ఆంధ్ర పాండ్యన్ ఈ ప్రవీణ్ ప్రకాశ్!
ABN , Publish Date - Oct 02 , 2024 | 02:26 AM
మట్టిని పారతో త్రవ్వడం, తట్టల్లో ఎత్తడం అంత సులభం కాదు. పగులగొట్టిన 20 కిలోల బరువున్న రాళ్లను తట్టలో వేసుకుని కొన్ని వందల మీటర్ల దూరం వరకు తీసుకెళ్లి క్రింద పడేయ్యడం ఇంకా ఎంతో కష్టం. కాని నిత్యం అదే పని చేసే శ్రామిక మహిళలు...
మట్టిని పారతో త్రవ్వడం, తట్టల్లో ఎత్తడం అంత సులభం కాదు. పగులగొట్టిన 20 కిలోల బరువున్న రాళ్లను తట్టలో వేసుకుని కొన్ని వందల మీటర్ల దూరం వరకు తీసుకెళ్లి క్రింద పడేయ్యడం ఇంకా ఎంతో కష్టం. కాని నిత్యం అదే పని చేసే శ్రామిక మహిళలు అవలీలగా, శాస్త్రీయంగా ఈ పనులు చేస్తుంటారు. శ్రామిక మహిళల జీవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఒక విద్యాధికురాలైన స్త్రీ తాను కూడా ఇదే పని చేసేందుకు ప్రయత్నించి విఫలురాలై వెన్నునొప్పి, ఒళ్లు నొప్పులతో వెనుదిరిగారు. ప్రభుత్వ నిబంధనలు ఈ శ్రామిక స్త్రీలు చేసే పనులను నైపుణ్యం లేనివని కొట్టిపారేసి వారికి చాలీచాలని జీతాలు నిర్ణయిస్తాయని, నిబంధనలు తయారు చేసే వారికి ఈ శ్రమజీవుల జీవితాల గురించి ఏ మాత్రం తెలియదని, ఏనాడూ వారు పనిచేసే ప్రాంతాల వద్దకు వెళ్లిన పాపాన పోలేదని ఆమె వాపోయారు. ఒక రోజంతా కష్టించి భౌతిక శ్రమ చేసి ఎంతో దూరంలో ఉన్న ఇళ్లకు తిరిగి వెళ్లి మర్నాడు ఇదే కష్టానికి సిద్ధమయ్యే శ్రమజీవుల నైపుణ్యం గురించి వారెప్పుడైనా అధ్యయనం చేశారా? అని ఆమె ప్రశ్నించారు. ఆమె ఎవరో కాదు, తమిళనాడులో తన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదులుకుని, రాజస్థాన్‌లో శ్రమజీవుల మధ్య తన జీవితాన్ని అంకితం చేసేందుకు వెళ్లిన రామన్ మెగసేసే అవార్డు గ్రహీత అరుణా రాయ్. ఆమె ఆలోచనా విధానం మూలంగానే ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం’ రూపుదిద్దుకుంది.
