Share News

గృహం మరింత ప్రియం

ABN , Publish Date - Nov 21 , 2024 | 05:56 AM

ప్రజల ఆదాయ, వినియోగాలతో పాటు ఇళ్ల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రఽథమార్ధానికి (ఏప్రిల్‌-సెప్టెంబరు) దేశంలోని 7 ప్రధాన నగరాల్లో

గృహం మరింత ప్రియం

ప్రధాన నగరాల్లో సగటు ధర రూ.1.23 కోట్లు

హైదరాబాద్‌లో రూ.1.15 కోట్లు అనరాక్‌ నివేదిక

న్యూఢిల్లీ: ప్రజల ఆదాయ, వినియోగాలతో పాటు ఇళ్ల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రఽథమార్ధానికి (ఏప్రిల్‌-సెప్టెంబరు) దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అమ్ముడుపోయిన గృహాల సగటు ధర రూ.1.23 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ధరల్లో 23 శాతం వృద్ధి నమోదయింది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత ఖరీదైన ఇళ్లకు గిరాకీ భారీగా పెరగడంతో పాటు రికార్డు స్థాయిలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావడం ఇందుకు కారణమని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ అనరాక్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సగటు విక్రయ ధర రూ.కోటి ఉంది. అనరాక్‌ డేటా ప్రకారం.. ఈ ఏప్రిల్‌-సెప్టెంబరు కాలంలో దేశంలోని ఏడు బడా నగరాల్లో దాదాపు రూ.2,79,309 కోట్ల విలువైన 2,27,400 యూనిట్ల గృహాలు అమ్ముడు పోయాయి. 2023లో ఇదే కాలానికి రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 గృహాల విక్రయాలు జరిగాయి. విక్రయాల సంఖ్య 3 శాతం తగ్గినప్పటికీ విలువ రెండంకెల్లో పెరగడం లగ్జరీ గృహాలకు నెలకొన్న భారీ డిమాండ్‌కు నిదర్శనమని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి అన్నారు.

హైదరాబాద్‌లో 27,820 యూనిట్ల విక్రయాలు

ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి హైదరాబాద్‌ మార్కెట్లో గృహ విక్రయ సగటు ధర 37 శాతం పెరిగి రూ.1.15 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలానికి సగటు ధర రూ.84 లక్షలుగా నమోదైంది. ఇక అమ్మకాల విషయానికి వస్తే 2023-24 ప్రఽథమార్ధంతో పోల్చితే నగరంలో ఇళ్ల విక్రయాలు స్వల్పంగా తగ్గి 29,940 నుంచి 27,820 యూనిట్లకు పరిమితమయ్యాయి. అయినప్పటికీ, సగటు విక్రయ ధర భారీగా పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లోనూ లగ్జరీ ఇళ్లకు గిరాకీ భారీగా పెరిగిందనడానికిదే సంకేతం.

నగరం సగటు ధర (రూ.కోట్లు) వృద్ధి

2023-24 2024-25 (శాతం)

ఢిల్లీ 0.93 1.45 56

బెంగళూరు 0.84 1.21 44

ముంబై 1.47 1.47 --

హైదరాబాద్‌ 0.84 1.15 37

చెన్నై 0.72 0.95 31

పుణె 0.66 0.85 29

కోల్‌కతా 0.53 0.61 16

Updated Date - Nov 21 , 2024 | 05:56 AM