Share News

కన్వర్ యాత్రలో ఆహార రాజకీయం!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:27 AM

చాలా సంవత్సరాలుగా నేను ‘ఎలెక్షన్స్ ఆన్ మై ప్లేట్’ అనే ఒక టీవీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. రుచికరమైన వైవిధ్యభరిత ఆహార పదార్థాల గురించి నివేదనతో సహా ఎన్నికల ప్రచార పోకడలను...

కన్వర్ యాత్రలో ఆహార రాజకీయం!

చాలా సంవత్సరాలుగా నేను ‘ఎలెక్షన్స్ ఆన్ మై ప్లేట్’ అనే ఒక టీవీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. రుచికరమైన వైవిధ్యభరిత ఆహార పదార్థాల గురించి నివేదనతో సహా ఎన్నికల ప్రచార పోకడలను సవివరంగా చూపించే, వ్యాఖ్యానించే టీవీ షో అది. వాస్తవంగా ఆహారమే ఆ కార్యక్రమం ప్రధాన ఆకర్షణ. కారణం చెప్పాలా? భారతదేశ అద్భుత ఆహార వైవిధ్యానికి సాటిరాగల దేశమేదీ ప్రపంచంలో లేదు కదా. మరి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులు కన్వర్ యాత్ర సమయంలో ఆహార నిఘా (పోలీసింగ్)కు పాల్పడుతున్నారు! ఇది భారతీయ అస్తిత్వ విశిష్టతగా భావించేదాన్ని దెబ్బతీయడమే కాదూ?


భారతీయ ఆహారం భారతీయ జీవన పరిమళం. దక్షిణ భారతావనిలో ఉన్న మదురై వెళ్లండి. ఉత్కృష్ట ఆలయ శిల్పానికి దర్పణమైన మీనాక్షిపురం కోవెల సమీపంలోనే అమ్మాస్ కిచెన్ అనే ఒక అద్భుత భోజనశాల ఉన్నది. చెట్టినాడ్ మాంసాహారం, పీతల ఆమ్లెట్, కుందేలు మాంసాన్ని ఆస్వాదించాలంటే ఆ కిచెన్‌కు వెళ్లాల్సిందే. అటువంటి కమ్మని వంటకాలు మదురైలో కాక మరెక్కడ లభిస్తాయి? జైపూర్ పాత బస్తీలో మూడు అంతస్తుల రెస్టారెంట్ ఒకటి ఉన్నది. ఇప్పటికి చాలా తరాలుగా ఒక ముస్లిం కుటుంబమే దానిని నిర్వహిస్తోంది. చవులూరించే మొగలాయి వంటకాలు అక్కడ కాక మరెక్కడ మీకు ఎక్కడ లభ్యమవుతాయి? ఆ పురాతన హోటల్ ఒక ‘శుద్ధ’ శాకాహార భోజనశాల పక్కనే ఉందని నేను చెప్పి తీరాలి. పూణే–సోలాపూర్ హైవేలో జై తుల్జా భవాని అనే పేరు గల ధాబా ఒకటి ఉన్నది. పరిమళ భరితమైన మటన్ వంటకాలకు అది పెట్టింది పేరు. ఆ ధాబాను నిర్వహిస్తున్న కటుంబం ధంగార్లు అనే ఒక ఓబీసీ సామాజిక వర్గానికి చెందినది. అమితమైన మత నిష్ఠ గల కుటుంబమది. అయినా ఆ కుటుంబ సభ్యులందరికీ మాంసాహారమే నిత్య ఆహారం. ఆంధ్రాకు వెళదాం. విజయవాడ నడి బొడ్డున అర డజన్ రకాల ఆంధ్ర బిర్యానీలను విక్రయించే ఒక స్టాల్ ఉంటుంది. మీరు ఆ స్టాల్‌కు వెళ్లితే దాని పక్కనే ఉన్న ఒక ఇడ్లీ–దోశ జాయింట్ మిమ్ములను తప్పక ఆకర్షిస్తుంది.


