Share News

BIS: ఆగస్టులో భారీగా పెరగనున్న చెప్పులు, షూస్ ధరలు.. కారణమిదే

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:26 PM

బీఐఎస్ నూతన నాణ్యతా ప్రమాణాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో పాదరక్షలు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు.

BIS: ఆగస్టులో భారీగా పెరగనున్న చెప్పులు, షూస్ ధరలు.. కారణమిదే

ఇంటర్నెట్ డెస్క్: బీఐఎస్ నూతన నాణ్యతా ప్రమాణాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో పాదరక్షలు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) ప్రకారం.. మార్కెట్లో విక్రయించే బూట్లు, చెప్పులు ఇకపై నూతన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. పాదరక్షల తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు (QCO) ఆగస్టు 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి.


చెప్పుల నాణ్యత పెరిగితే.. వాటి ఖరీదు పెరగడం సాధారణమే. అయితే ఏటా రూ.50 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన తయారీదారులకు బీఐఎస్.. నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. ఇది వరకే తయారు చేసిన పాదరక్షల పాత స్టాక్‌కు కూడా ఈ నియమం వర్తించదు. అమ్మేవారు BIS వెబ్‌సైట్‌లో పాత స్టాక్ వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.మొత్తం మీద ఆగస్టు 1 నుంచి 46 అంశాలు సవరించిన BIS నిబంధనల పరిధిలోకి వస్తాయి. కంపెనీలకు అవగాహన కల్పించడం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేసినట్లు బీఐఎస్ తెలిపింది.

మన్నికగా పాదరక్షలు..

సవరించిన నాణ్యతా నియమం ప్రకారం.. ప్రధానంగా రెక్సిన్, ఇన్సోల్, లైనింగ్ వంటి పాదరక్షలలో ఉపయోగించే ముడి పదార్థాలు రసాయన లక్షణాలను కంపెనీలు పరీక్షించాలి. చెప్పుల బయటి భాగాన్ని తయారు చేయడానికి వాడుతున్న పదార్థాలకు కూడా అన్ని రకాల పరీక్షలు చేయాలి. కొత్త నిబంధనలు పాదరక్షలను బలంగా, మన్నికైనవిగా చేస్తాయి. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే వీటి నాణ్యత పెంచడం ద్వారా ఖర్చు పెరగనుంది. పెరగబోతున్న ఖర్చు నుంచి వినియోగదారులు ఎలా బయటపడాలో బీఐఎస్ తెలపలేదు.


బీఐఎస్ గురించి...

మీ ఇంటిలో కొన్ని వస్తువులకు బీఐఎస్ గుర్తు ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? నాణ్యత.. కొనుగోలుదారుడి హక్కు అని భారతీయ ప్రమాణాల సంస్థ చెబుతోంది. వివిధ వస్తువులు, ఉత్పత్తులు, పరికరాలు సహా అన్నీ బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాల్సిందేనని అధికారులు ఎప్పుడూ చెబుతుంటారు.

దేశ ప్రజలు నిత్యం వినియోగించే దాదాపు 344 వస్తువులకు విధిగా బీఐఎస్ నాణ్యత గుర్తు ఉండాల్సిందే. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న ఫోన్‌లు సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకు బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి. బీఐఎస్ ఇప్పటి వరకూ సుమారు 20 వేల ప్రమాణాలను ధ్రువీకరించి అందుబాటులోకి తీసుకొచ్చింది.


నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం స్విచ్, సాకెట్, కేబుల్ తదితర ఎలెక్ట్రికల్ వస్తువులకు నాణ్యత నిబంధనలను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ని ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) జారీ చేసింది.

ఈ ఆర్డర్ ప్రకారం ఎలక్ట్రిక్ వస్తువులకు బీఐఎస్ గుర్తు తప్పనిసరి చేసింది. లేదంటే వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం సాధ్యం కాదు. బీఐఎస్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, తొలి నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండు ఆపై నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని నిబంధనలు చెబుతున్నాయి.

Changing Rules: ఆగస్టులో ఈ ధరలు పెరుగుతాయ్.. గమనించగలరు


For Latest News and National News click here

Updated Date - Jul 29 , 2024 | 04:26 PM