ప్రజలకోసం పనిచేసే ఇలాంటి సివిల్ సర్వీస్ అధికారులు మనకు అరుదుగా తటస్థిస్తారు. బిఎన్ యుగంధర్, ఎస్‌ఆర్ శంకరన్, బిడి శర్మ, కెబి సక్సేనా, కెఆర్ వేణుగోపాల్ ఎందరో అధికారులు ప్రజలకు అనుకూలమైన పథకాలను రూపొందించి అమలు చేయడంలో విజయవంతమయ్యారు. ప్రభుత్వ అక్రమ ఆదేశాలను అమలు చేయబోమని ప్రతిఘటించి బదిలీలకు గురైన అధికారులు ఎందరో ఉన్నారు. రాజస్థాన్‌లోని చిత్తోర్ ఘడ్‌లో ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు లేచి నిలబడని క్లర్కును తొలగించమని వచ్చిన ఆదేశాలను పాటించనందుకు డా. సమిత్ శర్మ అనే కలెక్టర్ తానే బదిలీ కావల్సి వచ్చింది. అందుకు నిరసనగా 12వేల మంది సామూహికంగా సెలవుపై వెళ్లినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఐఏఎస్ అధికారులకు ఇలాంటి వారు ఆదర్శంగా ఉంటే, ఐఏఎస్ అధికారులు ఆదర్శంగా తీసుకోకూడని అధికారులు కూడా ఎందరో ఉంటారు. వారిలో రెండు రోజుల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ ప్రకాశ్ ఒకరు. ఆయన పదవీవిరమణ చేశారంటే ఢిల్లీలో కూడా కొందరు అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకుంటున్నారు. దీన్ని బట్టి తన సర్వీస్‌లో ఆయన ఎంత వ్యతిరేకత మూటకట్టుకున్నారో అర్థమవుతుంది. తన అధికారం కోసం ఎవరినైనా బలి చేయడానికి ఉపేక్షించని అధికారి ప్రవీణ్ ప్రకాశ్. ఉత్తర భారతావనికి చెందిన ప్రవీణ్ ప్రకాశ్ ఒడిషాలో పాండ్యన్ మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని అధికారం చలాయించారు.
నిజానికి ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నప్పుడే ప్రవీణ్ ప్రకాశ్‌పై టీటీడీ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో టీటీడీ ఎల్ఏసి చైర్మన్‌గా ఈ దుర్వినియోగం చేసిన ఆరోపణలపై నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. అప్పుడు మెడిటెక్ జోన్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూనం మాలకొండయ్యకూ, జీఏడీని నిర్వహిస్తున్న ప్రవీణ్ ప్రకాశ్‌కూ మధ్య కుదిరిన ఒప్పందం మూలంగా ఇరువురూ ఒకరినొకరు రక్షించుకున్నారని ఐఏఎస్ అధికారులే చెప్పారు.
2019లో తెలుగుదేశం, బీజేపీకి మధ్య దూరం పెరగడానికి కారకుల్లో ప్రవీణ్ ప్రకాశ్ కూడా ఒకరు. తెలుగుదేశం ఓడిపోయిన వెంటనే జగన్ శిబిరంలో చేరారు. అందుకు ఆయనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పూర్తి సహాయం చేశారు. ‘నీవు టీడీపీ మనిషివి కదా అని జగన్ అంటే, నేను మీ అభిమానిని సార్.. కావాలంటే విజయసాయిని అడగండి’ అని చెప్పిన ప్రవీణ్ ప్రకాశ్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయ్యారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా అత్యంత బలోపేతమైన జీఏడీని హస్తగతం చేసుకుని ఎల్వీ సుబ్రహ్మణ్యం, పి.వి.రమేశ్ లాంటి వారి అధికారాలను నీరుకార్చారు. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా అధికారాలను చలాయించి, అదేమిటని ప్రశ్నించినందుకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంనే శంకరగిరి మాన్యాలను పట్టిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన తర్వాత ఢిల్లీ నుంచి నీలం సహానీని రప్పించి ఛీఫ్ సెక్రటరీ చేయించిన ప్రవీణ్ ప్రకాశ్ ఆమెకు కూడా తెలియకుండా వందలాది జీవోలు జారీ చేశారు. నీలం సహానీకి తెలియకుండానే ఆమె సంతకంతో జీవోలు తయారయ్యేవి! రాత్రి మూడు గంటలకు కూడా జీవోలు విడుదలైన సందర్భాలున్నాయి. ఆ రకంగా ఫైల్ సిస్టమ్‌లో సీఎస్‌ను జీరో చేసిన ఘనత ప్రవీణ్ ప్రకాశ్‌కు దక్కింది. చివరకు ముఖ్యమంత్రికి వచ్చే ఫైళ్లు కూడా తన వద్దకే తెప్పించుకుని నిర్ణయాలు తీసుకునే అధికారం సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదు.. అని తానే కొట్టిపారేయడమే కాక, తానే ఎలా చేయాలో మంత్రిత్వ శాఖ కార్యదర్శులను నిర్దేశించేవారు. కొందరు అధికారులు ముఖ్యమంత్రికి ఈ విషయం గురించి చెప్పినా ఆయన పట్టించుకునేవారు కాదు. దీనితో అర్ధరాత్రి కూడా అధికారులకు ఫోన్లు చేసి వేధించడం, రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు నిర్వహించడం చేసేవారు.
