Share News

కాలానికి ముందు నడిచిన ఆర్థికవేత్త

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:57 AM

‘మీ ఆంధ్రజ్యోతికి కాలమ్ రాయడం నాకు సంతోషమే.. కాని ప్రతి వారమూ రాయలేను’ అని రెండునెలల క్రితం చెప్పిన ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థిక సలహామండలి చైర్మన్ బిబేక్ దేబ్‌రాయ్ నవంబర్ 1న...

కాలానికి ముందు నడిచిన ఆర్థికవేత్త

‘మీ ఆంధ్రజ్యోతికి కాలమ్ రాయడం నాకు సంతోషమే.. కాని ప్రతి వారమూ రాయలేను’ అని రెండునెలల క్రితం చెప్పిన ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థిక సలహామండలి చైర్మన్ బిబేక్ దేబ్‌రాయ్ నవంబర్ 1న అనారోగ్యంతో మరణించారు. చాలా కాలం క్రితం యూపీఏ హయాంలో ఆయన ఆంధ్రజ్యోతికి కాలమ్ రాసేవారు. అప్పుడు ఆయన సోనియాగాంధీ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ గాంధీ పౌండేషన్‌లో పనిచేసేవారు. 1991లో ఆర్థిక ఉదారీకరణ తర్వాత వెలుగులోకి వచ్చిన వారిలో బిబేక్ దేబ్‌రాయ్ ఒకరు. అమర్త్యసేన్‌, వై. వేణుగోపాల్ రెడ్డి, రఘురామరాజన్, అనంత్, అరవింద్ పనగ్రియా లాంటి కొద్ది మంది ప్రముఖ భారతీయ ఆర్థికవేత్తలకు సమస్కంధుడు వివేక్‌ దేబ్‌రాయ్‌.


పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టకపోతే దేశంలో అభివృద్ధి రేటు ఇంత వేగంగా పెరిగేది కాదని, మౌలిక సదుపాయాల కల్పన పుంజుకునేది కాదని కొద్ది రోజుల క్రితం తమిళనాడులో పీవీ స్మారకోపన్యాసంలో చెప్పిన దేబ్‌రాయ్ కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీ, పూణే గోఖలే ఇనిస్టిట్యూట్, ఐఐఎఫ్‌టిల్లో పనిచేశారు. ఆయన భారతదేశ భావజాలం, సంస్కృతి పూర్తిగా ఇముడ్చుకున్న స్వదేశీ ఆర్థిక నిపుణుడు. 40వ ఏట సంస్కృతం నేర్చుకుని మహాభారతం, రామాయణంతో పాటు అనేక పురాణాలను ఆంగ్లంలో అనువదించిన బిబేక్ దేబ్‌రాయ్ పాత వ్యవస్థల్ని సృజనాత్మక విధ్వంసం చేయడం ద్వారానే కొత్త వ్యవస్థల్ని ఏర్పర్చగలమని విశ్వసించే ఆధునికుడు. నిజమైన ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఏర్పడాలంటే కాలం చెల్లిన చట్టాల్ని రద్దు చేయాలని, రెడ్ టేపిజం, అవినీతిని అంతం చేయాలని, న్యాయ సంస్కరణలతో పాటు మొత్తం రాజ్యాంగాన్నే తిరగరాయాలని ఆయన వాదించారు. పెండింగ్‌లో ఉన్న వేలాది కేసులు పరిష్కారం కావడం, న్యాయమూర్తుల నియామకాలు, గవర్నర్ల పాత్ర, ఎన్నికల సంస్కరణలపై విప్లవాత్మక నిర్ణయాలు అవసరమని ఆయన చెప్పారు. అంతర్జాతీయ వర్తకం, పెట్టుబడులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, పరిపాలనా సంస్కరణలను, వికేంద్రీకరణను, సమాఖ్య స్ఫూర్తిని సమగ్రంగా అమలు చేయాలని ఆయన విశ్వసించారు. ఏడవ షెడ్యూలులో చెప్పిన విధంగా రాష్ట్రాల అధికారాలను కాపాడాలని, స్థానిక సంస్థలకు పూర్తిగా సాధికారిత కల్పించాలని ఆయన చెప్పారు.


రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో పనిచేసినప్పుడు గుజరాత్ ఆర్థిక నమూనాను సమర్థించినందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిన బిబేక్ దేబ్‌రాయ్ ప్రధానమంత్రి సలహాదారుగా ఉన్నప్పటికీ ఆయన సలహాల ప్రకారమే మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వహించిందని చెప్పలేము. బిబేక్ దేబ్‌రాయ్ లాంటి వారు తమ కాలాని కంటే ముందు ఆలోచించి స్వల్పకాలిక లక్ష్యాలు కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్ణయించుకోవడంలో ప్రభుత్వానికి సలహా నిస్తారు. 2047 కల్లా వికసిత భారత్, అమృతకాల్ అన్న పదాలు ఆయన ఆలోచనల నుంచే పుట్టాయి. కాని నినాదాలు చేయడమే కాని ఆచరించడంలో పాలకులు శ్రద్ధ చూపకపోతే ఆర్థికవేత్తలు మాత్రం ఏమి చేయగలుగుతారు? ఉదాహరణకు వచ్చే ఏడాది కల్లా భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది జనవరిలో మాట మార్చి 2027–28 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు ప్రకటించారు. బిబేక్ దేబ్‌రాయ్ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. ‘రూపాయి విలువతో అంచనా వేసే జీడీపీని డాలర్లకు మార్చి 5 ట్రిలియన్లకు చేరుకోవడం సాధ్యమా? అలా జరగాలంటే మన జీడీపీ కనీసం 10 శాతం దాటాలి’ అని చెప్పారు.


14వ ఆర్థిక సంఘం చైర్మన్ వై.వి రెడ్డి చేసిన అనేక ప్రతిపాదనలను బిబేక్ దేబ్‌రాయ్ ప్రభుత్వానికి సూచించారు. భారతదేశంలో పరిపాలన అత్యధికంగా కేంద్రీకృతం అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారాల వికేంద్రీకరణ, నిధుల పంపిణీ, కేంద్ర ప్రాయోజిత పథకాలను పునర్వ్యవస్థీకరించడం. రాష్ట్రాలకు పన్నుల్లో వాటా పెంచడం వంటి 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను అమలు చేయాలని ఆయన సూచించారు. అసలు ఫైనాన్స్ కమిషన్లను శాశ్వతం చేయాలా లేక రద్దు చేయాలా అన్న చర్చను రేకెత్తించారు. రాష్ట్రాలకు పన్నులు, నిధుల పంపిణీ వాటాను రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించవచ్చు కదా అని ఆయన వాదించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఆయన కొత్త అధ్యాయాన్ని తెరిచారు.

రిజర్వు బ్యాంకుకు స్వతంత్ర ప్రతిపత్తి లేదని స్పష్టంగా చెప్పిన వారిలో బిబేక్ దేబ్‌రాయ్ ఒకరు. మన వ్యవస్థలో అలాంటి అవకాశం లేదని, విత్త విధానం, ఆర్థిక విధానం వేర్వేరు కాదని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను, ఆ తర్వాత, జీఎస్టీ కౌన్సిల్ నేర్పాటు చేసిన తర్వాత భారతీయ ఆర్థిక సమాఖ్య స్ఫూర్తిలో మౌలిక మార్పులు వస్తున్నాయని వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యతో ఆయన పూర్తిగా ఏకీభవించారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిన అసమానతల్ని పూరించేందుకు సంస్థాగత యంత్రాంగం అవసరమని ఆయన వాదించారు. డాలర్ డినామినేషన్‌తో కూడిన బాండ్లలో విదేశాలనుంచి అప్పులు తీసుకోవాలని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను బిబేక్ దేబ్‌ రాయ్‌తో పాటు వైవి రెడ్డి, రంగరాజన్, రఘురామరాజన్ కూడా విమర్శించారు. దీనివల్ల దేశం శ్రీలంకలాగా స్వతంత్రత కోల్పోతుందని హెచ్చరికలు రావడంతో ప్రభుత్వం ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన అధికారిని తప్పించాల్సి వచ్చింది.


ప్రభుత్వ రంగ అసమర్థత సంకెళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను విముక్తి చేయాలని వాదించిన వారిలో బిబేక్ ఒకరు. అంతర్గత వనరులను సృష్టించలేని రైల్వే లాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయాలంటే భారీ ఎత్తున ప్రభుత్వ రంగ, ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమని ఆయన చెప్పారు. పెరుగుతున్న ప్రయాణీకులు, రవాణా అవసరాల రీత్యా 2030 నాటికి 50 లక్షల కోట్లు అవసరమని, అది కేవలం ప్రభుత్వరంగమే సమకూర్చలేదని ఆయన వాదించారు. కాని రైల్వేలో ఆయన ఆశించినంత భారీ మార్పులు జరుగుతున్న దాఖలాలు కనపడడం లేదు.

