరం ప్రజల్లో ఉండడం, బలమైన టీడీపీ కేడర్. పవన్ కాకినాడ పార్లమెంట్ పరిధిలో పోటీచేస్తుండడం.
బలహీనతలు..
ప్రతిపక్షంలో ఉండటం,
ఆర్థికంగా బలంగా లేకపోవడం.
ద్వారంపూడి బలాలు..
ఆర్థికంగా సంపన్నుడు.. వైసీపీ ఓటుబ్యాంకు... పోల్ మేనేజ్మెంట్లో అనుభవం.
బలహీనతలు..
విచ్చలవిడి అవినీతి, అడ్డూఅదుపూలేని బూతులు, దూకుడు స్వభావం.
నియోజకవర్గ స్వరూపం..
(కాకినాడ కార్పొరేషన్‌లోని 43 వార్డులు)
మొత్తం ఓటర్లు: 2,49,297
పురుషులు: 1,19,496..
మహిళలు: 1,29,660
ట్రాన్స్జెండర్లు: 103
కీలక సామాజిక వర్గాల ఓటర్లు...
కాపులు-54 వేలు, మత్స్యకారులు-48 వేలు, ఎస్సీలు-42 వేలు,
శెట్టిబలిజలు-22 వేలు, ముస్లింలు-16 వేలు, బ్రాహ్మణులు-11 వేలు,
ఆర్యవైశ్య-10 వేలు, యాదవ-8 వేలు.