Share News

రేవంత్ పాలనకు పెద్ద పరీక్ష హైడ్రా!

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:58 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో తన మార్కును చూపించాలని తహతహలాడుతున్నట్టు హైడ్రా ఏర్పాటు ద్వారా తెలుస్తున్నది. తనకు అవసరమైన పటిష్ట సంఖ్యాబలం కోసం ఇతర పార్టీల నుంచి గెలిచినవారిని చేర్చుకుని, ఇప్పుడు...

రేవంత్ పాలనకు పెద్ద పరీక్ష హైడ్రా!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో తన మార్కును చూపించాలని తహతహలాడుతున్నట్టు హైడ్రా ఏర్పాటు ద్వారా తెలుస్తున్నది. తనకు అవసరమైన పటిష్ట సంఖ్యాబలం కోసం ఇతర పార్టీల నుంచి గెలిచినవారిని చేర్చుకుని, ఇప్పుడు నమ్మకం కుదిరాక ఆయన అసలు అజెండా బయటకు తెస్తున్నారు. రేవంత్‌కు తెలంగాణలో ప్రతి అంగుళం భూమిపై అవగాహన ఉన్నది. అధికారంలోకి రాకముందే హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికను ఎన్నికల ప్రచారంలో చెప్పి నగరవాసుల ఓట్లు అడిగాడు. ఆయన మాటల్ని నగరవాసులు అంతగా పట్టించుకోలేదు.

రోజురోజుకీ కుచించుకుపోతున్న హైదరాబాద్ సిటీని కాపాడటం; అడ్డదారుల్లో ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను పునరుద్ధరించటం; ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు నీటి వనరుల ప్రాంతాలను పునరుద్ధరించడం; అక్రమ కట్టడాలను కూల్చడం; ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో ఉన్న కట్టడాలు, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చడం; వరద నీటి నిర్వహణ; అనుకోని విపత్తుల నుండి నగరాన్ని కాపాడటం; ట్రాఫిక్ నిర్వహణతో పాటు స్థానిక సంస్థలతో సమన్వయం చేస్తూ నగర సంబంధిత విషయాలలో పాలనా సంస్కరణలు పర్యవేక్షించడం... ఇలా ఎంతో విశాల పరిధితో హైడ్రాను ఏర్పాటు చేశారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఉన్న అధికారాలు పరిధిని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు తెల్పింది.


తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్నది. 20–30 ఏళ్లుగా నివాసం ఉంటున్న కట్టడాలను సైతం ఎన్‌ఆర్ఎస్ఎ, అందుబాటులో ఉన్న టౌన్ సర్వే ఆధారిత పత్రాలు, ఇతర అధికారిక పత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చడం రాజకీయ వివాదాలకు కారణమవుతున్నది. గతంలో కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నగరంలో వరదలు వచ్చి చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. అప్పుడు మూసీ నది పరీవాహక ప్రాంతాలతో పాటు నాలాలను అక్రమంగా కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టడంతోనే అసాధారణ రీతిలో వరదలు ముంచెత్తాయని అక్రమ కట్టడాలు కూల్చుతామని, ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని అప్పటి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ సొంత పార్టీ నేతలే కబ్జాలలో ఉన్నందున రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కూల్చివేతలు విరమించుకున్నారు. వరదలు వచ్చినప్పుడు కూల్చివేతలు ఆక్రమణల గురించి ఆర్భాటంగా ప్రకటనలు చేసి తర్వాతి వాటి సంగతి పట్టించుకోని రాజకీయ నాయకులను చూసి చూసి నగర ప్రజలు అలసిపోయారు. రేవంత్ సర్కార్ హైడ్రా పేరిట ఏర్పాటు చేసిన సంస్థ కూడా అలాంటిదే అవుతుందా చివరి వరకు నిలబడుతుందా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతుందా చూడాలి. ఇప్పటికైతే కూల్చివేతల్లో దూకుడుగానే ముందుకు వెళుతుంది. గతంలో టీఆర్‌ఎస్ పాలనలో ఎన్ కన్వెన్షన్ కుల్చుతామని హడావుడి చేసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు హైడ్రా మాత్రం కూల్చివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది.


