Share News

‘ఐఏఎస్’లో సమూల మార్పులు అవసరమా?

ABN , Publish Date - Jun 19 , 2024 | 05:36 AM

రైతు నాయకుడైన చరణ్ సింగ్ 1967లో ముఖ్యమంత్రి కాగానే తన చీఫ్ సెక్రటరీ బిబి సింగ్‌ను పిలిచి ‘నాకు మెరికల్లాంటి నలుగురు యువ ఐఏఎస్ అధికారులు కావాలి. వారు మన రాష్ట్రానికి చెందినవారై...

‘ఐఏఎస్’లో సమూల మార్పులు అవసరమా?

రైతు నాయకుడైన చరణ్ సింగ్ 1967లో ముఖ్యమంత్రి కాగానే తన చీఫ్ సెక్రటరీ బిబి సింగ్‌ను పిలిచి ‘నాకు మెరికల్లాంటి నలుగురు యువ ఐఏఎస్ అధికారులు కావాలి. వారు మన రాష్ట్రానికి చెందినవారై ఉండకూడదు. దక్షిణాది వారైనా, పంజాబీవారైనా సరే..’ అన్నారు. మన దేశం ఆహార ధాన్యాల సంక్షోభంలో ఉన్న కాలమది. అమెరికా నుంచి ఓడ రాకపోతే భారత దేశ ప్రజలు ఆకలితో మాడిపోతారని అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ సైతం వ్యాఖ్యానించిన రోజులవి. ఉత్తర ప్రదేశ్‌లో ఆహార సంక్షోభాన్ని నివారించాలంటే నల్లబజారులో ఆహార ధాన్యం విక్రయించకుండా చర్యలు తీసుకోకతప్పదని చరణ్ సింగ్ భావించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు అధికారులను తన వద్దకు పిలిపించుకుని వారికి నాలుగు కొత్త జీపులతో పాటు రూ. 150 ప్రత్యేక వేతనంగా ఇస్తానని తెలిపారు. ‘మీరు రాష్ట్రమంతటా తిరగండి. ఎక్కడ అక్రమాలు జరిగినా నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోండి.. మీ వెనుక నేనున్నాను’ అని చెప్పారు. ఆ నలుగురు ఐఏఎస్ అధికారులు నెల రోజులు రాష్ట్రమంతటా తిరిగారు. అక్రమ నిల్వలు చేసిన వ్యాపారుల పైన, తిండి గింజలను సరిగ్గా పంపిణీ చేయని వారి పైన పోలీసుల సహకారంతో దాడులు చేశారు. మార్కెట్‌పై అక్రమార్కుల పట్టును బద్ధలుకొట్టారు. మరో వైపు పంపిణీ యంత్రాగం కూడా అప్రమత్తమై పేదలకు ఆహార ధాన్యాలను సక్రమంగా పంపిణీ చేయడంలో నిమగ్నమైంది. ఉత్తర ప్రదేశ్ కరువు, ఆకలి చావుల పాలిట పడకుండా చరణ్ సింగ్ కాపాడారు. తర్వాత దేశంలో వచ్చిన హరిత విప్లవం ఆహార రంగ పరిస్థితులను మార్చింది. ‘మీరు ఇతర రాష్ట్రాల అధికారులను ఎందుకు నియమించారు?’ అని చరణ్ సింగ్‌ను అడిగితే ‘ఇక్కడి అధికారులైతే వారికెవరో బంధువులు ఉంటారు. వారిపై ఒత్తిళ్లు వస్తాయి. పైగా మన రాష్ట్రంలో అంతా కుల రాజకీయాలే. అందువల్ల ఏ పంజాబీ అధికారో, దక్షిణాది అధికారో అయితే ఏ ఒత్తిళ్లు లేకుండా పనిచేస్తారు’ అని చెప్పారు.


నాయకుడు నిజాయితీగా ఉంటే అధికారులను సమర్థంగా పనిచేయించగలరు అన్నదానికి చరణ్ సింగ్ ఉదంతం ఒక ఉదాహరణ. అప్పుడంటే ఇతర రాష్ట్రాలవారితో పనిచేయించుకుంటే ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకుల నీచత్వం వల్ల, అసమర్థత, అజ్ఞానం వల్ల అన్ని ప్రాంతాల అధికారులు ఎక్కడ పనిచేసినా ఆ నేతల మకిలిని తమకు కూడా అంటించుకుంటున్నారు. నిజానికి ఒక ప్రభుత్వం విఫలమైతే, అధికారులను నిందించి లాభం లేదు. రాజకీయ నాయకత్వం దౌర్భాగ్యం వల్ల ఐఏఎస్ అధికారులు కూడా దిగజారిపోతున్నారనడంలో సందేహం లేదు. ‘ఐఏఎస్ అధికారుల ఎంపిక చాలా పకడ్బందీగా జరుగుతుంది. చాలా తెలివిగలవారిని సమర్థులను ఎంపిక చేస్తారు. అటువంటప్పుడు వారు ఎందుకు సమర్థంగా పనిచేయలేరు? రాజకీయ నాయకులు సక్రమంగా ఉంటే వారు కూడా సక్రమంగా పనిచేస్తారు’ అని మాజీ ఐఏఎస్ అధికారి ఆల్ఫోన్స్ ఒక సందర్భంలో చెప్పారు.