నీలం సహానీ తర్వాత ఆదిత్యనాథ్ దాస్ చీఫ్ సెక్రటరీ అయ్యారు. ఇండియా సిమెంట్స్ కేసులో తనతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్నందుకు జగన్ ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించారు. అయితే ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి చేసిన ఉత్తర్వులను కూడా ఢిల్లీ పంపకుండా ప్రవీణ్ ప్రకాశ్ దాదాపు 15 రోజులు తన దగ్గర పెట్టుకున్నారని సమాచారం. దీనితో ఆదిత్యనాథ్ ఆ ఫైలు ఢిల్లీకి పంపవలసిందిగా ప్రవీణ్ ప్రకాశ్‌ను కాళ్ళా వేళ్లా బతిమిలాడాల్సి వచ్చింది.
ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులకు వాట్సాప్ గ్రూప్ ఒకటున్నది. అందులో జూనియర్లు, సీనియర్లు కలిపి దాదాపు 360 మంది దాకా ఉంటారు. ‘ఏపీలో సివిల్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది.. ఇది సరైంది కాద’ని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఒక రోజు వ్యాఖ్యానించారట. ‘మీరు రిటైర్ అయ్యారు మీకెందుకు ఇవన్నీ ఇంట్లో కూర్చోకుండా’ అని ప్రవీణ్ ఈ గ్రూప్‌లో స్పందించడంతో చాలా మంది సీనియర్ అధికారులు దిగ్భ్రాంతి చెందారు. ఒక 1983 బ్యాచ్ అధికారితో 1994 బ్యాచ్ అధికారి వ్యవహరించే తీరు ఇదేనా అని చాలా మంది బాధపడ్డారు. ప్రవీణ్ అంతటితో ఊరుకోకుండా ఆదిత్యానాథ్ దాస్‌తో కూడా ఎల్వీకి వ్యతిరేకంగా ఈ గ్రూప్‌లో కామెంట్లు పెట్టించారట. దీనితో మనసు గాయపడ్డ ఎల్వీ వాట్సాప్ గ్రూపు నుంచే తప్పుకున్నారు. తన ఫైలు ఢిల్లీకి పంపించాలంటే ఎల్వీపై కామెంట్ చేయాలని ప్రవీణ్ ప్రకాశ్ ఒత్తిడి చేశారని ఆదిత్యనాథ్ దాస్ తన తోటి అధికారులకు చెప్పి బాధపడ్డారని సమాచారం. ఎట్టకేలకు ఆదిత్యనాథ్ దాస్ సర్వీసు పొడిగింపునకు అనుమతి లేఖ ఆయన పదవి ముగిసే చివరి రోజు లభించింది.
ఆదిత్యనాథ్ దాస్ తర్వాత ప్రవీణ్ ప్రకాశ్ చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను రప్పించారు. నిజానికి ప్రవీణ్ ప్రకాశ్ ఢిల్లీలో ఉన్నప్పుడు సమీర్ శర్మను సెక్రటరీగా ఎంపానెల్మెంట్ కాకుండా అడ్డుపడ్డారు. కాని తర్వాత ఆయననే చీఫ్ సెక్రటరీగా తెచ్చుకున్నారు. ఆయన పదవీకాలం త్వరలోనే ముగుస్తుండడం, స్థానికుడైతే తన పట్టులో ఉండడని భావించడం ఇందుకు కారణం. సమీర్ శర్మను కూడా నీలం సహానీ మాదిరి డమ్మీ చేసినా కాదనేవారు లేకపోయారు.
ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నా ప్రవీణ్ ప్రకాశ్ తరుచూ ఢిల్లీ వచ్చేవారు. తరచు వారాంతాలూ ఇక్కడే గడిపేవారు. ఢిల్లీ వచ్చేందుకు వీలుగా ఆయన తనకు తానే స్పెషల్ కమిషనర్ ఏపీ భవన్‌గా కూడా నియమించుకుని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేసేవారు. ఢిల్లీలో ఏమి చేసేవారో ఎక్కడికి వెళ్లేవారో అన్న విషయాలపై ఊహాగానాలు ఎన్నో చెలరేగేవి. చాలాసార్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్వార్టర్‌లోనే ప్రవీణ్ ప్రకాశ్ బసచేసేవారు.
విచిత్రమేమంటే జగన్ శిబిరంలో చేరేందుకు తనకు సహాయపడ్డ విజయసాయిరెడ్డినే ఆయన ధిక్కరించారని ఒక అధికారి చెప్పారు. విజయసాయిరెడ్డి కోరిన ఒక బదిలీ చేసేందుకు ప్రవీణ్ ప్రకాశ్ నిరాకరించారు. దీనితో వారి మధ్య వాగ్వివాదం పెరిగింది. ఈ విషయం తెలిసి జగన్ వారిద్దరినీ తన వద్దకు పిలిపించారు. ‘నేను మీ సెక్రటరీని. నన్ను తిట్టారంటే మిమ్మల్ని తిట్టినట్లే కదా..’ అని ప్రవీణ్ ప్రకాశ్ జగన్‌కు చెప్పారు. దీనితో ప్రవీణ్ ప్రకాశ్‌కు క్షమాపణ చెప్పాల్సిందిగా విజయసాయిరెడ్డిని జగన్ ఆదేశించారు. చేసేదేమిలేక విజయసాయిరెడ్డి ప్రవీణ్ ప్రకాశ్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
జగన్‌ను పూర్తిగా వశపరుచుకోవడంలో విజయవంతమైన ప్రవీణ్ ప్రకాశ్ సీఎం పేషీలో ఉన్న ఇతర అధికారులకు కూడా కొరకరాని కొయ్యలా మారారు. ఈయనను ఎలా పంపించాలా అని ప్రతి ఒక్కరూ అనుకునేవారు. ‘మీరు ఫిల్మ్ స్టార్‌లా ఉన్నారు. మీ ముందు అమితాబ్ బచ్చన్ లాంటి వారు కూడా ఎందుకు సరిపోతారు’ అంటూ ప్రవీణ్ ప్రకాశ్ చేసే పొగడ్తలకు జగన్ ఆనందాతిరేకంతో ఉప్పొంగిపోయేవారట! ప్రవీణ్ ప్రకాశ్ తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానంలో ప్రశ్నార్థకమైనా జగన్ గ్రహించలేక న్యాయవ్యవస్థనే తప్పుపట్టేవారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఉపాధ్యాయులు తీవ్ర నిరసన తెలుపడంతో కొందరు అధికారులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మనం మళ్లీ గెలవాలంటే ఇలాంటి వారిని తప్పించాలి అని ఒక నాయకుడు చెప్పారు. ‘సీఎం సార్.. వీరి మాటలు వినకండి.. మీరు ఇప్పటికే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. మీరు గెలిచేసినట్లే.. అనుకోండి’ అని ప్రవీణ్ ప్రకాశ్ చెప్పడంతో జగన్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఒడిషాలో ఏకబిగిన 24 సంవత్సరాలు పాలించిన నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోవడానికి పాండ్యన్ కారకుడైతే, ఏపీలో జగన్ అయిదు సంవత్సరాల్లోనే గద్దెదిగేందుకు కేవలం ప్రవీణ్ ప్రకాశ్ లాంటి వారిని మాత్రమే తప్పుపట్టక్కర్లేదు. స్వయంగా వివేక భ్రష్టులైన వారికి ఇలాంటి అధికారులు మరింత తోడ్పాటునందిస్తారు!
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)