Share News

Bangladesh Crisis: 12 ఏళ్ల గరిష్ఠానికి బంగ్లాదేశ్ ద్రవ్యోల్బణం.. ధరల పెరుగుదలతో ప్రజల తీవ్ర అవస్థలు

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:59 PM

బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.

Bangladesh Crisis: 12 ఏళ్ల గరిష్ఠానికి బంగ్లాదేశ్ ద్రవ్యోల్బణం.. ధరల పెరుగుదలతో ప్రజల తీవ్ర అవస్థలు

ఢాకా: బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి. కాగా.. అల్లర్లతో అట్టుడుకున్న దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రమైంది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్ల కోటా వ్యవస్థపై విద్యార్థుల నిరసనల కారణంగా దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. జూలైలో బంగ్లాదేశ్ ద్రవ్యోల్బణం 12 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుందని నివేదిక తెలిపింది.

దేశ గరిష్ఠ ద్రవ్యోల్బణం సరాసరిన 11.66 శాతానికి చేరింది. జూన్‌లో ద్రవ్యోల్బణం స్థాయి 9.72 శాతంగా ఉందని బంగ్లా మీడియా వెల్లడించింది. ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 14.10 శాతం, ఆహారేతర ద్రవ్యోల్బణం 9.68 శాతంగా నమోదైంది. జూన్‌లో ఇది వరుసగా 10.42 శాతం, 9.15 శాతంగా ఉంది. ఇదే ఏడాది మేలో సాధారణ ద్రవ్యోల్బణం రేటు గరిష్టంగా 9.94 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.


జీడీపీ క్షీణిస్తుంది: ఎంఈఐ

బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి రేటు 2025 ఆర్థిక సంవత్సరంలో క్షీణిస్తుందని మాస్టర్ కార్డ్ ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్ (MEI) ఇటీవల అంచనా వేసింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని తెలిపింది. దేశ GDP వృద్ధి 5.7 శాతానికి పడిపోతుందని చెప్పింది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో(FY24) 9.8 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం FY25 లో 8 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.

బంగ్లాదేశ్ నిరసనలు

ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని వర్గాల వారికే అత్యధిక రిజర్వేషన్లు ఇస్తున్నారని.. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రారంభించిన విద్యార్థి ఉద్యమం దేశవ్యాప్తంగా నిరసనలతో జులైలో పతాక స్థాయికి చేరింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం దిగిపోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అదే సమయంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా.. అసమ్మతివాదులపై అణచివేతలు ప్రారంభించారు. ఉద్యమం తీవ్రం కావడంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి.. భారత రాజధాని ఢిల్లీకి పారిపోయారు. బంగ్లాలో జరిగిన ఈ ఘర్షణల్లో జులైలో 230 మందికిపైగా మరణించారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి మరణించిన వారి సంఖ్య 560గా ఉంది. దీంతో ఉన్న పరిశ్రమలు ఇతర దేశాలకు తరలి వెళ్తుండగా.. కొత్తవారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు.

Updated Date - Aug 14 , 2024 | 03:59 PM