Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో సీరియల్ కిల్లర్.. ఏకంగా 9 మంది మహిళలను ఒకే మాదిరిగా ఏం చేశాడంటే..?
ABN , Publish Date - Aug 08 , 2024 | 06:27 PM
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ గ్రామీణ ప్రాంతాలను వరుస హత్యలు వణికిస్తున్నాయి. 13 నెలల్లో ఏకంగా 9 మంది మహిళలు ఒకే మాదిరిగా హత్యకు గురయ్యారు. వీరిలో ఎక్కువమందిని వారు కట్టుకున్న చీరతోనే గొంతుకు బిగించి చంపేశారు.
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ గ్రామీణ ప్రాంతాలను వరుస హత్యలు వణికిస్తున్నాయి. 13 నెలల్లో ఏకంగా 9 మంది మహిళలు ఒకే మాదిరిగా హత్యకు గురయ్యారు. వీరిలో ఎక్కువమందిని వారు కట్టుకున్న చీరతోనే గొంతుకు బిగించి చంపేశారు. అంతేకాదు హత్యకు గురైన మహిళలు అందరూ కూడా ఒకే వయసు గ్రూపు వారు కావడంతో ఈ వరుస హత్యలన్నీ ఒక సీరియల్ కిల్లర్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. చీరతో గొంతు బిగించి ప్రాణాలు తీస్తున్నాడని భావిస్తున్నారు.
షాహీ, షీష్‌గఢ్, షెర్‌గఢ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఏడాది 40-65 ఏళ్ల మధ్య వయసున్న 8 మంది మహిళలు హత్యకు గురయ్యారు. అన్ని హత్యల ఘటనల్లోనూ మహిళల మృతదేహాలను చెరకు తోటల్లో దుస్తులు చిందరవందర అయిన స్థితిలో గుర్తించారు. అయితే లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు మాత్రం ఏ హత్యలోనూ కనిపించలేదు. ఎక్కువ హత్యలను వారు వేసుకున్న చీరలతో చేయడం అన్నింటిలోనూ కామన్‌గా ఉంది. గతేడాది జూన్‌లో వరుసగా 3 హత్యలు, జూలై, ఆగస్టు, అక్టోబర్ నెల్లో ఒక్కొక్కటి చొప్పున, నవంబర్‌లో 2 హత్యలు జరిగాయి.
అయితే 8వ హత్య జరిగిన తర్వాత 300 మంది పోలీసులతో కూడిన అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. యూనిఫారంతో కొందరు, సివిల్ దుస్తుల్లో కొందరు మొత్తం 14 బృందాలుగా విడిపోయి ఈ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పెట్రోలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులపై కూడా నిఘా పెట్టారు. దీంతో కొంతకాలం హత్యలు జరగలేదు. గతేడాది నంబర్ నుంచి ఇప్పటివరకు ఒక్క మర్డర్ కూడా జరగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఈ నెల ఆగస్టులో జరిగింది.
జులైలో మరో హత్య..
7 నెలలపాటు ఎలాంటి హత్యా జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్న వేళ గడిచిన నెల జులైలో 9వ హత్య జరిగింది. అనిత అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మునుపటి హత్యల మాదిరిగానే ఆమె మృతదేహాన్ని కూడా చెరకు తోటలోనే గుర్తించారు. షేర్‌ఘర్‌లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఖిర్కా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. జులై 2న డబ్బు విత్ డ్రా చేయడానికి ఇంటి నుంచి బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. చెరకు తోటలో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె చీరతోనే గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్గంలో నిర్ధారణ అయ్యింది.
దీంతో గతేడాది జరిగిన హత్యల వెనుక ఉన్న సీరియల్ కిల్లరే ఈ హత్య కూడా చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జులైలో జరిగిన హత్యను గమనించిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని ఓ అధికారి చెప్పారు. కాగా ఇటీవల హత్య కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అనుమానితుడి స్కెచ్ చిత్రాలను ఇవాళ విడుదల చేశారు. హత్యలు జరిగిన ప్రాంతాలకు చెందిన కొందరితో మాట్లాడిన తర్వాత ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను విడుదల చేశారు. ఏమైనా సమాచారం తెలిస్తే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) కార్యాలయాన్ని సంపద్రించాలని కోరారు.