ప్రైవేట్ వినియోగం పుంజుకుంది: ఆర్బీఐ
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:51 AM
దేశంలో కొంత కాలంగా స్తబ్ధంగా ఉన్న ప్రైవేట్ వినియోగం క్రమంగా గాడిన పడుతోంది. పండుగల సీజన్ పుణ్యమా అని వినియోగం పెరిగింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో
ముంబై: దేశంలో కొంత కాలంగా స్తబ్ధంగా ఉన్న ప్రైవేట్ వినియోగం క్రమంగా గాడిన పడుతోంది. పండుగల సీజన్ పుణ్యమా అని వినియోగం పెరిగింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది స్తబ్ధంగా ఉంది. ఆర్బీఐ తాజా నెలవారీ బులెటిన్‌లో ఈ విషయం వెల్లడించింది. మన దేశీయ డిమాండ్‌కు ప్రైవేటు వినియోగమే ప్రధాన చోదక శక్తి అని పేర్కొంది. మన ఆర్థిక మూలాల అంతర్గత శక్తి ఆధారంగా చూస్తే, మధ్యకాలికంగా మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ బాగానే ఉందని తెలిపింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్‌ను సిద్ధం చేసింది.
ఈ త్రైమాసికం వృద్ధి 6.5 శాతం :ఇక్రా
దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సెప్టెంబరు త్రైమాసికం వృద్ధిరేటును 6.5 శాతానికి కుదించింది. భారీ వర్షాలు, కార్పొరేట్ల బలహీన ఆర్థిక ఫలితాలు వృద్ధికి అవరోధంగా నిలిచాయని పేర్కొంది. అయితే 2025 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనాను 7 శాతంగా యథాతథంగా కొనసాగించింది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని తెలిపింది. రెండో త్రైమాసికం వృద్ధిరేటు గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన ప్రకటించనుంది. మొదటి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధిరేటు నమోదయింది. సేవల రంగం మెరుగుదల ఏడాది మొత్తం మీద జీడీపీ వృద్ధికి ఊతం ఇవ్వవచ్చునని పేర్కొంది.