రియల్టీలోకి పీఈ పెట్టుబడులు రూ.25,000 కోట్లు
ABN , Publish Date - Jul 18 , 2024 | 04:37 AM
ఈ ఏడాది ప్రథమార్ధంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 15 శాతం వృద్ధి చెంది 300 కోట్ల డాలర్లుగా (రూ.25,200 కోట్లు) నమోదయ్యాయి. ప్రధానంగా వేర్‌హౌసింగ్ రంగంలోకి...
నైట్‌ఫ్రాంక్ ఇండియా వెల్లడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ ఏడాది ప్రథమార్ధంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 15 శాతం వృద్ధి చెంది 300 కోట్ల డాలర్లుగా (రూ.25,200 కోట్లు) నమోదయ్యాయి. ప్రధానంగా వేర్‌హౌసింగ్ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తడం ఈ వృద్ధికి దోహదపడింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. మొత్తం పీఈ పెట్టుబడుల్లో 52 శాతం వాటాతో వేర్‌హౌసింగ్ రంగం అగ్రగామిగా ఉండగా రెసిడెన్షియల్ విభాగం 29 శాతం, ఆఫీస్ విభాగం 20 శాతం వాటా సాధించాయి. 2018 నుంచి పీఈ పెట్టుబడుల ఆకర్షణలో వేర్‌హౌసింగ్ రంగం అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. ఆఫీస్, రిటైల్, రెసిడెన్షియల్ రంగాలు మూడూ ఉమ్మడిగా ఆకర్షించిన పెట్టుబడులకు సమానంగా పెట్టుబడులు ఆకర్షించింది.
హైదరాబాద్ రియల్టీలోకి రూ.3,000 కోట్లు: ఇదిలా ఉండగా హైదరాబాద్ రియల్టీ రంగంలోకి పీఈ పెట్టుబడులు ఈ ఏడాది ప్రథమార్ధంలో 12 శాతం పెరిగి 35.7 కోట్ల డాలర్లకు (రూ.2,998 కోట్లు) చేరాయి. అందులో కూడా 74 శాతం పెట్టుబడులు అంటే 26.5 కోట్ల డాలర్లు (రూ2,226 కోట్లు) ఆఫీస్ విభాగంలోకి రాగా మిగతా 9.2 కోట్ల డాలర్లు (రూ.772 కోట్లు) రెసిడెన్షియల్ రంగంలోకి వచ్చాయి.