పదునెక్కుతున్న మోదీ వ్యూహప్రతివ్యూహాలు
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:58 AM
కంసుడిని కృష్ణుడు హతమార్చకపోతే కృష్ణుడిని హతమార్చేందుకు కంసుడు తన ప్రయత్నాలను మానుకునేవాడు కాదని భాగవతంలో దశమస్కంధం చదివిన వారికి అర్థమవుతుంది. రాజకీయాలు కూడా...
కంసుడిని కృష్ణుడు హతమార్చకపోతే కృష్ణుడిని హతమార్చేందుకు కంసుడు తన ప్రయత్నాలను మానుకునేవాడు కాదని భాగవతంలో దశమస్కంధం చదివిన వారికి అర్థమవుతుంది. రాజకీయాలు కూడా అదే విధంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియనిది కాదు. లోక్‌సభలో బీజేపీ మెజారిటీ 240 సీట్లకు తగ్గిపోయినప్పటి నుంచీ కొంచెం వెనక్కు తగ్గినట్లు కనపడిన మోదీ స్వాతంత్ర్య పర్వదినం నుంచే తన ఆయుధాలు సంధించడం ప్రారంభించారు. దీనిని బట్టి ఆయన తన సహజ లక్షణాలు కోల్పోలేదన్న విషయం అర్థమవుతోంది.
సార్వత్రక ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచీ ఇండియా కూటమి తగ్గేదే లేదన్నట్లుగా కొదమసింహంలా దూకుడు ప్రదర్శిస్తూ మోదీ సేనను ఆత్మరక్షణలో పడేసేందుకు ప్రయత్నించడం ప్రారంభించింది. ఇటీవల ముగిసిన 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో రాహుల్ నేతృత్వంలో ఇండియా కూటమి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగిలేందుకు రాహుల్ గాంధీ స్వయంగా సారథ్యం వహించారు. ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల వ్యవహార శైలితో అనేక సందర్భాల్లో సభాపతులు నిరాశా నిస్పృహలకు గురికాగా, అధికారపక్ష పెద్దలు చేష్టలుడిగిపోయారు. చివరకు శక్తి కూడదీసుకుని అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్‌తో పాటు ఒకరిద్దరు బీజేపీ నేతలు ప్రతిపక్షంపై విరుచుకుపడకపోతే, తొలి సమావేశాల్లో ప్రతిపక్షాలకు తిరుగులేకుండా పోయేది. నీట్ ప్రశ్నపత్రాల లీక్, కుల గణన, కనీస మద్దతు ధర, మణిపూర్‌తో పాటు అనేక అంశాలు ప్రతిపక్షాలకు ఆయుధాలయ్యాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వమే సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించేందుకు ముందుకు రావడం మారిన పరిస్థితులకు నిదర్శనం.
పార్లమెంట్ సమావేశాలు ముగిశాయో లేదో, ఆగస్టు 10న అదానీ స్టాక్ మార్కెట్ వ్యవహారంలో హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడించిన తాజా అంశాలతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయాయి. అదానీ గ్రూప్ సంస్థలు తమ షేర్లను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించిన విదేశీ నిధుల్లో సెబి చైర్మన్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని వచ్చిన ఆరోపణల ఆధారంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ ఆరోపణలపై జేపీసీ ఏర్పాటుకు డిమాండ్ చేసింది. అదే సమయంలో కులజనగణన. రిజర్వేషన్లపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. మరో మూడు నెలల్లో జరగనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు కమలనాథులను చీకాకు పెట్టేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని నిర్ణయించాయి.
కాని మోదీని కూడా తక్కువ అంచనా వేయలేం. ఆగస్టు 15న ఎర్రకోట ప్రసంగంతో ఎదురుదాడి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రసంగంలో ఆయన రెండు కీలకాంశాలను ప్రకటించారు. అవినీతిపై తాను ప్రకటించిన యుద్ధాన్ని తీవ్రతరం చేస్తానని మోదీ చేసిన వ్యాఖ్యలు గత అయిదేళ్లుగా అనేకమంది ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న ఏజెన్సీల చర్యలు ఆగిపోవన్న విషయం ధ్రువీకరిస్తున్నాయి. ఇక ఇంతకాలం కొనసాగిన మతతత్వ పౌర స్మృతి బదులు లౌకిక పౌర స్మృతి దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని మోదీ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాల కులజనగణన డిమాండ్‌ను అడ్డుకునేందుకు మోదీ ఈ ఆయుధాన్ని బయటకు తీసినట్లు కనబడుతోంది.
