Google Lays Off Employees: ఉద్యోగులకు గూగుల్ షాక్.. భారీగా తొలగింపు..
ABN , Publish Date - Apr 18 , 2024 | 08:19 AM
Google Lays Off : ఖర్చు తగ్గింపు కారణంతో అల్ఫాబెట్(Alphabet) యాజమాన్యంలోని గూగూల్(Google) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు(Lays Off Employees) కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. ఈ తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని..
Google Lays Off : ఖర్చు తగ్గింపు కారణంతో అల్ఫాబెట్(Alphabet) యాజమాన్యంలోని గూగూల్(Google) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు(Lays Off Employees) కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. ఈ తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని.. ప్రభావిత ఉద్యోగులు అంతర్గత పాత్రల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అయితే, ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు, ఎంత మందిని మళ్లీ రిక్రూట్ చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. తొలగింపునకు గురైన ఉద్యోగుల్లో కొంతమందిని మాత్రం కంపెనీ పెట్టుబడులు పెడుతున్న ఇతర కేంద్రాలకు తరలించడం జరుగుతుందని గూగుల్ ప్రతినిధి తెలిపారు. వీటిలో భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం టెక్ రంగంలో భారీగా ఉద్యోగుల లేఆఫ్స్ ఉంటాయని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. గూగుల్ సహా ప్రముఖ టెక్ సంస్థలు ఆర్థిక అనిశ్చితితో పోరాడుతున్నాయి. ఈ కారణంగా భారీగా లే ఆఫ్‌లు ఉంటాయని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పలువురు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ముందు ముందు మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
‘2023 ద్వితీయార్థంలో, 2024 వరకు కూడా మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తి సాధించేందుకు మా టీమ్‌లలో అనేక మార్పులు చేశాం’ అని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని ఉద్యోగులు ఈ లేఆఫ్‌కు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. గూగుల్ ట్రెజరీ, బిజినెస్ సర్వీస్, రెవెన్యూ క్యాష్ ఆపరేషన్స్ విభాగాల్లోని ఉద్యోగులను ఎక్కువగా తొలగించినట్లు తెలుస్తోంది. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్‌లలో కంపెనీని మరింత విస్తరింపజేస్తామని, సిబ్బందిని వీటిలో అడ్జస్ట్ చేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ సదరు ఉద్యోగులకు ఇమెయిల్ పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
కంపెనీ పెట్టుబడిని పెంచి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ కారణంగా గూగుల్ గత జనవరిలో ఇంజనీరింగ్, హార్డ్ వేర్, అసిస్టెట్ టీమ్‌లతో సహా అనేక బృందాలలో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం ఈ ఏడాది ప్రారంభంలో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండొచ్చని ప్రకటించారు. ఇప్పుడు అదే జరుగుతోంది.