Share News

ఎలుక గుర్రపు స్వామి..

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:26 AM

పిండితో చేసి ముద్దుల పిల్లవాని ప్రాణమును పోసి మురిసెను పార్వతమ్మ తండ్రిచే త్రుంచబడినట్టి తలకు బదులు దంతి శిరముంచబడెనంట ఎంత వింత తల్లిదండ్రుల ముద్దుల తనయుడతడు ప్రమధ గణముల గౌరవపాత్రుడతడు

ఎలుక గుర్రపు స్వామి..

పిండితో చేసి ముద్దుల పిల్లవాని

ప్రాణమును పోసి మురిసెను పార్వతమ్మ

తండ్రిచే త్రుంచబడినట్టి తలకు బదులు

దంతి శిరముంచబడెనంట ఎంత వింత

తల్లిదండ్రుల ముద్దుల తనయుడతడు

ప్రమధ గణముల గౌరవపాత్రుడతడు

చల్లగా చూచు భక్తులనెల్ల నతడు

బొజ్జ గణపతియనబడు గుజ్జువేల్పు

చెరకు వడపప్పులన వచ్చు పరుగు లిడుచు

ఏనుగులు అశ్వములు నాకు ఏలటంచు

ఎలుకనే గుర్రముగచేసి యేగుచుండు


విఘ్నపతిగొల్వగలుగును విజయమెపుడు

మారేడు పత్రముల్‌ మరిమరి తెమ్మను

దానిమ్మ పూలపై తగని ప్రీతి

దేవకాంచనపూల దేహముప్పొంగును

తామరతూడుకు తలను వంచు

దర్భపోచల మీద తగని మక్కువ జూపు

వుమ్మెత్త పూలకు వుబ్బిపోవు

గన్నేరు పూలను ఎన్నైన తెమ్మను

వుత్తరేణిని గాంచ చిత్తమలరు


పండ్లు ఫలహారములకన్న భక్తులిచ్చు

పచ్చి గరికెనె తానెంతొ మెచ్చుకొనును

అల్పసంతోషి అందరి యాత్మబంధు

ఎలుక వాహనమెక్కి యేగుచుండు నెవండు

పత్రిపూజలనందు ధాత్రినెవడు

అమ్మ పార్వతిదేవి అనుగు పుత్రుండెవడు


ప్రమధ గణాలకు ప్రథముడెవడు

ముక్కంటి మెప్పించు ముద్దుకుర్రడెవండు

ఆది పూజలనందు నాతడెవడు

ఎల్లజనులను గాచు ఏకదంతుడెవండు

విఘ్నములను బాపు వీరుడెవడు

కుడుములుండ్రాళ్ళనిచ్చిన కులుకునెవడు

గజముఖంబును గల్గిన ఘనుడెవండు

వేల్పులందరు పూజించు వేల్పు ఎవడు

అట్టి దేవుని గొల్తునే ననవరతము

Updated Date - Sep 07 , 2024 | 10:33 AM