కాని రాజకీయ నాయకులు అధికారులను తమ అవినీతి కూపంలోకి లాగడం, అక్రమార్జన ఎలా చేయవచ్చో అధికారులు కూడా నేతలకు నేర్పించడం ఒక విషవలయంగా మారింది. ఒక ఉత్తరాది ముఖ్యమంత్రికి ఆయన నమిలే పొగాకు (ఖైనీ)ను సీనియర్ అధికారులే అందించేవారు. ఆ ముఖ్యమంత్రి, తన స్వంత పనులను చేసి పెట్టని అధికారులను ఎడాపెడా బదిలీ చేసేవారు.


రాజకీయ నాయకులతో పాటు క్విడ్ ప్రో కేసుల్లో అనేక మంది ఐఏఎస్ అధికారులు కోర్టు చుట్టూ తిరిగిన ఉదంతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఉన్నాయి. ఈ విషయం తెలిసినప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలువురు అధికారులు గత అయిదేళ్లలో ముఖ్యమంత్రి అండతోనే విశృంఖలంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక అవినీతి అధికారిని తన వద్ద చేర్చుకోవడం కోసం ఢిల్లీలో హోంమంత్రి చుట్టూ తిరిగిన సందర్భాలున్నాయి. ఏపీలో కొందరు ఉన్నతాధికారులు అసైన్డ్ భూములు, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ఆక్రమణ, అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం, అధికార పార్టీ రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడం, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడం, విచ్చలవిడిగా అప్పులను ప్రోత్సహించడం, తప్పుడు పనులు చేసేందుకు ఒప్పుకోని తోటి అధికారులనే తీవ్రంగా వేధించడం వంటి అనేక దురాగతాలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కొందరు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించారు. వారు ఎందుకలా చేశారు? అధికారం తమకు శాశ్వతంగా ఉంటుందని భావించారా? లేక తమను బానిసలుగా చేసుకున్న రాజకీయ నేతలు శాశ్వతంగా రాజ్యమేలుతారని అనుకున్నారా? తర్వాత అధికారంలోకి వచ్చే నేతలు ఇలాంటి వారిని చీదరించుకోకుండా ఎలా ఉంటారు?


అధికారులతో సక్రమంగా పనిచేయించుకోవడం అనేది ఒక కళ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు రోజుల క్రితం తన ప్రిన్సిపల్ సెక్రటరీగా పికె మిశ్రాను, జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్‌ను మళ్లీ నియమించారు. ఆయన ఒకసారి వ్యక్తుల సమర్థతను విశ్వసించారంటే వారిని వదిలే అవకాశం లేదు. 1968 బ్యాచ్‌కు చెందిన కేరళ అధికారి అయిన అజిత్ దోవల్ 2014 నుంచీ మోదీ సలహాదారుగానే కొనసాగుతున్నారు. ఇక పికె మిశ్రా గురించి చెప్పనక్కర్లేదు. 2001లో నరేంద్రమోదీ తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్టణానికి చెందిన గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి జి.సుబ్బారావు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. మోదీతో కలిసి పనిచేసేందుకు సుబ్బారావు నియమించిన ముగ్గురు అధికారుల్లో పికె మిశ్రా ఒకరు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన మోదీతోనే ఉన్నారు. గుజరాత్ రోజుల నుంచి మోదీతో సన్నిహితంగా ఉన్న అధికారులు హిరేన్ జోషి, ప్రతీక్ దోషి (నిర్మలా సీతారామన్ అల్లుడు), సంజయ్ భవ్సర్, ఎకె శర్మ వంటి అనేక అధికారులు మోదీతో చాలాకాలంగా కొనసాగుతున్నారు. నిజానికి మోదీ ముఖ్యమంత్రి కాక ముందు కనీసం సర్పంచ్ బాధ్యతలను సైతం నిర్వహించలేదు కాని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పాలన గురించి నేర్చుకునేందుకు తన చుట్టూ ఉన్న అధికారులనే ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకు ఐఏఎస్, జిల్లా అభివృద్ది అధికారుల సదస్సును ప్రారంభించాలని సుబ్బారావు మోదీని ఆహ్వానించారు.