అద్భుతమైన పాకనాడు మన భారతావని. ఆహార భారతంలో మీకు ఎల్లెడలా శాంతియుత సహజీవనమే కనిపిస్తుంది. ఒక రెస్టారెంట్ ఘనతను దాని యజమాని పేరునుబట్టి కాకుండా అది వడ్డించే వంటకాల నాణ్యత ఆధారంగా మాత్రమే ఆస్వాదకులు నిర్ణయిస్తారు, గుర్తు పెట్టుకుంటారు. అయినా కన్వర్ యాత్రా మార్గంలో రోడ్డు పక్క రెస్టారెంట్‌లు తమ యజమాని పేరు ఉన్న బోర్డు (నేమ్ ప్లేట్) ఉండి తీరేలా చూడాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘ఆదేశించింది’! ఇది, ఉద్దేశపూర్వకంగా పౌర సమాజంలో మతపరమైన విభేదాలను రగుల్కొల్పే నిర్ణయమే కాదూ? యాత్ర మార్గం పొడవునా శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలుగకుండా జాగ్రత్త వహించేందుకే ఆ ఆదేశాన్ని జారీ చేసినట్టు యోగి సర్కార్ సమర్థించుకుంటోంది. ఇంతకంటే కపటం మరేమైనా ఉంటుందా? కన్వర్ యాత్ర ఈ నాటిదా? ఏ నాటి నుంచో జరుగుతున్న తీర్థయాత్ర కదా అది. అయితే యాత్రికుల ఆహార అలవాట్ల విషయమై అది ఎన్నడూ ఇబ్బందుల్లో పడలేదు. ఇప్పుడు యోగి ప్రభుత్వ వివక్షాపూరిత ఆహార రాజకీయాల కారణంగానే అది వివాదాస్పదమయింది. అనవసర సమస్యల నెదుర్కొంటోంది.

రెస్టారెంట్లు, ధాబాలు తమ యజమాని పేరును ఎందుకు ప్రదర్శించాలి? సామాజిక వేర్పాటుతనాన్ని రెచ్చగొట్టేందుకే యోగి సర్కార్ ఆ ఆదేశాన్ని జారీ చేసింది. ఒక నిర్దిష్ట మతం వారిని ప్రత్యేకంగా సూచించేందుకే ఆ ఆదేశం. ఆ మతస్థులు ముస్లింలు అని మరి చెప్పనవసరం లేదు. ముస్లిం మతస్తుల నిర్వహణలోని తినుబండారాలలో యాత్రికులు ఏమీ కొనకుండా నిరోధించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎటువంటి మినహాయింపులు లేని సామాజిక వివక్ష, సందేహం లేదు. మతపరమైన చీలికలు సృష్టించడమే దీనివెనుక ఉన్న ఉద్దేశం. యాత్రికులు వాంఛించని, వారి మతవిశ్వాసాలకు విరుద్ధమైన ఆహార పదార్థాలను సరఫరా చేయాలని ఏ వ్యాపారి అభిలషిస్తాడు? వ్యాపారి అనేవాడు మతపరమైన కారణాలతో వినియోగదారులను పోగొట్టుకుంటాడా?


సరే, సామాజిక మాధ్యమాలు కన్వర్ యాత్రలో ఆహార రాజకీయాన్ని మరింత హానికరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముస్లింల యాజమాన్యంలోని రెస్టారెంట్లు ‘అపరిశుభ్రమైనవని’, ‘అనారోగ్యకరమైనవని’ ఆ అధునాతన మాధ్యమాలలో ఎందరో ఘోషిస్తున్నారు. ఇదొక శుద్ధ అబద్ధం. ఇది నిస్సిగ్గుగా మతతత్వాన్ని ప్రదర్శించడమే. అటువంటి అభిపాయాలు వ్యక్తం చేసిన వారు ముస్లింల పట్ల ఎంత దురభిప్రాయంతో ఉన్నారో వెల్లడవుతుంది.

