Share News

మార్కెట్‌ దూసుకెళ్తోంది.. జర జాగ్రత్త!

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:28 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీతో పాటు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు (శాట్‌) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సూచించారు...

మార్కెట్‌ దూసుకెళ్తోంది.. జర జాగ్రత్త!

సెబీ, శాట్‌కు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూచన

మరిన్ని ట్రిబ్యునల్‌ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సలహా..

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీతో పాటు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు (శాట్‌) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సూచించారు. అంతేకాదు, వ్యవస్థ సుస్థిరత కోసం శాట్‌ మరిన్ని ట్రిబ్యునల్‌ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మార్కె ట్‌ లావాదేవీలు భారీగా పెరగడంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు అమలులోకి తెస్తున్న నేపథ్యంలో ట్రిబ్యునళ్లపై పనిభారం గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో అధికారులు కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలన్నా రు. శాట్‌ కొత్త కార్యాలయంతోపాటు కొత్త వెబ్‌సైట్‌ను గురువారం ప్రారంభించిన సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పెట్టుబడులకు చట్టాలు రక్షణ కల్పించగలవని, వివాదాలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన వ్యవస్థలున్నాయని ఎప్పడైతే మదుపరులు భావిస్తోరో.. వారు మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందు కు అవకాశాలుంటాయని, అలాంటి వాతావరణం దేశంలో పెట్టుబడుల పెరుగుదలకు, ఉద్యోగాల కల్పనకు, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.


స్వలాభం కోసం ఒకరికొకరు హాని చేసుకునే ఆర్థిక ప్రపంచంలో శాట్‌ రిఫరీ పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. అందరూ నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మార్కెట్‌ సత్ప్రవర్తన, కార్పొరేట్‌ పాలన ప్రమాణాల అంశాలకు సంబంధించి శాట్‌ వద్ద అప్పీళ్లు కొన్ని రెట్లు పెరిగిన నేపథ్యంలో ట్రిబ్యునల్‌ సమర్థవంతంగా, పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు శాట్‌లో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని సూచించారు.

మోసగాళ్లపై సమాచారం ఇవ్వండి: బుచ్‌

మార్కెట్లో తప్పుడు పనులకు పాల్పడుతున్న వారి సమాచారం ఇవ్వాలని సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ మార్కెట్‌ వర్గాలను కోరారు. స్వప్రయోజనాల కోసం తప్పుగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయాలన్నారు. ఏదైనా తప్పుడు ప్రవర్తన వ్యవస్థాగత సమస్యగా రూపుదాల్చకుండా, మరిన్ని కఠిన నిబంధనలు ప్రవేశపెట్టే అవసరం లేకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టడమే సెబీ ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 05:28 AM