Share News

Modi 3.0: నరేంద్రుని పాలనా శైలి మారేనా?

ABN , Publish Date - Jun 15 , 2024 | 01:50 PM

నరేంద్ర మోదీ పాలనా శైలిలో ప్రతీకాత్మక సంయమనం చోటుచేసుకోవాలని నేను ఆశిస్తున్నాను; పార్లమెంటులో చర్చలకు మరింత సమయాన్ని కేటాయించి అవి సమగ్రంగా జరిగేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాను. ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో..

Modi 3.0: నరేంద్రుని పాలనా శైలి మారేనా?

నరేంద్ర మోదీ పాలనా శైలిలో ప్రతీకాత్మక సంయమనం చోటుచేసుకోవాలని నేను ఆశిస్తున్నాను; పార్లమెంటులో చర్చలకు మరింత సమయాన్ని కేటాయించి అవి సమగ్రంగా జరిగేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాను. ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల విధుల నిర్వహణ రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రధాని మోదీతో సహ సీనియర్ మంత్రులు మన తోటి భారతీయ పౌరులు అయిన ముస్లింలను అనుక్షణం తెగనాడే అలవాటుకు స్వస్తి చెప్పి తీరాలి.

సరిగ్గా ఏడాది క్రితం (జూలై 1, 2023) ఇదే కాలమ్‌లో భారత ప్రజాస్వామ్య నవీకరణ గురించి నా భావాలు, ఆలోచనలు, ఆకాంక్షల గురించి తెలియజేస్తూ తదుపరి (2024) సార్వత్రక ఎన్నికల విషయమై ఒక ఆశను వెల్లడించాను. ‘ఏ ఒక్క పార్టీ లోక్‌సభలో మెజారిటీ సీట్లు పొంద కూడదు. ఏకైక పెద్ద పక్షంగా ఆవిర్భవించిన పార్టీకి సైతం కనీస మెజారిటీ (272) కంటే తక్కువ సీట్లు రావాలి’– నా యీ చిన్న ఆశ గురించి ఒకటి రెండు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసేందుకు కుతూహలపడుతున్నాను.

మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాభావికంగా నిరంకుశవాది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ఇటువంటి ప్రవృత్తి ఉండడం ఎంతమాత్రం తగదు. సార్వత్రక ఎన్నికలలో వరుసగా రెండుసార్లు గణనీయమైన మెజారిటీతో గెలుపొందడంతో ఆయనలో నియంతృత్వ ధోరణులు మరింతగా పెరిగాయి. 18వ లోక్‌సభలో ఏ పార్టీకి కనీస మెజారిటీ ఉండకూడదన్న ఆశ నెరవేరడమనేది జూలై 2023లోను, ఆ తరువాత అనేక నెలల తరబడి కూడా అసాధ్యంగా కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఫారిన్ ఎఫైర్స్’ అన్న జర్నల్‌లో ప్రధాని మోదీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ రాసిన ఒక వ్యాసంలో ‘మోదీని, ఆయన పార్టీ బీజేపీని అధికారం నుంచి దించివేసేందుకు ఇండియా కూటమి చాలా చాలా కష్టపడవలసి ఉన్నది. మహా అయితే పార్లమెంటులో వారి మెజారిటీని దెబ్బతీయడం మాత్రమే ప్రతిపక్ష కూటమి చేయగలుగుతుంది’ అని వ్యాఖ్యానించాను.


అదే నెలలో ఒక మిత్రుడు నాకు రాసిన ఒక లేఖలో ‘బీజేపీని ప్రతిపక్షం దెబ్బతీయడమేకాదు, పార్లమెంటులో ఆ పార్టీ మెజారిటీని కూలదోస్తుంది’ అని పేర్కొన్నాడు. జర్నలిస్టు అనీల్ మహేశ్వరి ఆ మిత్రుడు. ఉత్తర భారతావని రాజకీయాల గురించి బాగా లోతైన అవగాహన ఉన్న పాత్రికేయుడు. హిందీ రాష్ట్రాలలో దశాబ్దాలుగా పాత్రికేయుడుగా పనిచేసిన అనుభవంతో వర్తమాన భారత చరిత్రపై ఆయన పలు పుస్తకాలు రాశారు. ‘ది పవర్ ఆఫ్ ది బ్యాలెట్’ అన్న సుప్రసిద్ధ గ్రంథానికి ఆయన సహ రచయిత. ‘మీ భయాలు నిరాధారమైనవి. వామపక్షాలు, ఉదారవాదులు సైతం వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. రాబోయే సార్వత్రక ఎన్నికలలో బీజేపీకి ఇంచుమించు 230 సీట్లు మత్రమే రావచ్చు’ అని కూడా ఆయన పేర్కొన్నారు. మార్చి 18న నాకు పంపిన ఒక ఈ–మెయిల్‌లో మహేశ్వరి ఇలా పేర్కొన్నారు: ‘బీజేపీకి 230 సీట్లు మాత్రమే రాగలవని మరో మారు చెప్పుతున్నాను. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లలో ఆ పార్టీకి 30 మాత్రమే దక్కుతాయి. ఓటర్లలో ఆ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నది– రాహుల్‌గాంధీ నాయకత్వ దక్షత పట్ల నాకు సందేహాలు ఉన్నప్పటికీ బీజేపీయేతర పార్టీ నాయకులలో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్న ఏకైక నేత ఆయనేనని చెప్పి తీరాలి’. సార్వత్రక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి నెల రోజులు ముందే అనీల్ మహేశ్వరి ఈ విషయాలను పేర్కొన్నారు. రెండు దశల పోలింగ్ పూర్తయిన తరువాత, బీజేపీ మంచి మెజారిటీతో మళ్లీ అధికారానికి వస్తుందని వివిధ ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడయిన విషయం పట్ల పలువురు వ్యాఖ్యాతలు సంశయాన్ని వ్యక్తం చేశారు. పోల్‌స్టర్స్ పూర్తిగా పొరపడ్డారని కూడా కొంతమంది స్పష్టంగా అభిప్రాయడ్డారు. దేశ వ్యాప్తంగా ప్రచలితంగా ఉన్న ఒక అభిప్రాయానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని ఘంటాపథంగా వ్యక్తం చేసిన నిశిత పరిశీలకుడు అనీల్ మహేశ్వరి. బీజేపీకి మెజారిటీ రాదని ముందే గ్రహించిన ప్రతిభావంతుడు. ఆయన దూర దృష్టి బహుదా అభినందనీయమైనది.