అవినీతిని ఎంత మాత్రమూ సహించేది లేదని మోదీ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన మరునాడే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు భూమి కుంభకోణానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అవినీతి నిరోధక చట్టంలో బహుళ ప్రాచుర్యం పొందిన సెక్షన్ 17ఏ కింద అనుమతిని మంజూరు చేశారు. మైసూరులో సిద్ధరామయ్య సతీమణి పార్వతి ఆమె పేరున లేని భూమిని ప్రభుత్వానికి ఇచ్చినందుకు బదులుగా 14 స్థలాలు అక్రమంగా పొందారని ఆరోపణలు రాగా, ఈ నిర్ణయం తనది కాదని, బీజేపీ హయాంలోనే ఈ స్థలాలను కేటాయించారని సిద్ధరామయ్య వాదిస్తున్నారు. సిద్ధరామయ్య నిర్ణయం తీసుకోనప్పుడు ఆయనపై 17ఏ క్రింద ఎలా చర్య తీసుకుంటారన్న చర్చ జరుగుతున్నప్పటికీ కర్ణాటక గవర్నర్ నిర్ణయం దేశ వ్యాప్తంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులను ఉలిక్కిపడేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అప్రమత్తంగా ఉండేలా మోదీ చేయగలిగారనడంలో సందేహం లేదు. ఇప్పటికే జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు గవర్నర్లు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంఘర్షణాయుత వైఖరిని అవలంబిస్తున్నారు. మోదీ ఎక్కడి నుంచైనా ఎదురుదాడి చేయగలరని సిద్ధరామయ్య వ్యవహారంతో ప్రతిపక్షాలకు అర్థమైంది. ఇదే సమయంలో కోల్‌కతాలో హత్యాచారానికి బలైన ఒక యువ డాక్టర్ విషాద ఉదంతాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ సహజంగానే విస్తృత యత్నాలు చేస్తోంది.
రాజకీయాల్లో అదును చూసుకుని ఎదురు దాడులు చేయడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు వెనక్కు తగ్గడం కూడా అవసరం. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మధ్య స్థాయి పోస్టుల్లో సివిల్ సర్వీసు అధికారులను కాకుండా బయటి నుంచి వ్యక్తులను నియమించేందుకు యుపిఎస్‌సి ప్రకటన విడుదల చేసిన మూడు రోజుల్లోనే మోదీ సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దాదాపు 45 జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లను నియమించేందుకు యుపిఎస్‌సి ప్రకటన చేసిన వెంటనే కాంగ్రెస్‌తో పాటు బీజేపీ మిత్రపక్షాలు కూడా విరుచుకుపడడం ఇందుకు కారణం. ఈ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన దళితులు, ఓబీసీలు, ఆదివాసీల రిజర్వేషన్లకు వ్యతిరేకమని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. బయటి వ్యక్తులను నియమించడం యుపిఎస్‌సి పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతిభావంతులైన యువకుల హక్కులను దోపిడీ చేయడమేనని, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం లభించకుండా చేసేందుకే ఈ నియామకాలు చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. ఎన్డీఏ మిత్రపక్షాలు జనతాదళ్ (యు), లోక్ జనశక్తి (రాంవిలాస్) కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొమ్మని కోరాయి. దీనితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయానికి అనుగుణంగా నియామకాలు జరగాలని అభిలషిస్తున్నందువల్ల బయటినుంచి వ్యక్తుల నియామకానికి సంబంధించి ప్రకటన వెనక్కు తీసుకోవాలని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ యుపిఎస్‌సి చైర్మన్‌కు లేఖ రాశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ బిల్లు, సాగు చట్టాలు, డేటా సంరక్షణ బిల్లు, బ్రాడ్ కాస్ట్ బిల్లుతో పాటు పలు నిర్ణయాలను వెనక్కు తీసుకోవల్సి వచ్చింది. బయటి వ్యక్తులను నియమించాలన్న విషయాన్ని కాంగ్రెస్ హయాంలో కూడా పరిశీలించారని, మోదీ ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ రాహుల్‌ను విమర్శించిన రెండు రోజులకే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం గమనార్హం. త్వరలో ఎన్నికలు జరుగనున్న హర్యానాలో తమ విజయానికి ఓబీసీలు, దళితులపై పూర్తిగా ఆధారపడుతున్న బీజేపీ రాహుల్ విమర్శతో వెంటనే వెనక్కు తగ్గాల్సి వచ్చిందనడంలో సందేహం లేదు.
