Share News

ఇళ్ల అమ్మకాల్లో 41% వృద్ధి

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:03 AM

రియల్టీ మార్కెట్‌ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 1,20,640 నివాస గృహాలు, ఫ్లాట్లు అమ్ముడుపోయాయి...

ఇళ్ల అమ్మకాల్లో 41% వృద్ధి

  • హైదరాబాద్‌లో 40% అప్‌

  • లగ్జరీ ఫ్ల్లాట్లకే యమ గిరాకీ

  • ప్రాప్‌ టైగర్‌ వెల్లడి

న్యూఢిల్లీ: రియల్టీ మార్కెట్‌ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 1,20,640 నివాస గృహాలు, ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 41 శాతం ఎక్కువ. ఇందులో 74 శాతం గృహాలు, ఫ్లాట్లు ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ ప్రాంతం, పుణెల్లో అమ్ముడైనట్లు హౌసింగ్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌.కామ్‌ నివేదిక వెల్లడించింది.

రూ.1,10,880 కోట్ల టర్నోవర్‌: విలువపరంగా చూసినా ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్లు, ఫ్లాట్ల విలువ రూ.66,155 కోట్ల నుంచి 68ు పెరిగి రూ.1,10,880 కోట్లకు చేరింది. అన్నిటికంటే ప్రధాన అంశం ఈ ఏడాది జనవరి-మార్చిలో అమ్ముడైన ఇళ్లు, ఫ్లాట్లలో రూ.కోటి అంతకంటే ఖరీదైన ఇళ్లు, ఫ్లాట్ల వాటా 37 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11ు ఎక్కువ. ఇదే సమయంలో రూ.25 లక్ష ల వరకు విలువ ఉండే ఇళ్ల అమ్మకాలు 15ు నుంచి 5 శాతానికి, రూ.25-45 లక్షల మధ్య ఉండే ఇళ్ల అమ్మకాలు 23ు నుంచి 17 శాతానికి పడిపోయాయని పేర్కొంది.

హైదరాబాద్‌ అదుర్స్‌

హైదరాబాద్‌లోనూ ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు 40 శాతం వృద్ధి రేటుతో 10,200 యూనిట్ల నుంచి 14,290 యూనిట్లకు చేరాయి. ఇక విలువపరంగా చూసినా హైదరాబాద్‌లో అమ్ముడైన ఇళ్లు, ఫ్లాట్ల విలువ 143 శాతం వృద్ధి రేటుతో రూ.9,711 కోట్ల నుంచి రూ.23,580 కోట్లకు చేరింది. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో తప్ప ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో మరే నగరంలోనూ ఇళ్ల అమ్మకాలు ఇంత భారీ సాయిలో జరగలేదు. అమ్ముడైన ఇళ్ల విస్తీర్ణపరంగా చూస్తే మాత్రం 3.5 కోట్ల ఎస్‌ఎఫ్‌టీతో హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.

Updated Date - Apr 15 , 2024 | 02:03 AM