1989–2014 సంవత్సరాల మధ్య పార్లమెంటులో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ లేదు. ఆ కాలంలో ఏడుగురు ప్రధానమంత్రులు అధికారంలో ఉన్నారు. వారిలో నలుగురు– వి.పి.సింగ్, చంద్రశేఖర్, దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్– ఒక్కొక్కరు రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలమే అధికారంలో ఉన్నారు. అదే కాలంలో కనీసం ముగ్గురు ప్రధానమంత్రులు– పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్– కనీసం ఒక పర్యాయమైనా ఐదేళ్ల పాటు పూర్తిగా అధికారంలో ఉన్నారు.

ఇప్పడు మూడో పర్యాయం ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విశిష్ట జాబితలో చోటు సాధించుకున్నారు లోక్‌సభలో తన పార్టీకి మెజారిటీ లేక పోయినప్పటికీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. మోదీకి ముందు ప్రధానమంత్రిగా ఉన్నవారు ఆలనానుభవాలు, స్వభావ రీత్యా ఇతర పార్టీలతో సమన్వయ సహకారాలతో సమర్థ పాలననందించగలిగారు. వారికి పూర్తిగా భిన్నమైన పాలకుడు నరేంద్ర మోదీ. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి కాక పూర్వం ఇందిర, రాజీవ్ ప్రభుత్వాలలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. వాజపేయి ప్రధానమంత్రి కాకపూర్వం మొరార్జీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికాకపూర్వం నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. అనేక సంవత్సరాల పాటు ఆరెస్సెస్ ప్రచారక్‌గా, బీజేపీ కార్యకర్తగా నరంద్ర మోదీ ఇతరులతో కలిసి, లేదా వారి నాయకత్వంలో పని చేసిన మాట నిజమే అయితే ఎన్నికల రాకీయాలలోకి ప్రవేశించిన నాటి నుంచీ ఆయన స్వతంత్రంగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగా గానీ, చివరకు ఎంపీ లేదా ఎమ్మెల్యేగా గానీ ఎన్నడూ ఆయన లేరు. 2001 నుంచి మోదీ ఒకే ఒక్క ధ్యేయంతో పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం లేదా దేశ ప్రధాన మంత్రి కావడమే ఆయన లక్ష్యంగా ఉన్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే 23 సంవత్సరాల పాటు బిగ్‌బాస్, టాప్‌బాస్ లేదా సుప్రీంబాస్‌గా మాత్రమే ఆయనకు జీవితం తెలుసు.


ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను నరేంద్ర మోదీ అవధులు లేని స్వీయ వ్యక్తి పూజను ప్రోత్సహించారు, పెంపొందించారు. తొలుత గుజరాత్‌ను, ఆ తరువాత దేశాన్ని మహా సంపద్వంతంగా తీర్చిదిద్దిన పాలకుడుగా, నాయకుడుగా తనను తాను దేశ ప్రజలకు, విశాల ప్రపంచానికి నిస్సంకోచంగా చాటుకున్నారు. ఇలా అధికారానికి వ్యక్తిత్వారోపణను మరింత ముమ్మరం చేసేందుకు గాంధీనగర్‌లోను, న్యూఢిల్లీలోను, తనకు ఎటువంటి మినహాయింపులు లేని విధేయత చూపాలని కేబినెట్ సహచరులను పురిగొల్పారు. మోదీ ఆశించిన విధంగానే వారూ ఆయన అధికారాన్ని సంపూర్ణంగా అంగీకరించారు. విధేయులు అయ్యారు. ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను తన ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఏ కొత్త ప్రాజెక్టును ప్రారంభించినా, దాని నిర్మాణాన్ని ముగించినా ఆ ఘనతను పూర్తిగా తనకే ఆపాదించుకోవడం ఆయనకు పరిపాటి అయింది.


