Share News

విఘ్నేశ్వర జననం..

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:11 AM

విఘ్నేశ్వర జన్మ వృత్తాంతంపై పలు రకాల గాథలున్నాయి. వాటిని ఒక్కొక్క పురాణం ఒక విధంగా వర్ణించింది. వాటిలో వరాహపురాణం పేర్కొన్న విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం తక్కిన పురాణ కథలకు భిన్నంగా ఉంది. ఈ పురాణం విఘ్నేశ్వరుడు ఆకాశం నుంచి జన్మించినట్టు చెప్పింది. రాక్షసుల బాఽధ ఎక్కువ కావడంతో ఆ బాధ నుంచి విముక్తి పొందే ఉపాయం చెప్పమని ఋషులు, దేవతలు శివుడిని అడిగారు.

విఘ్నేశ్వర జననం..

విఘ్నేశ్వర జన్మ వృత్తాంతంపై పలు రకాల గాథలున్నాయి. వాటిని ఒక్కొక్క పురాణం ఒక విధంగా వర్ణించింది. వాటిలో వరాహపురాణం పేర్కొన్న విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం తక్కిన పురాణ కథలకు భిన్నంగా ఉంది. ఈ పురాణం విఘ్నేశ్వరుడు ఆకాశం నుంచి జన్మించినట్టు చెప్పింది. రాక్షసుల బాఽధ ఎక్కువ కావడంతో ఆ బాధ నుంచి విముక్తి పొందే ఉపాయం చెప్పమని ఋషులు, దేవతలు శివుడిని అడిగారు. పరమశివుడు ఈ విషయమై సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఒకసారి తల ఎత్తిఆకాశం వంక చూశాడు. అప్పుడు ఆయన కంటికి అత్యంత సుందరంగా పార్వతీదేవి కనిపించింది.


శివుడు అప్రయత్నంగా ‘పంచభూతాలలో తక్కిన వాటికంతా రూపం ఉండగా ఆకాశానికి ఎందుకు లేదు’ అని ప్రశ్నించాడట! జగజ్జనని అయిన పార్వతిని చూచి పరమశివుడే అట్లా ప్రశ్నించడంతో ఆకాశం పుత్రరూపం దాల్చి శివుడి ఎదుట నిలిచింది. అదెంత సుందర రూపమంటే పార్వతీదేవి కూడా చంచలచిత్తంతో చూసిందట. ఆ బాలుడు ఇతర దేవతా స్త్రీలను కూడా అట్లాగే భ్రమింప చేయడంతో పరమశివుడికి కోపం వచ్చి ‘నీవు ఏనుగు తల, బాన కడుపుతో వికార రూపుడవుకమ్ము’ అని శపించాడు. వెంటనే ఆకాశం నుంచి జన్మించిన బాలుడు ఆ రూపంలోకి మారాడు.


ఈశ్వరుని వల్ల విఘ్నత చెందడంతో ఆయనకు విఘ్నేశ్వరుడనేపేరు వచ్చింది.అంతటితో శివుడి కోపం చల్లారలేదు ఆయన శరీరం చెమర్చింది. ఆ చెమట చుక్కల నుంచి వేనకువేలు గజాస్యులు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత దేవతలంతా పరమశివుడిని ప్రార్థించి శాంతచిత్తుని చేశారు. అలా పుట్టిన గజాస్యులు విఘ్నేశ్వరుని పరివారంగా ఉంటారని, గణాధిపతిగానే కాక ప్రతి కార్యంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడని శివుడు అనుగ్రహించాడు. వరాహపురాణం ప్రకారం విఘ్నేశ్వరుడు ఆకాశ స్వరూపం.

Updated Date - Sep 07 , 2024 | 10:11 AM