Share News

హైదరాబాద్‌కు కొండంత అండ ‘హైడ్రా’!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:19 AM

ఉమ్మ‌డి రాష్ట్రంలో హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ భూములు ఏ విధంగానైతే అన్యాక్రాంత‌మ‌య్యాయో, స్వ‌రాష్ట్రంలో దానికి రెట్టింపు భూ విధ్వంసం జ‌రిగింది. ఆనాటి గొలుసుక‌ట్టు చెరువులు చాలా మాయం చేసి, కొండ‌లు, గుట్ట‌లను పిండి చేసి...

హైదరాబాద్‌కు కొండంత అండ ‘హైడ్రా’!

ఉమ్మ‌డి రాష్ట్రంలో హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ భూములు ఏ విధంగానైతే అన్యాక్రాంత‌మ‌య్యాయో, స్వ‌రాష్ట్రంలో దానికి రెట్టింపు భూ విధ్వంసం జ‌రిగింది. ఆనాటి గొలుసుక‌ట్టు చెరువులు చాలా మాయం చేసి, కొండ‌లు, గుట్ట‌లను పిండి చేసి రియ‌ల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. గ‌త ప్ర‌భుత్వం క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ భూముల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండే వీఆర్ఓ, వీఆర్ఏల‌ను రెవెన్యూ శాఖ నుంచి దూరం చేయ‌డంతో క‌బ్జాల‌కు ప్ర‌భుత్వ‌మే ఉసిగొలిపిన‌ట్టయ్యింది. అధికారం అండ‌తో జీఓ59 ముసుగులో భూముల‌ను ర‌క్షించాల్సినవారే దొరికినకాడికి నాకేసిన ప‌రిస్థితి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లో జ‌రిగిన భూ విధ్వంసంపై దృష్టి పెట్టింది. ప్ర‌భుత్వ భూముల‌ను, చెరువులను కాపాడేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి స‌రికొత్త ఆలోచ‌న చేసి, హైదరాబాద్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) అనే ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు. కమిషనర్‌గా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) స్థాయి సీనియ‌ర్ పోలీస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు. బడ్జెట్‌లో ‘హైడ్రా’కు 200 కోట్ల రూపాయల కేటాయింపు ప్రభుత్వ సంకల్పశుద్ధికి నిదర్శనం.


జీహెచ్ఎంసీ ప‌రిధిని ఔట‌ర్ రింగు రోడ్డు వ‌ర‌కు విస్త‌రించేందుకు సీఎం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నందున, జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా ప‌రిధిలోకి రానున్నాయి. సుమారు 2 వేల చదరపు కిలోమీటర్లు, 27 మునిసిపాలిటీలు, 33 పంచాయతీలను క‌లుపుకొని స్వయంప్రతిపత్తితో ఉండేలా హైడ్రాను అందుబాటులోకి తెచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ఔట‌ర్ రింగురోడ్డు వ‌ర‌కు ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌ (టీసీయూఆర్‌)గా పేర్కొంటూ ప్ర‌భుత్వం ఆ ప్రాంతం వ‌ర‌కు విప‌త్తు నిర్వహ‌ణ, త‌దిత‌ర అధికారాల‌తో హైడ్రాను ఏర్పాటు చేసింది. చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయ‌డం, ప్ర‌భుత్వ స్థలాల పరిరక్షించ‌డం, అక్రమ నిర్మాణాలను నియంత్రించ‌డంలో ప్ర‌ధాన భూమిక‌ను పోషించ‌నుంది. ప్ర‌భుత్వ ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు విపత్తుల నిర్వహణలోనూ అది కీల‌కం.


జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువు, వక్ఫ్, దేవాదాయశాఖ, పార్కులు, ఇనాం భూములు కబ్జాదారుల చెరల్లో ఉన్న విష‌యం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ ఆక్రమణలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా చెరువులు, కుంట‌లు, నాలాలు, ప్ర‌భుత్వ‌ భూములు కబ్జాల పాలవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కబ్జాదారుల బారి నుంచి సర్కారు భూములకు విముక్తి కల్పించడంతోపాటు ఇకముందు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించడం కోసం స‌రికొత్తగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, సిటీ ట్రాఫిక్, ఇత‌ర‌ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు ఈ విభాగంలో పని చేస్తాయి. తెలంగాణ గొలుసుక‌ట్టు చెరువుల‌కు నెల‌వు. హైద‌రాబాద్‌లో సుమారు 2వేల‌కు పైగానే ఒక‌ప్పుడు చెరువులు ఉండేవి. తుమ్మ‌ల‌కుంట‌, చింత‌ల‌కుంట‌, పుప్ప‌ల‌కుంట‌, కూర్మ‌చెరువు, గొల్ల‌వానికుంట‌, బొంగ‌ల‌కుంట‌, క్వారీకుంట‌, భ‌జ‌న్‌సాహికుంట‌, అంజ‌య్య చెరువు, సుద‌ర్శ‌న్ చెరువు, షాన్‌కీస‌మున కుంట‌ ఇలా ఎన్నెన్నో చెరువులు నామ‌రూపం లేకుండా మాయం అయ్యాయి. మిగిలిన చాలా చెరువులు క‌బ్జాలకు గుర‌య్యాయి. భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు రావ‌డంతో రాత్రికి రాత్రే మ‌ట్టిపోస్తూ చెరువుల‌ను నామరూపం లేకుండా పూడ్చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చెరువులు, కుంట‌ల‌ కబ్జాలపై వచ్చే ఫిర్యాదుల మీద హైడ్రా తక్షణమే స్పందిస్తుంది. క్షేత్రస్థాయిలో బృందాలు ఆక్రమణలను గుర్తిస్తాయి, కూల్చివేతలు చేపడతారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌జోన్‌లో నిర్మించిన ఎలాంటి నిర్మాణాల‌నైనా కూల్చివేస్తారు. హైదరాబాద్ నగరంలో శాటిలైట్ ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ప్రభుత్వ రికార్డులను ఆధారంగా చేసుకొని హైడ్రా అధికారులు నీటిపారుదల, రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సర్వే చేసి ఆక్రమిత భూముల వివ‌రాల‌ను వెలికితీసి, అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనుమతి లేకుండా నిర్మించినా, అనుమతికి మించి అద‌న‌పు అంతస్తుల నిర్మాణం చేపట్టినా నోటీసులిచ్చి కూల్చివేయనున్నారు. అనుమతుల జారీలో అక్రమాలు జరిగినా అధికారులను బాధ్యులను చేసే అధికారం కూడా హైడ్రాకు ఉంది.


