Share News

కెనరా బ్యాంక్‌ లాభం రూ.3,757 కోట్లు

ABN , Publish Date - May 09 , 2024 | 05:37 AM

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ నికర లాభం మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి 18 శాతం వృద్ధితో రూ.3,757 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం పుంజుకోవడంతో పాటు...

కెనరా బ్యాంక్‌ లాభం రూ.3,757 కోట్లు

ఒక్కో షేరుకు రూ.16.10 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ నికర లాభం మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి 18 శాతం వృద్ధితో రూ.3,757 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం పుంజుకోవడంతో పాటు మొండిబకాయిలు మరింత తగ్గడం ఇందుకు దోహదపడింది. క్యూ4లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.34,025 కోట్లకు పెరిగింది. అందులో వడ్డీ ఆదాయం రూ.28,807 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.9,580 కోట్లుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 37 శాతం పెరిగి రూ.14,554 కోట్లకు చేరుకుంది. కాగా, 2023-24కు గాను వాటాదారులకు రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.16.10 (161 శాతం) తుది డివిడెండ్‌ చెల్లించాలని బ్యాంక్‌ బోర్డు సిఫారసు చేసింది. మరిన్ని ముఖ్యాంశాలు..


ఈ ఏడాది మార్చి 31 నాటికి కెనరా బ్యాంక్‌ మొండి బకాయిలు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 5.35 శాతం నుంచి 4.23 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.73 శాతం నుంచి 1.27 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గ్రాస్‌ ఎన్‌పీఏలు 3.25 శాతానికి, నికర ఎన్‌పీఏలు ఒక శాతానికి తగ్గవచ్చని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు అన్నారు.

మొండిబకాయిల కోసం కేటాయింపులు కూడా 2,280 కోట్లకు తగ్గాయి. 2022-23 క్యూ4లో మొండిబకాయిల కోసం కేటాయింపులు రూ.2,399 కోట్లుగా నమోదయ్యాయి.

2023 మార్చి చివరినాటికి 87.31 శాతంగా నమోదైన ప్రొవిజన్‌ కవరేజీ రేషియో.. ఈ మార్చి 31 నాటికి 89.10 శాతానికి పెరిగింది.

నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.95 శాతం నుంచి 3.05 శాతానికి మెరుగుపడింది. అయితే, బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న గరిష్ఠ వడ్డీ రేట్ల నేపథ్యం లో ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఎన్‌ఐఎం 2.95-3 శాతానికి పరిమితం కావచ్చని సత్యనారాయణ రాజు అన్నారు.

2023 మార్చి 31 నాటికి 16.68 శాతంగా నమోదైన మూలధన సమర్థత నిష్పత్తి (సీఆర్‌ఏఆర్‌).. ఈ మార్చి చివరినాటికి 16.28 శాతానికి తగ్గింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ రుణాల వృద్ధి 11-12 శాతంగా, డిపాజిట్ల వృద్ధి 9 శాతంగా నమోదు కావచ్చని సత్యనారాయణ రాజు అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు, డిపాజిట్ల విస్తరణకు అదనపు మూలధనం అవసరం లేదన్నారు.


ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ కోసం కేటాయింపులపై ఆర్‌బీఐ విడుదల చేసిన ముసాయిదా సర్క్యులర్‌పై మరింత స్పష్టమైన సమచారం కోరుతున్నామని ఎండీ పేర్కొన్నారు. బ్యాంక్‌ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియో రూ.1.10 లక్షల కోట్ల స్థాయిలో ఉందన్నారు.

ప్రస్తుతం కెనరా బ్యాంక్‌ 9,604 శాఖలను, 10,209 ఏటీఎంలను కలిగి ఉంది. అలాగే, లండన్‌, న్యూయార్క్‌, దుబాయ్‌తోపాటు గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో అంతర్జాతీయ బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది.

ఐపీఓకు అనుబంధ సంస్థలు

కెనరా బ్యాంక్‌ అనుబంధ విభాగాలైన కెనరా హెచ్‌ఎ్‌సబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌లో పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా కొంత వాటాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు సత్యనారాయణ రాజు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఏదైనా ఒక అనుబంధ విభాగం ఐపీఓకు వచ్చే అవకాశం ఉందన్నారు.

Updated Date - May 09 , 2024 | 05:37 AM