Share News

RBI: యూకే నుంచి 100 టన్నుల బంగారం వాపస్.. నిల్వలపై నిరంతర సమీక్ష చేయనున్న ఆర్బీఐ

ABN , Publish Date - Jun 03 , 2024 | 08:23 AM

బంగారం నిల్వలపై(Gold Reserves) ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.యునైటెడ్ కింగ్‌డమ్(UK) నుండి దాదాపు 100 టన్నుల బంగారాన్ని (1 లక్ష కిలోగ్రాములు) ఆర్బీఐ(RBI)తన ఖజానాకు తరలించింది.

RBI: యూకే నుంచి 100 టన్నుల బంగారం వాపస్.. నిల్వలపై నిరంతర సమీక్ష చేయనున్న ఆర్బీఐ

ఇంటర్నెట్ డెస్క్: బంగారం నిల్వలపై(Gold Reserves) ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.యునైటెడ్ కింగ్‌డమ్(UK) నుండి దాదాపు 100 టన్నుల బంగారాన్ని (1 లక్ష కిలోగ్రాములు) ఆర్బీఐ(RBI)తన ఖజానాకు తరలించింది.

విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలను రాబోయే నెలల్లో కూడా తరలించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. 1991 తర్వాత భారత్ ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని తిరిగి తీసుకురావడం ఇదే తొలిసారి. ఆర్బీఐ ఈ మధ్య తీసుకున్న బంగారాన్ని ఎక్కడ నిల్వ చేయాలనుకుంటో సమీక్షిస్తోంది.


పెరుగుతున్న బంగారం నిల్వలు

అధికారిక సమాచారం ప్రకారం.. మార్చిలో RBI వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 413.8 టన్నులు విదేశాల్లో నిల్వ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మరో 27.5 టన్నులను తన ఖజానాలో చేర్చింది. గురువారం విడుదల చేసిన FY24 సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం, దేశంలో 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని జారీ చేసిన నోట్లకు బ్యాకింగ్‌గా ఉంచారు.

మరో 100.28 టన్నులు స్థానికంగా బ్యాంకింగ్ విభాగానికి చెందిన ఆస్తిగా ఉన్నాయి. ఆర్బీఐ 2023లో కొనుగోలు చేసిన దానికంటే 2024 జనవరి-ఏప్రిల్‌లో 1.5 రెట్లు ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. “ఆర్‌బీఐ కొన్నేళ్ల నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. దానిని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిర్ణయించుకుంది. ఓవర్సీస్‌లో స్టాక్ పెరుగుతోంది కాబట్టి, కొంత బంగారాన్ని భారత్‌కు తీసుకురావాలని నిర్ణయించాం” అని ఓ అధికారి తెలిపారు.


చాలా దేశాలు తమ బంగారాన్ని యూకేలోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో నిల్వ చేస్తున్నారు. భారత్‌ కూడా స్వాతంత్ర్యం రాకముందు నుండి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో బంగారాన్ని నిల్వ చేస్తోంది. విదేశాల్లో బంగారం నిల్వలు పెరుగుతుండటంతో ఆర్బీఐ ఖజానాకు కొంత బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ నిర్ణయించింది. వచ్చిన బంగారం అంతా ముంబై మింట్ రోడ్‌లోని ఆర్‌బీఐ పాత కార్యాలయ భవనంలో, నాగ్‌పూర్‌లో నిల్వ చేస్తారు. 1991లో దేశం విదేశీ మారకద్రవ్య సంక్షోభంలో ఉన్నందున ఆర్‌బీఐ బంగారం నిల్వలలో కొంత భాగాన్ని తాకట్టు పెట్టడంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

Updated Date - Jun 03 , 2024 | 08:23 AM