దేశంలో మాత్రమే కాదు, మోదీ ప్రభుత్వం అంతర్జాతీయంగా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తున్నది. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత ఆ దేశ ప్రధానమంత్రి హసీనాకు ఆశ్రయం కల్పించడం భారత్‌కు సమస్యాత్మకంగా పరిణమించింది. ఆమెను ఏ దేశానికి పంపించాలో తెలియక మనం సతమతమవుతుండగా యుద్ధ నేరాల క్రింద ఆమెను విచారించేందుకు బంగ్లా తిరిగి పంపాలని ఆ దేశం నుంచి డిమాండ్ వస్తోంది. ఇక అమెరికాలో అత్యంత కీలకమైన నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సమయంలోనే మోదీ రష్యాలో రెండు రోజులు పర్యటించి పుతిన్‌ను కౌగలించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రధానాంశంగా నాటో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో మోదీ తన రష్యా పర్యటనను వాయిదా వేసుకోవాలని అమెరికా కోరినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. యుద్ధ సమయంలో వ్యూహాత్మక స్వతంత్రత అన్న మాటకు అర్థం లేదని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ స్పష్టంగా ప్రకటించారు. భారతదేశ వ్యూహాత్మక స్వతంత్రతను తాము గౌరవిస్తామని, కాని సంక్షోభ సమయాల్లో భారత అమెరికాలు కలిసికట్టుగా, విశ్వాసపాత్రమైన స్నేహితులుగా వ్యవహరించాలని తెలుసుకోవాలని ఆయన ఒక రక్షణ సదస్సులో చెప్పారు. తమతో సంబంధ బాంధవ్యాలను అలుసుగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. రష్యా చైనాకు జూనియర్ భాగస్వామిగా మారుతోందని, ఆ దేశాన్ని విశ్వసనీయ భాగస్వామిగా తీసుకోవడం మంచిది కాదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సల్లివాన్ కూడా స్పష్టం చేశారు. మోదీ పుతిన్‌ను గాఢంగా కౌగలించుకున్న దృశ్యాలు విడుదలైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పర్యటన శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మోదీ తప్పనిసరై ఉక్రెయిన్‌తో పాటు రష్యాను బద్దశత్రువుగా భావిస్తున్న పోలండ్‌కు కూడా వెళ్లి నాటో దేశాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ‘‘మీరెవరో, మీ శత్రువెవరో తెలిస్తే వంద యుద్ధాలు జరిగినా భయపడనక్కర్లేదు. మీ గురించి మాత్రమే తెలిసి మీ శత్రువు గురించి తెలియకపోతే, గెలుపుతో పాటు ఓటమికి కూడా సిద్ధంగా ఉండాలి. మీ గురించి కానీ, మీ శత్రువు గురించి కానీ ఏమీ తెలియకపోతే ప్రతి యుద్ధంలోనూ ఓడిపోవాల్సిందే’’ అని చైనా సైనిక వ్యూహకర్త సున్ సు ‘ద ఆర్ట్ ఆఫ్ వార్’లో రాశారు. 13 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోదీకి ఈ విషయం బాగా తెలిసే ఉండవచ్చు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)