ఈ సందర్భంగా ఒక సమాంతర విపరీత ఉదంతాన్ని పేర్కొనడం సముచితంగా ఉంటుంది. అది కొవిడ్ ఉపద్రవ కాలంలో సంభవించింది. దేశ రాజధానిలో తబ్లీఘి జమాత్ సమావేశాలు జరిగాయి. సరిగ్గా అదే సమయంలో కొవిడ్ కేసులు అంతు లేకుండా పెరిగాయి. ఇంకేముంది, మతోన్మాదులకు ఒక సాకు దొరికింది. తబ్లిఘి ముస్లింలే కరోనా విలయాన్ని వ్యాపింపచేస్తున్నారనే ఒక అపప్రథను పుట్టించారు! ఆ ప్రపంచవ్యాప్త మహమ్మారికి ముస్లింలే కారణమంటూ విషప్రచారం జరిగింది. ముస్లింలు అందరినీ లక్ష్యం చేసుకున్న ఆ తప్పుడు ప్రచారం ఆ విపత్కాలంలో చాలా ప్రభావదాయకంగా పరిణమించింది. ఎంతగా అంటే వీథుల్లో తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే ముస్లిం విక్రేతలను ఊరూ, వాడలోనూ, బస్తీలు, కాలనీలలోనూ బహిష్కరించడం జరిగింది. కన్వర్ యాత్ర వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం శీఘ్రగతిన, సకాలంలో జోక్యం చేసుకుని ఉండకపోతే కొవిడ్ కాలంలో సంభవించిన దుష్పరిణామమే ఇప్పుడూ వాటిల్లి ఉండేదనంలో సందేహం లేదు. ఆ హిందూ తీర్థయత్ర మార్గంలో ఉన్న రెస్టారెంట్లు తమ యజమానులు, నిర్వాహకుల, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలనే ఆదేశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఎంతైనా ముదావహం.


ఈ వివాదం ఉత్తరప్రదేశ్‌లో ఆరంభమవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకని? ముగిసిన వేసవిలో జరిగిన 18వ సార్వత్రక ఎన్నికలలో, దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భారీగా నష్టపోయింది. ఆ ఎన్నికల తీర్పు వెలువడిన నాటి నుంచి యూపీలో ఆ పార్టీ చాలా క్లిష్టపరిస్థితుల నెదుర్కొంటోంది. పార్టీకి ఎన్నడూ లేని విధంగా సీట్లు, ఓట్లు తగ్గిపోవడానికి కారణమెవరు అనే విషయమై యూపీ బీజేపీలోని వివిధ వర్గాలు బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ పరాజయానికి ప్రధాన కారకుడిని చేసేందుకు ఒక గట్టి ప్రయత్నమే జరుగుతోంది బీజేపీ కేంద్ర నాయకత్వం బాహాటంగా అయితే ఏ పక్షమూ వహించడం లేదు. అటువంటి వైఖరి శ్రేయస్కరం కాదని భావిస్తున్నందున ఆ పరస్పర సతాయింపులు మరింతగా కొనసాగేందుకు అనుమతిస్తోంది. తనపై వర్షిస్తున్న నిందలు, ఆరోపణలకు నిలువెల్ల కాషాయ వస్త్రధారి అయిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటిలాగానే దురుసుగా ప్రతిస్పందిస్తున్నారు. దేనికీ విచారం వ్యక్తం చేసే స్వభావం కాని, క్షమాపణ చెప్పే నమ్రత కాని ఏ కోశానాలేని అతివాద హిందుత్వ యోధుడు ఆ యోగి. మరి రాజకీయంగా సరైన ప్రవర్తన అనే విషయమై సంప్రదాయ రీతి రివాజులకు ఆయన కట్టుబడుతాడా? అసంభవం. భగవాన్ శివ భక్తులు కాలినడకన హరిద్వార్ మొదలైన పవిత్ర గంగానది వెంబడి పుణ్య క్షేత్రాలకు వెళ్లి గంగా జలాన్ని సేకరించి శివాలయాలలో సమర్పించడమే కన్వర్ యాత్ర. ఈ వార్షిక తీర్థయాత్ర ఏటా శ్రావణ మాసంలో జరగడం అనూచానంగా వస్తోంది. ఈ యాత్ర ‘పవిత్రత’ లేదా ‘ధర్మబద్ధత’ను సమర్థిస్తూ తన హిందూ మత నిబద్ధతను హిందూత్వ మద్దతుదారులకు నొక్కి వక్కాణించేందుకు యోగి ప్రభుత్వం ఆరాటపడుతోంది. తత్కారణంగానే కన్వర్ యాత్ర మార్గంలోని ఆహార పదార్థాలను విక్రయించే ముస్లింల మూలంగా ఈ తీర్థయాత్ర మాన్యత అపవిత్రమవుతుందనే వాదనతో ధాబాలు, రెస్టారెంట్లు తమ యజమానుల, నిర్వాహకుల పేర్లను ప్రదర్శించాలని యోగి సర్కార్ ఆదేశించింది. అయితే ఈ వ్యూహాత్మక రాజకీయ నిర్ణయం రాజ్యాంగ నియమాలు, నిర్దేశాలను పూర్తిగా ఉపేక్షించింది, అగౌరవపరిచింది.