నాలాల పూడికతీత, వరద నిర్వహణ, రోడ్ల నిర్మాణం, మరమ్మతు వంటి పనులనూ విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తారు. పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తారు. తదనుగుణంగా సంబంధిత అధికారులపై చర్యలుంటాయి. వాటర్‌ బోర్డు చేపట్టే పనులపైనా హైడ్రా పరిశీలన ఉంటుంది. న‌గ‌రంతో పాటు న‌గ‌ర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేలా పోలీసులతో సమన్వయం చేసుకుంటారు. ప్రధాన రహదారుల పక్కన ఫుట్‌పాత్‌లపై శాశ్వత ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు. వరద నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసిన బృందాల ప‌ని తీరును క్షేత్రస్థాయిలో ప‌ర్యవేక్షించనున్నారు. ఇంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉండే భారీ హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణలోనూ ఈ విభాగం సేవలందిస్తుంది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.


హైడ్రా పాల‌క మండ‌లికి సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌, అఖిల భార‌త స‌ర్వీసుకు చెందిన కార్య‌ద‌ర్శి లేదా అంత‌కు మించి హోదా క‌లిగిన అధికారి క‌మిష‌న‌ర్‌గా ఉంటారు. మున్సిప‌ల్ శాఖ మంత్రి, రెవెన్యూ అండ్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ మంత్రి, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్‌–మ‌ల్కాజిగిరి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, జీహెచ్ఎంసీ మేయ‌ర్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మున్సిప‌ల్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, ఐసీసీసీ అధిప‌తి, హైడ్రా క‌మిష‌న‌ర్ స‌భ్యులుగా ఉంటారు. ఇదే కాకుండా టీసీయూర్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ స‌బ్ క‌మిటీకి మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి చైర్మ‌న్‌గా, వివిధ విభాగాల అధికారుల‌తో 14 మంది స‌భ్యులుగా ఉంటారు. ఈ స‌బ్ క‌మిటీ హైడ్రా పాల‌క‌ మండ‌లికి పాల‌సీల్లో, ప్ర‌ణాళిక‌ల్లో, ఇత‌ర అంశాల‌లో స‌హ‌కారం అందిస్తోంది. హైడ్రాకు ఏటా నిర్దిష్టమైన బ‌డ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఇదే కాకుండా జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీజీఎస్‌పీడీసీఎల్, వాట‌ర్ వ‌ర్స్క్‌, ఎంఆర్‌డీసీఎల్‌, హెచ్‌జీసీఎల్‌ లాంటి సంస్థల నుంచి రుసుముల ద్వారా నిధులు వినియోగిస్తారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోలీసుస్టేషన్ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఉన్న డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో పాటు పోలీసు, రెవెన్యూ, ఇరిగేష‌న్‌, స‌ర్వేయింగ్‌, టౌన్ ప్లానింగ్‌, అట‌వీ, రిజిస్ట్రేష‌న్ శాఖ‌ల‌కు చెందిన అధికారులు, సిబ్బంది డిప్యుటేష‌న్‌పై హైడ్రాకు రానున్నారు. ఇలా, నిర్దిష్టమైన బృహత్ ల‌క్ష్యాల‌తో ఆవిర్భవించిన ‘హైద‌రాబాద్ విప‌త్తు స్పంద‌న‌, ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ ప్రాధికార సంస్థ‌ (హైడ్రా)’ చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది.

డా. ఎన్‌.యాద‌గిరిరావు

అద‌న‌పు క‌మిష‌న‌ర్‌, జీహెచ్ఎంసీ

Updated Date - Jul 26 , 2024 | 03:19 AM