పన్ను వ్యవస్థను సరళతరం చేసి పన్నును చెల్లించేవారి సంఖ్య పెంచేందుకు ఆయన 15 సంవత్సరాల లక్ష్యాన్ని నిర్దేశిస్తూ నీతీ ఆయోగ్‌కు ఒక పత్రాన్ని ఏడేళ్ల క్రితమే సమర్పించారు. కాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. ‘మన దేశంలో విద్యారంగం నాణ్యత అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా లేదు. ప్రభుత్వాలు పూర్తిగా దృష్టి కేంద్రీకరించి, వనరుల్ని కేటాయించి, అధ్యాపకులు, తల్లిదండ్రులతో చర్చించి దేశమంతా ఒకే రకమైన నాణ్యమైన విద్య అందించేలా చూడాలి’ అని ఆయన చెప్పారు. కాని ఆధునిక భారతదేశానికి అవసరమైన నాణ్యమైన విద్యను కల్పించడంలో మనం ఎన్నో దశాబ్దాలు వెనుకబడి ఉన్నాం.


దేశంలో పోషకాహారం లేకపోవడం మనకు కనపడని ఆకలితో సమానమేనని బిబేక్ దేబ్‌రాయ్ చెప్పారు. ఈ కనపడని ఆకలి వల్ల పుట్టుక లోపాలు, శిశుమరణాలు, అంధత్వం వంటి వాటికి దారితీస్తుందని ఆయన చెప్పారు. వివేక్‌ దేబ్‌రాయ్‌ లాంటి ఆర్థిక విజ్ఞుల ప్రోద్బలం వల్లే 80 కోట్ల మందికి ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోంది. ‘సంస్కరణలంటే ఏమిటి? వ్యక్తులు, సమూహాలు, సంస్థల్లో మార్పులు రావడం. ప్రభుత్వం అవసరమైన చోట ప్రజల పట్ల తన బాధ్యతను విస్మరించకుండా అనసరమైన చోట్లనుంచి తప్పుకోవడం కావాలి’ ఆయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన తెలుగు అధికారి వి. శ్రీనివాస్ పుస్తకానికి రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. భారతదేశంలో అవినీతిపై ఆయన ఒక పుస్తకమే రాశారు. మన జీడీపీలో ప్రభుత్వ అధికారుల అవినీతి, రియల్ ఎస్టేట్‌తో సహా వివిధ రంగాల్లో ఎంత శాతం ఉన్నదో ఆయన పూసగుచ్చినట్లు తెలిపారు. కాని అవినీతిపై ప్రభుత్వం మాటల్లోనే కాని చేతల్లో ఏమీ చేయదని రోజురోజుకూ రుజువవుతోంది.


కేంద్రం నిర్విచక్షణగా వసూలు చేస్తున్న సెస్‌లు, సర్ ఛార్జీల వల్ల ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించిన పన్నుల పంపిణీ అనే దానికే అర్థం లేకుండా పోయింది. వైవిరెడ్డి హయాంలో 14వ ఆర్థిక సంఘం నిర్ణయించిన అత్యధిక పంపిణీకి అర్థం లేకుండా పోయింది. భారతీయ పన్ను వ్యవస్థలో సెస్‌లు, సర్ ఛార్జిలు శాశ్వత లక్షణంగా మారిపోయాయి. సెస్‌ల వినియోగంలో పారదర్శకత లేదు. జాతీయ ప్రాధాన్యత గల రంగాలకే కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయాలని ముఖ్యమంత్రుల కమిటీలతో పాటు అనేక కమిటీలు సిఫారసు చేసినప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాల్లోకి కూడా చొచ్చుకుపోయాయి. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్ర పథకాలను పునర్వ్యవస్థీకరించకూడదని బిబేక్ దేబ్‌రాయ్ చెప్పిన మాటల్ని కేంద్రం విస్మరిస్తోంది. అధికరణ 282 ప్రకారం చేసే ప్రాయోజిత పథకాల క్రింద గ్రాంట్లు ఫైనాన్స్ కమిషన్ బదిలీలకు మించిపోతున్నాయి. ఉచితాలను బిబేక్ దేబ్‌రాయ్ తీవ్రంగా విమర్శించారు. దేశమంతటా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలు ఉచితాలను, రాయితీలను ఎడా పెడా కల్పించడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘మన ప్రజలు దేనికి అర్హులవుతారో అవే వారికి లభిస్తాయి’ అని వ్యాఖ్యానించారు. మీరు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ కదా.. మీ సలహాలన్నీ అమలు అవుతున్నాయా అని ప్రశ్నిస్తే ‘నా పాత్ర ప్రధానమంత్రికి సలహా ఇవ్వడం మాత్రమే. అది కూడా ఆయనకు అవసరమైనప్పుడే’ అని బిబేక్ దేబ్‌రాయ్ నిర్వేదంగా అన్నారు!

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Nov 06 , 2024 | 01:57 AM