Nagababu: వైసీపీ వాళ్లు అప్పుడే కుక్కల్లాగా వెంటపడుతున్నారు: నాగబాబు
ABN , Publish Date - Jul 21 , 2024 | 01:13 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వంపై శవరాజకీయాలు మొదలుపెట్టిన వైఎస్సార్‌సీపీపై జనసేన కీలక నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని, అప్పుడే వైసీపీ వాళ్లు మొరగడం ప్రారంభించారని మండిపడ్డారు.
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వంపై శవరాజకీయాలు మొదలుపెట్టిన వైఎస్సార్‌సీపీపై జనసేన కీలక నేత నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని, అప్పుడే వైసీపీ వాళ్లు మొరగడం ప్రారంభించారని మండిపడ్డారు. ‘‘మేము కనీసం ఆరు నెలలు అయినా ఆగి చూశాం. వైసీపీ వాళ్లు నెల రోజులకే కాట్ల కుక్క లాగా వెంట పడుతున్నారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతాం. మీరు చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుంది. చేసిన అవినీతి, అక్రమాలకు చట్ట పరంగా శిక్ష తప్పదు. జగన్ ఆయన జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వలేదు. ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమే వారి పని. గత ఐదేళ్లల్లో వారు చేసిన నేరాలు, ఘోరాలు బయటపెడతాం’’ అని విమర్శించారు.
సీఎంగా అబద్ధాలు చెప్పడంలో జగన్‌కు డాక్టరేట్ ఇవ్వాలని నాగబాబు తీవ్రంగా విమర్శించారు. ‘‘రైతులు ఆత్మహత్య చేసుకుంటే జరగలేదని చెప్పాడు. కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణంగా జగన్ ప్రచారం చేశాడు. నేడు ఏపీలో రాష్ట్రపతి పాలన అని అడగటానికి జగన్‌కు సిగ్గుండాలి. ఇంతకంటే దిగజారకండి అనిచెప్పే కొద్దీ ఇంకా దిగజారుతున్నారు. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణ యుగం నడుస్తుంది. కేంద్రం సహకారంతో ప్రజా పాలన అందరూ చూస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను నాగబాబు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
‘‘జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్ధంగా పని చేశారు. మా పార్టీ కోసం పని చేసిన వారి కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఆయన కష్టార్జితాన్ని బీమా కింద సొమ్మును చెల్లించారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అధినేత అండగా నిలిచారు. రూ.17.45 కోట్లు ఇప్పటివరకు బీమా కింద మృతుల కుటుంబాలకు అందజేశామని చెప్పారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఎన్నో ఇబ్బందులు చూశాం. అనారోగ్యం పెద్దది అయితే చికిత్సకు డబ్బులు లేని పరిస్థితి. ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం అనేక పాట్లు పడుతుంది. జనసేన కార్యకర్తలు అలా బాధలు పడకూడదనే మా అధ్యక్షులు ఇలా భరోసా ఇచ్చారు’’ అని నాగబాబు పేర్కొన్నారు.
నాకు పదవులపై కోరిక లేదు: నాగబాబు
ప్రతి ఒక్కరూ ఇవాళే (ఆదివారం) బీమా కట్టుకోవడం అలవాటు చేసుకోవాలని జనసేన శ్రేణులకు సూచించారు. పవన్ కల్యాణ్ మూడు వేల మంది రైతులకు లక్ష చొప్పున ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒక నిర్మాతగా తాను నష్టపోతే తమ్ముడు అండగా నిలిచాడని నాగబాబు గుర్తుచేసుకున్నారు. ‘‘ నేను కూడా నా వంతుగా ఎంతో కొంత సాయం అందిస్తా. నాకు ఎటువంటి పదవులపై కోరిక లేదు. పవన్ కల్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు నాకు చేతనైనంత చేస్తా. నాకు ఓపిక ఉన్నంత వరకు జనసేన కోసం పని చేస్తా. కూటమి అధికారంలోకి రావడం ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల సారధ్యంలో ప్రజలకు మంచి జరుగుతుంది’’ అని నాగబాబు స్పష్టం చేశారు.