Share News

లెబనాన్‌పై దాడులు

ABN , Publish Date - Oct 02 , 2024 | 02:09 AM

ఊహించిందే సంభవించింది. ఇజ్రాయిల్ – ఫలస్తీనా సంక్షోభంలోకి లెబనాన్‌ను వ్యూహాత్మకంగా లాగడం అనివార్యమని పశ్చిమాసియా పరిణామాల పరిశీలకులు చెప్పుతూ వచ్చారు. ఇప్పుడు లెబనాన్‌ ఇజ్రాయిల్‌ దాడితో...

లెబనాన్‌పై దాడులు

ఊహించిందే సంభవించింది. ఇజ్రాయిల్ – ఫలస్తీనా సంక్షోభంలోకి లెబనాన్‌ను వ్యూహాత్మకంగా లాగడం అనివార్యమని పశ్చిమాసియా పరిణామాల పరిశీలకులు చెప్పుతూ వచ్చారు. ఇప్పుడు లెబనాన్‌ ఇజ్రాయిల్‌ దాడితో సరిగ్గా అదే జరిగింది. అరబ్బు దేశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ వెళ్ళలేని ప్రదేశం ఏదీ లేదని లెబనాన్‌పై దాడి అనంతరం ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. దక్షిణా లెబనాన్ వైపు తమ సేనలను పంపిస్తూ పొరుగున ఉన్న సిరియాపై సైతం దాడులకు ఇజ్రాయిల్‌ నాంది పలికింది. తత్ఫలితంగా పశ్చిమాసియాలో రాజకీయ అలజడి, ఆందోళనలు ముమ్మరమయ్యాయి. అమెరికాపై అరబ్‌ల ఒత్తిడి తగ్గించేందుకే పరిమిత స్థాయిలో మాత్రమే లెబనాన్‌పై దాడి చేసినట్టు ఇజ్రాయిల్ వ్యూహాత్మక ప్రకటన చేసింది.


భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా సమస్త అరబ్‌ దేశాలలో ఫలస్తీనా ఒక సున్నిత సమస్య, ఎంత కాదన్నా అది అనివార్యంగా చుట్టుకొంటుంది, ఇందుకు ఎవరు మినహాయింపు కాదు. ఫలస్తీనా సమస్య ప్రాతిపదికన పశ్చిమాసియా రాజకీయ, దౌత్య, సైనిక సమీకరణలు ఉంటున్నాయి. అమెరికా విరోధి ఇరాన్ ఒక వైపు, అమెరికా సన్నిహిత అరబ్బు దేశాలు మరో వైపు ఉన్నాయి. అమెరికాలో ఇజ్రాయిల్‌కు గట్టి మద్దతుదారుడయిన జో బైడెన్‌ అధ్యక్షపదవిలో ఉండడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇజ్రాయిల్‌కు అమెరికా నుంచి అన్ని రకాలుగా పూర్తి స్ధాయి మద్దతు లభిస్తోంది. తత్ఫలితంగానే ఇజ్రాయిల్ దాడులు అంతకంతకూ ఉధృతమవుతున్నాయి.

ఫలస్తీనా అంశం ఆధారంగా లెబనాన్, గాజా ప్రాంతంలోను యమన్‌లోను తిరుగుబాటుదారులను ఇరాన్‌ వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తోంది. యమన్‌లోని హుతీల ద్వార సౌదీపై దాడులనూ ఇరాన్ ప్రొత్సహిస్తోంది. లెబనాన్‌లో షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో ఇరాన్‌కు అక్కడ ప్రాబల్యమున్నది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ దురాక్రమణ అనంతరం ఇరాన్‌ అండతో షియాలకు చెందిన హిజ్బుల్లా ఒక ప్రత్యేక రాజ్య వ్యవస్ధగా పరిణమించింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు లెబనాన్‌ ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఎదిగింది. మధ్య ప్రాచ్య దేశాలలో ఇరాన్ సృష్టించిన సాయుధ తిరుగుబాటు దళాలలో హిజ్బుల్లా సుశిక్షితమైనది. గల్ఫ్ దేశాలకు, లెబనాన్ మధ్య అగాధం ఏర్పడడానికి హిజ్బుల్లా ఒక ప్రధాన కారణం.