ఆదిత్యనాథ్, ఆయన హిందుత్వ సమూహం ఒక సత్యాన్ని విస్మరించింది. ఎన్నికలలో గెలిచేందుకు మెజారిటేరియన్ అస్తిత్వ రాజకీయాలు ఇంకెంత మాత్రం ఎన్నికలలో విజయానికి భరోసా కావని, కాబోవనే నిరూపిత వాస్తవాన్ని గుర్తించడంలో యోగి ఆదిత్యనాథ్ విఫలమయ్యారు. ఇటీవలి సార్వత్రక ఎన్నికలలో జరిగిందేమిటి? యోగి పాలనలో ఉన్న యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా దళితులు, ముస్లింలు, యాదవ్‌లు ఓబీసీలు ఏకమయ్యారు. సమ్మిళిత పాలన నందించడలో బీజేపీ ప్రభుత్వం విఫలమవడం వల్లే కాదూ? కుల అస్తిత్వాలు మళ్లీ పదునెక్కుతున్నాయి, కీలకంగా పరిగణన పొందుతున్నాయి. యోగి సర్కార్ నిర్ణయంతో ఈ రోజు ముస్లిం విక్రేతల జీవనాధారాలు ప్రమాదంలో పడ్డాయి. మరి రేపు దళితుల, కింది స్థాయి ఓబీసీ వర్గాల వారి జీవనో పాధులకు అటువంటి గతి పట్టదని చెప్పగలిగేది ఎవరు? ఎన్ని చెప్పినా, ఏమి జరిగినా ఆహార ‘శుచి’, ‘అస్పృశ్యత’ అనేవి శతాబ్దాలుగా హిందూ సమాజంలో కుల వివక్షలో నిర్ణయాత్మకంగా ఉన్నాయి. మరి ఏ ప్రగతిశీల ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా గతించిన యుగాలలో హిందువుల జీవన విధానాన్ని కట్టడి చేసిన ఆ పక్షపాతాలను పునరుద్ధరించడానికి బదులు మనసా వాచా కర్మణా సమతా భావనలు వర్థిల్లే భవిష్యత్తు నిర్మాణానికి పూనుకోవాలి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అందరితో కలిసి అందరికీ అభివృద్ధి) అన్న ఆదర్శం ఆహార రాజకీయాలపై మతతత్వ సంకేతాత్మక సందేశాలు, సూత్రీకరణలకు ఆస్కారమివ్వదు.

తాజా కలం: ఉత్తరప్రదేశ్‌లోని ఒక హైవేలో ‘మున్నా కిచెన్’ అనే ఒక రెస్టారెంట్ ఉన్నది. మున్నా అనేది వాస్తవంగా ఆ హోటల్ యజమాని మహమ్మద్ ఖాన్ ముద్దు పేరు. ఆయన హోటల్‌లో పని చేసే నలభీముల్లో ఒకరు యాదవ్ కులస్తుడు. భారతీయతలో మనలను సమ్మిళితపరిచే అద్భుతమది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - Jul 26 , 2024 | 03:27 AM