తన నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి కూడా ఘన విజయం సాధిస్తుందని, తాను మరోసారి తప్పక ప్రధానమంత్రిని అవుతానని మోదీ విశ్వసించారు. అందుకే మూడోసారి ప్రధానమంత్రి పదవినధిష్ఠించిన వెన్వెంటనే తొలి 100 రోజుల్లో అమలుపరిచే ఒక ఎజెండాను ప్రజలకు నివేదించనున్నట్టు మోదీ ప్రకటించారు. తన 100 రోజుల ఎజెండాలో 50 నుంచి 70 లక్ష్యాలను మోదీ నిర్దేశించుకోనున్నారని మే 10న ఒక జాతీయ దినపత్రిక వెల్లడించింది. మోదీ తన తొలి 100 రోజుల్లో అమలుపరచదలిచిన ఎజెండా విషయమై అధికారులతో సమావేశమవనున్నారని జూన్ 2న మరో జాతీయ దినపత్రిక పేర్కొంది. గమనించారా? అధికారులతో సమావేశమవడానికి మాత్రమే మోదీ నిర్ణయించుకున్నారు! సరే, అనుకున్నవన్నీ జరగవు కదా. సార్వత్రక ఎన్నికల అనంతరం మోదీ మూడో ప్రభుత్వం వస్తుందని ఆయనతో పాటు చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా మోదీ మూడో ప్రభుత్వానికి బదులుగా ఎన్డీఏ రెండో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ దిగ్భ్రాంతికర పరిణామం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది! స్వాభావికంగా నిరంకుశుడు అయిన నాయకుడు ఒక ప్రజాస్వామ్య పాలకుడుగా పరిణమిస్తారా? ఈ ఫుణ్యభూమిలో తాను భగవంతుడి ప్రతినిధినని ఇటీవలే చెప్పుకున్న వ్యక్తి తననుతాను మానవ మాత్రుడుగా పరిగణించుకుంటారా? తానూ తప్పులు చేస్తానని అంగీకరిస్తారా? పాలనా వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. సలహాలు ఇచ్చిన వారి గురించి ఒక మంచి మాట చెప్పే సుగుణం ఆయనకు ఉన్నదా? పార్లమెంటులో సంఖ్యాబలం లేని ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ, తన కేబినెట్ సహచరులకు మరింత అధికారాన్ని ఇచ్చేందుకు అంగీకరిస్తారా? తన ఎంపీలపై అనుచిత పెత్తనం చెలాయించడాన్ని మానుకుంటారా? ప్రతిపక్షాన్ని సమాదరించి పాలనలో దాని సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతారా? తన పార్టీ పాలనలో లేని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను గౌరవిస్తారా? జాగ్రత్తగా ఆలోచించిన తరువాత మాత్రమే సమాధానాన్ని ఇవ్వాల్సిన ప్రశ్నలివి. ఆ సమాధానాలు వెల్లడయేందుకు తప్పక కొన్నినెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అందుకు ఆశాభావంతో వేచి వుందాం. ఈ లోగా నరేంద్ర మోదీ పాలనా శైలిలో ప్రతీకాత్మక సంయమనం చోటుచేసుకోవాలని నేను ఆశిస్తున్నాను; పార్లమెంటులో చర్చలకు మరింత సమయాన్ని కేటాయించి అవి సమగ్రంగా జరిగేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాను. ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల విధుల నిర్వహణ రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ రాజ్యాంగ అధికారులు అసహ్యకరమైన పద్ధతుల్లో వ్యవహరించకుండా కేంద్రం వారిని కట్టడి చేసి తీరాలి. ప్రధాని మోదీతో సహ సీనియర్ మంత్రులు మన తోటి భారతీయ పౌరులు అయిన ముస్లింలను అనుక్షణం తెగనాడే అలవాటుకు స్వస్తి చెప్పి తీరాలి. పాలనా రీతుల్లో గణనీయమైన మార్పు వస్తుందో లేదో వేచి చూడవలసి ఉంది. ప్రధాని మోదీ స్వాభావికంగా సమస్త అధికారాలను తన చేతుల్లోకి తీసుకునేందుకు ఇష్టపడతారు. ఆధిపత్య చెలాయింపే ఆయన సహజ ప్రవృత్తి. రెండు దశాబ్దాల పాటు అడ్డూ అదుపు లేని విధంగా అధికారాన్ని చెలాయించిన కారణంగా ఆయనలో అప్రజాస్వామిక ధోరణులు మరింతగా దృఢపడ్డాయి.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Jun 15 , 2024 | 02:09 PM