శక్తిమంతమైన ఇజ్రాయిల్‌ను గెరిల్లా యుద్ధ పోరాటం ద్వారా హిజ్బుల్లా ఢీ కొంటోంది. గెరిల్లా యుద్ధం, క్షిపణి దాడులకు మాత్రమే పరిమితమైన హిజ్బుల్లాకు ఇజ్రాయిల్‌తో పూర్తి స్ధాయిలో సైనికంగా ఢీకొనే సామర్ధ్యం లేదు. మెరుపుదాడులతో ఇజ్రాయిల్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. పూర్తి స్ధాయిలో యుద్ధాన్ని అది కోరుకోదు. అయితే హసన్ నస్రల్లా హత్య కారణంగా యుద్ధం అనివార్యమైనా హిజ్బుల్లా సమర రంగానికి నడిపించేది ఎవరనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. 2006లో ఇజ్రాయిల్ చివరిసారి లెబనాన్‌ను దురాక్రమించినప్పుడు ఇజ్రాయిల్ సైన్యానికి ఎదురయిన పరిస్ధితి ఇప్పుడు లేదు.

ఐక్యరాజ్యసమితి తీర్మానాల మేరకు తాము సరిహద్దును కాపాడుతామని లెబనాన్ ప్రధానమంత్రి తాజాగా ప్రకటించినా క్షేత్రస్ధాయిలో అది అంత సులువు కాదు. లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య సరిహద్దును ‘నీలి రేఖ’ అంటారు. ఇది ఐక్యరాజ్యసమితి శాంతి దళాల పరిశీలనలో ఉండగా భారతీయ సైనికులు నిర్వహించిన పాత్ర అత్యంత ప్రశంసనీయమైంది. సైనికపరమైన చర్యలకు కాకుండ శాంతి పునరుద్ధరణ, మానవతాపూర్వక సహాయ కార్యక్రమాలకు మాత్రమే ఇక్కడ ఐక్యరాజ్యసమితి పాత్ర పరిమితం. ఈ సరిహద్దు రేఖ వద్ద ఉన్న భారతీయ దళాలను కేంద్ర రక్షణ సహాయమంత్రిగా ఉన్నప్పుడు యం.యం. పల్లంరాజు సందర్శించారు.


ఇరాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ప్రస్తుత పరిస్థితులలో ఇజ్రాయిల్‌తో నేరుగా యుద్ధం చేయకపోవచ్చని పరిశీలకుల అంచనా. ఒకవేళ ఇరాన్ నేరుగా యుద్ధానికి తలపడితే మాత్రం పరిస్ధితి అదుపు తప్పుతుంది. అనివార్యంగా భారత్‌తో సహా సమస్త దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.

అన్ని అరబ్బు దేశాల కంటే కూడ లెబనాన్‌లో ప్రగతిశీల, ఉదారవాద ప్రభావాలు ఎక్కువ. ప్రజలు మతాన్ని వ్యక్తిగత వ్యవహారంగా భావిస్తారు. ఈ కారణంగానే లెబనాన్‌ ఒకప్పుడు అరబ్‌ స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం దుబాయి ఏ రకమైన అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కొనసాగుతుందో ఒకప్పుడు లెబనాన్ రాజధాని బెరూట్‌ అంతకంటె మెరుగైన రీతిలో పర్యాటక కేంద్రంగా వర్ధిల్లింది. చమురు ఆదాయం లేని అలనాటి ఎడారి పేద దేశాలు సముద్ర మత్స్య సంపాదనపై ఆధారపడి జీవిస్తున్న కాలంలో లెబనాన్‌లో నైట్ క్లబులు, డిస్కో క్లబ్బులు, బోటు షికార్లతో లెబనీస్‌ అరబ్బులు విలాసవంత వినోదభరిత జీవితాన్ని గడిపారు. అరబ్బు ప్రపంచంలో బలీయమైన ఐరోపా ప్రభావం కల్గిన లెబనాన్ జాతీయులు అనేక మంది గల్ఫ్ దేశాల అభివృద్ధిలో కార్పొరేట్‌ రూపేణా కీలక పాత్ర వహించారు. చమురు సంపాదనతో వెల్లువలా వచ్చిన అంతర్జాతీయ బహుళజాతి సంస్ధలతో పాటు స్ధానిక భారీ నిర్మాణ సంస్ధలలో లెబనీస్‌ జాతీయులు అత్యున్నత స్ధానాలలో కొనసాగారు. ఆ రకమైన ఘనకీర్తి ఉన్న లెబనాన్ ఫలస్తీనీయులకు ఆశ్రయం ఇవ్వడంతో అతలాకుతలమై దుస్ధితికిలోకి జారిపోయింది. ఫలస్తీనా–ఇజ్రాయిల్ సమస్య కొనసాగినంత కాలం పశ్చిమాసియాలో ఈ రకమైన ఉద్రిక్తతలు, హింసాకాండ కొనసాగుతూనే ఉంటాయి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Oct 02 , 2024 | 02:09 AM