Share News

IRDAI: ఇక ఈ–ఫార్మాట్‌లోనే బీమా పాలసీలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 11:08 AM

బీమా పాలసీలపై పాలసీహోల్డర్ల హక్కులకు సంబంధించి బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

IRDAI: ఇక ఈ–ఫార్మాట్‌లోనే బీమా పాలసీలు

  • 15 రోజుల్లో డెత్‌ క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌: ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: బీమా పాలసీలపై పాలసీహోల్డర్ల హక్కులకు సంబంధించి బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. బీమా కంపెనీలు తప్పనిసరిగా తమ పాలసీలను ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌ (ఈ–ఫార్మాట్‌)లోనే జారీ చేయాలని స్పష్టం చేసింది. అయితే పాలసీదారులు కోరితే, కంపెనీలు ఫిజికల్‌ కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీలకు సంబంధించీ ఐఆర్‌డీఏఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

పాలసీదారులు ప్రపోజల్‌ ఫారాన్ని ఆమోదించిన 15 రోజుల్లో కంపెనీలు పాలసీలు జారీ చేయాలని ఆదేశించింది. ప్రపోజల్‌ ఫారంతో పాటు ప్రీమియం వసూలు చేయడానికీ ఐఆర్‌డీఏఐ చెక్‌ పెట్టింది. మంచి ఆరోగ్యంతో ఉన్నట్టు పాలసీదారులు ప్రకటించిన వెంటనే జారీ చేసే పాలసీలపై మాత్రమే వెంటనే ప్రీమియం వసూలు చేసేందుకు అనుమతిస్తారు. బీమా కంపెనీలు ఇక పాలసీదారులకు పాలసీ డాక్యుమెంట్‌తో పాటు కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ షీట్‌ (సీఐఎస్‌) కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.


  • జీవిత బీమా పాలసీలకు నెల రోజుల ఫ్రీ లుక్‌ పీరియడ్‌. పాలసీదారుడికి పాలసీ నచ్చకపోతే ఈ గడువులోగా పాలసీని రద్దు చేసుకునే స్వేచ్ఛ

  • విజ్ఞప్తి అందిన 15 రోజుల్లో డెత్‌ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌

  • దర్యాప్తుతో ముడిపడిన డెత్‌ క్లెయిమ్స్‌ విజ్ఞప్తి అందిన 45 రోజుల్లో సెటిల్‌ చేయాలి

  • సరెండర్‌ లేదా పాక్షిక ఉపసంహరణ విజ్ఞప్తులను వారం రోజుల్లో పరిష్కరించాలి.

  • డ్యూ డేట్‌లోనే మెచ్యూరిటీ, ఇన్‌కమ్‌, సర్వైవల్‌ బెనిఫిట్స్‌, యాన్యుటీ చెల్లింపులు

  • ప్రపోజల్‌ ఫారంలో పాలసీదారులు తప్పనిసరిగా ఒకరు లేదా ఇద్దరు నామినీల వివరాలు పేర్కొనాలి

  • ఆరోగ్య బీమా పాలసీదారులుకు జారీ చేసే సీఐఎస్‌లో తప్పనిసరిగా పాలసీ పేరు, ఎంత మొత్తానికి బీమా కవరేజీ తీసుకున్నారు? వంటి వివరాలు ఉండాలి


  • క్యాష్‌లెస్‌ క్లెయిమ్స్‌ అనుమతిపై బీమా కంపెనీలు విజ్ఞప్తి అందిన గంట సేపట్లో నిర్ణయం తీసుకోవాలి

  • క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌లను మూడు గంటల్లో సెటిల్‌ చేయాలి

  • హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి కోసం విజ్ఞప్తి అందిన మూడు గంటల్లోగా బీమా కంపెనీలు నిర్ణయం తీసుకోవాలి. ఆ లోగా నిర్ణయం తీసుకోకపోతే అయ్యే అదనపు ఖర్చులను బీమా కంపెనీలే భరించాలి.

  • ట్రీట్‌మెంట్‌ సమయంలో పాలసీదారుడు చనిపోతే క్లెయిమ్‌ విజ్ఞప్తిని బీమా కంపెనీ వెంటనే ప్రాసెస్‌ చేసి సెటిల్‌ చేయాలి

  • ట్రీట్‌మెంట్‌ సమయంలో పాలసీదారుడు చనిపోతే, హాస్పిటల్‌ అతని మృతదేహాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే అప్పగించేలా చూడాలి.

For Latest News click here

Updated Date - Sep 07 , 2024 | 11:08 AM