Share News

తగ్గిన సిమెంట్‌ ధరలు

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:47 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం సిమెంట్‌ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో అలా్ట్రటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ, శ్రీ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌ వంటి ప్రధాన కంపెనీల సిమెంట్‌...

తగ్గిన సిమెంట్‌ ధరలు

  • కంపెనీలకు కలిసిరాని జూన్‌ త్రైమాసికం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం సిమెంట్‌ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో అలా్ట్రటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ, శ్రీ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌ వంటి ప్రధాన కంపెనీల సిమెంట్‌ అమ్మకాలు 3 నుంచి 9 శాతం పెరిగాయి. అయితే ధరలు తగ్గటంతో కంపెనీల ఆదాయాలు, లాభాలకు గండి పడింది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 50 కిలోల సిమెంట్‌ బస్తా సగటు ధర 3 శాతం తగ్గి రూ.348కు చేరింది. ఇదే సమయంలో ఫ్లైయాష్‌, స్లాగ్‌ వంటి ప్రధాన ముడి పదార్ధాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది కంపెనీల ఆదాయాలు, లాభాలను దెబ్బతీసింది. ఇవి చాలవన్నట్టు పులి మీద పుట్రలా సూర్యుడి భగభగలు, ఎన్నికల ప్రచార హోరుతో నిర్మాణ రంగంలో కార్యకలాపాలకు బ్రేక్‌ పడింది.


ఫ్లాట్‌గా లాభాలు

ఈ కారణంగానే అలా్ట్రటెక్‌ కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో 1.87 శాతం వృద్ధి రేటుతో రూ.18,069.56 కోట్లకు చేరినా నికర లాభం మాత్రం ఫ్లాట్‌గా రూ.1,696.56. కోట్లుగా నమోదు చేసింది. ఏసీసీ నికర లాభాలకైతే జూన్‌ త్రైమాసికంలో 22.46 శాతం గండి పడి రూ.361.40 కోట్లకు చేరింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.5,154.89 కోట్లుగా నమోదైంది. అయితే జూన్‌ త్రైమాసికం నిరాశ పరిచినా భవిష్యత్‌కు మాత్రం ఢోకా లేదని కంపెనీలు కొండంత ఆశాభావంతో ఉన్నాయి. పుంజుకుంటున్న గృహ, మౌలిక సదుపాయాల నిర్మాణం, బడ్జెట్‌లో మౌలిక, గృహ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు కావటం సానుకూల అంశాలుగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

Updated Date - Aug 12 , 2024 | 01:47 AM