ఢమాల్! 1,062 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ABN , Publish Date - May 10 , 2024 | 02:27 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో 1,132 పాయింట్లు పతనమై 72,334 స్థాయికి జారుకున్న సెన్సెక్స్.. చివరికి 1,062.22 పాయింట్ల (1.45 శాతం) నష్టంతో...
22,000 దిగువకి నిఫ్టీ
2 శాతానికి పైగా క్షీణించిన బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు
రూ.7.34 లక్షల కోట్ల సంపద ఆవిరి
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి..
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణే కారణం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో 1,132 పాయింట్లు పతనమై 72,334 స్థాయికి జారుకున్న సెన్సెక్స్.. చివరికి 1,062.22 పాయింట్ల (1.45 శాతం) నష్టంతో 72,404.17 వద్ద స్థిర పడింది. నిఫ్టీ 345 పాయింట్లు (1.55 శాతం) క్షీణించి 21,957.50 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 25 నష్టపోగా.. ఎల్ అండ్ టీ షేరు 6.0 శాతం జారి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. ఏషియన్ పెయింట్స్ 4.68 శాతం క్షీణించగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ షేర్లు మాత్రం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 2.01 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.41 శాతం పతనమయ్యాయి. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులో రూ.7.34 లక్షల కోట్లకు పైగా తరిగిపోయి రూ.393.35 లక్షల కోట్లకు (4.71 లక్షల కోట్ల డాలర్లు) పరిమితమైంది.
21,750 వద్ద మద్దతు: మార్కెట్ మరింత క్షీణించేందుకే అధిక అవకాశాలు కన్పిస్తున్నాయని టెక్నికల్ నిపుణులంటున్నారు. నిఫ్టీ 22,300 తక్షణ మద్దతు స్థాయి దిగువకు పతనమైన నేపథ్యంలో స్వల్పకాలికంగా సూచీ మరింత దిద్దుబాటుకు లోను కావచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు. అయితే, 21,750 స్థాయి వద్ద సూచీకి మద్దతు లభించవచ్చని, 22,100-22,200 వద్ద నిరోధం ఎదురుకావచ్చన్నారు.
15న గో డిజిటల్ ఐపీఓ: కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్ పెట్టుబడులు కలిగిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 15న ప్రారంభమై 18న ముగియనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.1,125 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్, వాటాదారులకు చెందిన 5.47 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనుంది.
భారీగా తగ్గిన వెండి: విలువైన లోహాల ధరలు మరింత తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం గురువారం రూ.50 తగ్గి రూ.72,250 పలికింది. కిలో వెండి రేటు ఏకంగా రూ.1,500 తగ్గి రూ.83,200కు దిగివచ్చింది. అంతర్జాతీయంగా వీటి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు.
మార్కెట్ పతనానికి కారణాలు..
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు దిగుతుండటం మార్కెట్ భారీ క్షీణతకు ప్రధాన కారణం. ఎందుకంటే, ఈసారీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న బలమైన అంచనాల నేపథ్యంలో గడిచిన కొన్ని నెలల్లో మార్కెట్ భారీగా పుంజుకుంది. కానీ, ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పోలింగ్‌లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతూ రావడంతో ఎన్‌డీఏ కూటమి గెలుపు, ఆధిక్యంపై మార్కెట్ వర్గాల్లో సందేహాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేయగలిగే హై నెట్‌వర్త్, సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాలు స్వీకరిస్తున్నారని, మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయం కోసం వేచిచూస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారీగా అమ్మకాలకు పాల్పడటం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈనెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు మన మార్కెట్ నుంచి నికరంగా రూ.15,863 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.6,669 కోట్ల ఇన్వె్‌స్టమెంట్లను వెనక్కి తీసుకున్నారు.
ప్రధాన కంపెనీల మార్చి త్రైమాసిక ఫలితాలు ఫర్వాలేదన్పించినా చాలా వరకు చిన్న, మధ్య స్థాయి కంపెనీల పనితీరు నిరాశాజనకంగా ఉండటం కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.
అమెరికన్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు జాప్యం కావచ్చన్న అంచనాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతోపాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతుండటం సైతం ఈక్వి టీ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.