నగరంలో 1956 నాటికి ఐదు వేలకు పైగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించకపోయినా కనీసం 30 సంవత్సరాల క్రితం నాటి పర్యావరణ పరిస్థితులను తీసుకొని రాగలిగినా హైడ్రా విజయవంతం అయినట్టే. ఇప్పుడు నగరానికే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దీన్ని ఓఆర్‌ఆర్ పరిధికే పరిమితం చేయకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి టెడ్రాగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రియల్‌ ఎస్టేట్ పేరిట చిన్న చిన్న పట్టణాలు, పల్లెటూర్లలో సైతం చెరువులు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమణలకు గురవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి విప్లవాత్మక ప్రభుత్వ విధానాల కోసమే ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ సొంత నాయకుల ఆక్రమణల విషయంలో ఎంతవరకు రాజకీయ ప్రమేయాన్ని అడ్డుకోగలరో కాలమే నిర్ణయించాలి. హైడ్రా పాలక మండలిలో రాజకీయ నియామకాలు ఉంటే గనుక అది మళ్లీ మొదటికే వస్తుంది. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిజమైన స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి, విస్తృత అధికారాలు, రక్షణ కల్పించి తమను తాము నిరూపించుకోవాలి. ఈ కూల్చివేతలలో కొందరు పేదలు కూడా తమ కష్టార్జితంతో కొనుక్కుని కట్టుకున్న ఇళ్లు ఉన్నాయి. వారిపట్ల ప్రభుత్వ వైఖరి చెప్పలేదు. కబ్జాకాలం, ఆక్రమణదారుల చట్టబద్ధత లాంటి అంశాల్లో రెవెన్యూ చట్ట సవరణ చేయాల్సి రావచ్చు. అందుకే ప్రభుత్వం అన్నింటికీ సిద్ధంగా వుండాలి.


ఇటీవల రేవంత్ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుంది, ఇతర రాష్ట్రాలతో కాదని అమెరికా వేదికగా ప్రకటించాడు. ప్రపంచ నగరాల సదుపాయాల కల్పన దిశగా హైదరాబాదును అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థలతో అయ్యేపని కాదు. హైడ్రా లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు మరిన్ని తీసుకుంటేనే అది సాధ్యం. ప్రపంచంలో చాలా నగరాలు పట్టణ ప్రణాళికలను సరిగా అమలు చేయటంలో విఫలమయ్యాయి. అందుకు రాజకీయ, సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. మన దేశంలో కూడా పట్టణ ప్రణాళికల అమలులో ఇవే అవరోధాలుగా మారాయి. సరైన పరిపాలన విధానాలు లేకపోవడం, పన్నుల వ్యవస్థ సక్రమంగా అమలు జరపకపోవడం హైదరాబాద్‌లో అభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారింది. పాతబస్తీలో పన్నుల వసూలు ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలు. మిగిలిన నగరం కడుతున్న పన్నులతో పాతబస్తీకి సౌకర్యాలు కల్పించడం పన్నుల వసూలులో అసమానతలను ఎత్తిచూపుతుంది. ప్రజా రవాణా, భద్రతల విషయంలో కూడా ప్రభుత్వం తీరును మెరుగుపరచుకోకుండా ప్రపంచ స్థాయి నగరంగా ఎదగలేదు.


రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రపంచంతో పోటీ పడాలనుకుంటే తక్షణం రాష్ట్ర పట్టణ ప్రణాళికను ప్రకటించి అమలు చేయాలి. ప్రణాళికలో ప్రాథమిక విషయాలు చాలావరకు పాత విధానాలే ఉన్నప్పటికీ అమలు చేయడం పెద్ద సమస్య. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరంలో అధిక జన సమూహాలను రేవంత్ చెబుతున్న ఫ్యూచర్ సిటీ లాంటి ఔటర్‌కు ఆవల ఉన్న ప్రాంతాలు ఆకర్షించగలగాలి. అక్కడ కనీస మౌలిక సౌకర్యాల కల్పనకు సిద్ధం కావాలి. ప్రజా రవాణాకు కనీసం 30 ఏళ్ళ ప్రణాళికలు సహజ ప్రజా రవాణాను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుకు పూనుకోవాలి.


ఇప్పటికీ హైదరాబాదులో రిస్క్ ప్రివెన్షన్ సిస్టమ్‌ లేదు. చిన్న చిన్న వరదలకు నగరం అతలాకుతలం అవుతుంది. ఆకస్మిక వరదలు వస్తే క్లౌడ్ బరస్ట్ లాంటివి సంభవిస్తే కోపెన్హెగెన్ లాంటి నగరాల్లో భారీ అండర్ వాటర్ టన్నెల్స్ నిర్మించి ఎక్కడికక్కడ నీరు టన్నెల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఔటర్ చుట్టూ, కొత్త నగర నిర్మాణాల్లో ఇలాంటి మోడల్‌ను ప్రవేశపెట్టగలమా అన్నది చూడాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా తట్టుకునే నగరాన్ని నిర్మిస్తేనే ఆధునిక నగరాల సరసన నిలవగలదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే అన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్ పాలనకు ఇప్పుడు ఇది కఠిన పరీక్షలా మారింది. ప్రభుత్వం తమ నాయకుల అక్రమ కట్టడాల విషయంలో ఎలా ముందుకు వెళుతుందో అని సర్వత్రా ఆసక్తి ఉంది. ఆచరణ సాధ్యమైన నియమాలు, తారతమ్య భేదాలు లేని చట్టాలు, ప్రజాస్వామ్యబద్ధ విధానాలు, గౌరవప్రదమైన అమలుతీరుతో ముందుకు వెళ్లాలి.

డా. దొంతగాని వీరబాబు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

Updated Date - Sep 04 , 2024 | 12:58 AM