Share News

కుటుంబ వ్యాపారాల్లో అంబానీ టాప్‌

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:22 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ కుటుం బ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ఈ ఏడాది మార్చి 20 నాటికి...

కుటుంబ వ్యాపారాల్లో అంబానీ టాప్‌

రూ.25.75 లక్షల కోట్లతో అగ్రస్థానం

జాబితాలో 9 తెలుగు వ్యాపార కుటుంబాలు

హురున్‌ ఇండియా బార్‌క్లేస్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ కుటుం బ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ఈ ఏడాది మార్చి 20 నాటికి రిలయన్స్‌ గ్రూప్‌ లి స్టెడ్‌ కంపెనీల ఈక్విటీల్లో అంబానీ కుటుంబ వ్యాపారాల విలువ రూ.25.75 లక్షల కోట్లకు చేరింది. దేశంలో మరే కుటుంబం వ్యాపారాల విలువ ఈ స్థాయిలో లేదని గురువారం విడుదలైన ‘బార్‌క్లేస్‌ ప్రైవేట్‌ క్లయింట్స్‌ హురున్‌ ఇండియా మోస్ట్‌ వాల్యువబుల్‌ ఫ్యామిలీ బిజినెస్‌ నివేదిక’ తెలిపింది. అంబానీ కుటుంబం వ్యాపారాల విలువ ప్రస్తుతం భారత జీడీపీలో పదో వంతు ఉంటుందని అంచనా వేసింది. అంబానీల తర్వాత రూ.7.13 లక్షల కోట్లతో బజాజ్‌ కుటుంబం, రూ.5.39 కోట్లతో బిర్లా కుటుంబం 2,3స్థానాల్లో నిలిచాయి.


అదానీ కుటుంబం

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ కుటుంబ వ్యాపారాల విలువ రూ.15.44 లక్షల కోట్ల వరకు ఉన్నా తొలితరం పారిశ్రామికవేత్త కావడంతో హురున్‌ ఇండియా జాబితాలో చోటు దక్కలేదు. అయితే తొలి తరానికి చెందిన అత్యంత సంపన్న పారిశ్రామిక కుటుంబాల జాబితాలో మాత్రం అదానీలకు చోటు దక్కింది. అదానీల తర్వాత రూ.2.37 లక్షల కోట్లతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అధినేత అధర్‌ పూనావాలా కుటుంబం తొలి తరం సంపన్న పారిశ్రామిక కుటుంబాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ ఏడాది మార్చి 20 నాటికి వీరి ప్రైవేట్‌ పెట్టుబడులు, చరాస్తులను మినహాయించి, కుటుంబ వ్యాపారాల విలువ కనీసం రూ.2,700 కోట్లు ఉన్న కుటుంబాలను మాత్రమే ఈ ఏడాది హురున్‌ ఇండియా సంపన్న కుటుంబాల జాబితాలోకి తీసుకున్నారు.

ముగ్గురి కుటుంబాల ఆస్తి విలువ సింగపూర్‌ జీడీపీకి సమానం

ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్న ముకేశ్‌ అంబానీ, బజాజ్‌ కుటుంబం, కుమార్‌ మంగళం బిర్లా ఉమ్మడి ఆస్తి విలువ46,000 కోట్ల డాలర్లు (దాదాపు రూ.38.27 లక్షల కోట్లు)గా ఉందని, ఇది దాదాపు సింగపూర్‌ జీడీపీకి సమానమని హురున్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

బార్‌క్లేస్‌ హురున్‌ ఇండియా తాజా జాబితాలో తొమ్మిది తెలుగు పారిశ్రామికవేత్తల కుటుంబాలకూ చోటు దక్కింది. ఇందులో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సకు చెందిన జీవీ ప్రసాద్‌ కుటుంబం రూ.1,01,800 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన అవంతి ఫీడ్స్‌, నవ లిమిటెడ్‌ కంపెనీల షేర్లు జెట్‌ జ్పీడ్‌లో దూసుకుపోవడంతో ఆయా కంపెనీల ప్రమోటర్ల కుటుంబాల వ్యాపారాల విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇందులో 1998లో రూ.2 వద్ద కోట్‌ అయిన నవ లిమిటెడ్‌ కంపెనీ షేరు ధర.. ఈ ఏడాది మార్చి 20 నాటికి 285 శాతం లాభంతో రూ.470 వద్ద, 2010లో రూ.2 వద్ద ట్రేడైన అవంతి ఫీడ్స్‌ కంపెనీ షేర్లు ఈ ఏడాది మార్చి 20కి 302 శాతం లాభంతో రూ.492 వద్ద ట్రేడయ్యాయి.


పారిశ్రామికవేత్త కంపెనీ పేరు ఆస్తుల విలువ

కుటుంబం (రూ.కోట్లలో)

జీవీ ప్రసాద్‌ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 1,01,800

దివి మురళి దివీస్‌ ల్యాబ్స్‌ 91,200

ప్రతాప్‌ సీ రెడ్డి అపోలో హాస్పిటల్స్‌ 88,800

పీపీ రెడ్డి మేఘా ఇంజనీరింగ్‌ 75.100

జీఎం రావు జీఎంఆర్‌ గ్రూప్‌ 47,800

బీ పార్థసారథి రెడ్డి హెటిరో ల్యాబ్స్‌ 22,300

బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి సైయెంట్‌ 22,200

జే రామేశ్వర రావు మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ 20,400

మహిమ దాట్ల బయోలాజికల్స్‌ ఈ 15,900

Updated Date - Aug 09 , 2024 | 01:22 AM