ఈక్విటీ మదుపరుల సంపద రూ.451 లక్షల కోట్లు
ABN , Publish Date - Jul 10 , 2024 | 02:22 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్ ఒక దశలో 436.79 పాయింట్ల వృద్ధితో 80,397.17 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును తాకి..
24,400 ఎగువ స్థాయికి చేరిన నిఫ్టీ
వాహన, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు జిగేల్
సరికొత్త రికార్డు గరిష్ఠాలకు సూచీలు
మరో 391 పాయింట్ల లాభంతో 80,351 వద్ద ముగిసిన సెన్సెక్స్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్ ఒక దశలో 436.79 పాయింట్ల వృద్ధితో 80,397.17 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును తాకి.. చివరికి 391.26 పాయింట్ల లాభంతో 80,351.64 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. నిఫ్టీ సైతం ఒక దశలో 123.05 పాయింట్లు ఎగబాకి 24,443.60 వద్ద ఇంట్రాడే రికార్డును, చివరికి 112.65 పాయింట్ల లాభంతో 24,433.20 వద్ద కొత్త గరిష్ఠ ముగింపును నమోదు చేసింది.
దీంతో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మరో రూ.1.56 లక్షల కోట్లు పెరిగి రూ.451.27 లక్షల కోట్లకు (5.41 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. దేశీయ, అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో ఈక్విటీ మదుపరులు వాహన, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరపడం ఇందుకు తోడ్పడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులు ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత పెంచాయి.
సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 21 లాభపడ్డాయి. మారుతి సుజుకీ షేరు 6.60 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఎం అండ్ ఎం 2.68 శాతం, టాటా మోటార్స్ 1.24 శాతం పెరిగాయి. పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును మాఫీ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంతో వాహన షేర్లకు డిమాండ్ పెరిగింది.
బ్లూచి్‌పలతో పాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లలోనూ కొనుగోళ్లు జరగడంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 0.36 శాతం, స్మాల్‌క్యాప్ 0.22 శాతం పెరిగాయి.
రంగాలవారీ సూచీల్లో ఆటో అత్యధికంగా 2.17 శాతం పుంజుకుంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ సైతం 2 శాతం రాణించింది. రియల్టీ, కన్స్యూమర్ డిస్‌క్రెషనరీ, హెల్త్‌కేర్ సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి.
ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి రికార్డు నిధులు
గత నెలలో రూ.40,608 కోట్లు రాక
అందులో రూ.21,000 కోట్లు సిప్
ఈ ఏడాది జూన్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లో ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో రూ.40,608 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మే నెలలో వచ్చిన పెట్టుబడుల కంటే ఇది 17 శాతం అధికమని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) తెలిపింది. కాగా, గత నెల క్రమానుగుత పెట్టుబడి పథకాల్లోకి (సిప్) సైతం రికార్డు స్థాయిలో రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చాయని యాంఫీ వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహణలో ఉన్న నికర ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.27.62 లక్షల కోట్లకు చేరుకుందని, అందులో సిప్‌ల ఏయూఎం రూ.12.43 లక్షల కోట్లుగా ఉందని అసోసియేషన్ పేర్కొంది. గత నెలలో 55 లక్షల కొత్త సిప్‌లు రిజిస్టర్ అయ్యాయని, దాంతో మొత్తం సిప్‌ల సంఖ్య 8.98 కోట్లకు చేరుకుందని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని తెలిపారు.
పేటీఎంకు కీలక అనుమతి!
కష్టాల్లో ఉన్న డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు కొంత ఊరట లభించినట్లు తెలిసింది.. తన కీలక అనుబంధ విభాగమైన పేటీఎం పేమెంట్ సర్వీసెస్ వ్యాపారంలో రూ.50 కోట్లు ఇన్వె్‌స్టమెంట్‌కు చైనా పెట్టుబడులను పర్యవేక్షించే ప్రభుత్వ కమిటీ అనుమతి తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పెట్టుబడులకు ఆర్థిక శాఖ కూడా అనుమతివ్వాల్సి ఉన్నప్పటికీ, కమిటీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో కంపెనీకి ప్రధాన అవరోధం తొలిగినట్లయింది. ఈ క్లియరెన్స్ కోసం పేటీఎం రెండేళ్లుగా వేచిచూస్తోంది. మరికొంత కాలంపాటు అనుమతి లభించకపోయి ఉంటే, పేటీఎం తన పేమెంట్స్ సేవల వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి. చైనాకు చెందిన యాంట్ గ్రూప్ పేటీఎంలో పది శాతం వరకు వాటా కలిగి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కమిటీ గతంలో ఈ పెట్టుబడి ప్రతిపాదనను పక్కన పెట్టింది.