Share News

TDP Office: చేసిందెవరు.. చేయించిందెవరు!?

ABN , Publish Date - Jul 02 , 2024 | 03:27 AM

ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు జరిపిన దాడిపై రెండున్నర సంవత్సరాల తర్వాత దర్యాప్తు మొదలైంది.

TDP Office: చేసిందెవరు.. చేయించిందెవరు!?

  • టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రారంభమైన దర్యాప్తు

  • రెండు రోజులుగా వాంగ్మూలాలు నమోదు

  • సీసీ టీవీ ఫుటేజ్‌ కోరిన పోలీసు శాఖ

  • దాడి చేసిన వారిని గుర్తించేందుకు చర్యలు

  • రాష్ట్రాన్ని వదిలిపోయిన అనుమానితులు..!

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు జరిపిన దాడిపై రెండున్నర సంవత్సరాల తర్వాత దర్యాప్తు మొదలైంది. ప్రభుత్వం మారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటనపై పోలీస్‌ శాఖలో కదలిక రావడం విశేషం. గత రెండు రోజులుగా పోలీస్‌ అధికారులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి దాడికి ప్రత్యక్ష సాక్షులు, ఆ దాడిలో గాయపడిన కార్యాలయ సిబ్బంది, పార్టీ నేతల స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకొంటున్నారు. 2021 సంవత్సరం అక్టోబరు 19న ఇక్కడి మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఈ దాడి జరిగింది. ఒక రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై మరో పార్టీ దాడికి దిగడం ఇదే ప్రథమం కావడంతో ఈ సంఘటన పెద్ద సంచలనం కలిగించింది.


Mangalagiri-TDP-Office.jpg

వాహనాల్లో రాడ్లు, కర్రలు, రాళ్లు పట్టుకొని వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయ గేట్లు విరగొట్టుకొంటూ లోపలికి వచ్చి కుర్చీలు, బల్లలు, అద్దాలు విరగగొట్టి విధ్వంసం సృష్టించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు, కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరికి తలలు పగిలాయి. రాష్ట్రంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందని టీడీపీ చేసిన విమర్శపై వైసీపీ అగ్ర నేతలు ఆగ్రహించారు. వారు పురికొల్పడంతో వైసీపీ కార్యకర్తలు, కొందరు రౌడీ షీటర్లు కలిసి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారని అప్పట్లో తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఈ సంఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం కలిగించినా వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు అప్పట్లో దీనిని పట్టించుకోలేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా దర్యాప్తు మొదలు పెట్టలేదు. నాటి ఫిర్యాదుపై మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్నవారెవరు? వారిని ప్రేరేపించిన వారెవరు? అన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించారు.


TDP-Office-2.jpg

నాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు వైసీపీ కన్వీనర్‌ దేవినేని అవినాశ్‌ అనుచరగణం ఈ దాడిలో పాల్గొన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దాడిలో పాల్గొన్నవారిని గుర్తించడం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజి కోసం పోలీసులు అధికారికంగా దరఖాస్తు చేశారు. దాడి జరిగిన రోజే టీడీపీ నేతలు ఆ ఫుటేజిని తీసి భద్రపర్చారు. అప్పట్లోనే పోలీసులకు దానిని అందచేసినా వారు పట్టించుకోలేదు. వైసీపీ అగ్ర నేతల ఆదేశం లేకుండా టీడీపీ కార్యాలయంపై దాడికి సాహసించరని, ఆ అగ్ర నేతలు ఎవరో గుర్తించాలని పోలీస్‌ శాఖ భావిస్తోంది. దాడి చేసిన వారు, వారి నేతలు, ఇతర వైసీపీ నేతలకు వచ్చిన ఫోన్లు... తదితర సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు వినికిడి. ఈ సంఘటనపై దర్యాప్తు ముమ్మరం కావడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. విషయం తెలియగానే అనుమానితుల్లో కొందరు రాష్ట్రం వదిలిపోయారని ప్రచారం జరుగుతోంది.

uu.jpg

Updated Date - Jul 02 , 2024 | 08:26 AM