‘మీరు దీపం వెలిగించి ఉపన్యసించి వెళ్లిపోతే చాలు..’ అన్నారు. ‘అక్కడేం జరుగుతుంది?’ అని మోదీ అడిగారు. ‘కలెక్టర్లు, డీడీఓల క్రింద ఉన్న అన్ని విభాగాలను సమీక్షిస్తాం’ అని సుబ్బారావు చెప్పారు. నిజానికి ప్రతి ఏడాదీ ఈ సమావేశం ఒక తంతులా జరిగేది. మధ్యాహ్న భోజనం కాగానే అందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయేవారు. కాని ఈ సమావేశానికి హాజరైన మోదీ అక్కడ నుంచి కదల్లేదు. దీనితో వివిధ విభాగాల సెక్రటరీలు కూడా కదలకుండా అక్కడే కూర్చున్నారు. నోట్స్ తీసుకుంటూ ప్రశ్నలు అడుగుతూ మోదీ ప్రతి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. సమావేశం రాత్రి 11 గంటల వరకూ సాగింది. ఇలా అధికారుల నుంచి పాలనా వ్యవహారాల విషయమై పాఠాలు నేర్చుకున్న మోదీ తర్వాతి కాలంలో క్రమక్రమంగా అధికారులపైనే పట్టు సాధించగలిగారు. గుజరాత్‌లోనూ, ఢిల్లీలోను మోదీ పాలనలో అవినీతి గురించి చర్చలేకపోవడానికి వారే కారణం. మోదీ విజయ రహస్యం వెనుక కూడా అధికారుల హస్తం లేదని చెప్పలేం.


గత 24 సంవత్సరాలుగా ఒడిషాలో తిరుగులేని అధికారాన్ని చలాయించిన నవీన్ పట్నాయక్ ఈ సారి ఓటమిపాలు కావడానికి ఒక ఐఏఎస్ అధికారే కారణమని బిజూ జనతాదళ్ నేతలు ఆరోపిస్తున్నారు. నవీన్ పట్నాయక్ తన బాధ్యతల నిర్వహణలో ఐఏఎస్ అధికారులపై ఎక్కువగా ఆధారపడేవారు. తొలుత ఆయన తన తండ్రి హయాంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మహాపాత్ర అనే అధికారికి అన్ని బాధ్యతలు అప్పగించారు. మహాపాత్ర రాజకీయ అధికారాలు కూడా చలాయించారు. ఆయన తర్వాత బాధ్యతలు నిర్వర్తించిన పాండ్యన్ మరో అడుగు ముదుకు వేసి బిజూ జనతాదళ్ పార్టీని కూడా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. పంజాబ్ కేడర్‌కు చెందిన పాండ్యన్ తన భార్య ఒడిషా అధికారిణి కావడంతో ఆ రాష్ట్రానికి మారారు. నవీన్ పట్నాయక్ పాండ్యన్‌ను పూర్తిగా విశ్వసించడంతో ఎన్నికల టిక్కెట్లు కూడా ఆయనే పంపిణీ చేయడం మొదలు పెట్టారు. నవీన్ అనారోగ్యాన్ని పాండ్యన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏ రాజకీయనాయకుడినీ నవీన్ పట్నాయక్‌ను కలుసుకోనిచ్చేవారు కాదు. 2023లో పాండ్యన్ తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి స్థాయి బీజేడీ నాయకుడుగా మారారు. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు బీజేడీతో పొత్తు కోసం పాండ్యన్‌తోనే చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయి. వేరే రాష్ట్రానికి చెందిన పాండ్యన్‌కు పార్టీని, ప్రభుత్వాన్ని అప్పగించడం ద్వారా ఒడిషా ఆత్మగౌరవాన్ని పట్నాయక్ తాకట్టు పెట్టారని నరేంద్రమోదీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. ఒక చరిత్రగల నేతను కూడా ఐఏఎస్ అధికారులు ఎంత భ్రష్టుపట్టించగలరో అన్నదానికి ఒడిషాలో జరిగిన మార్పు ఒక నిదర్శనం. రాజకీయ నాయకులకు ఇది ఒక గుణపాఠం కూడా!


‘తొలి రోజుల్లో ఐఏఎస్‌లు నిజాయితీపరులుగా ఉండేవారు. కాని ఇవాళ వివిధ రంగాల్లో దేశం వైఫల్యాలకు కారణం ఐఏఎస్ అధికారులే’ అని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్, కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి దువ్వూరి సుబ్బారావు ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. ‘సమర్థత, అంకితభావం, నిజాయితీకి ఐఏఎస్‌లు ఒకప్పుడు మారుపేరుగా నిలిచేవారు. కాని ఆ స్థానంలో ఇప్పుడు అసమర్థత, పరిపాలన పట్ల నిరాసక్తత, అవినీతి చోటుచేసుకున్నాయి’ అని ఆయన వాపోయారు. ఐఏఎస్ పూర్వవైభవాన్ని, ప్రామాణికతను పునరుద్దరించగలమా లేక వర్తమాన అవసరాలకు తగ్గట్లుగా ఐఏఎస్ వ్యవస్థనే సమూలంగా మార్చవలసిన అవసరం ఉన్నదా అన్న విషయంపై చర్చ జరగాల్సి ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jun 19 , 2024 | 05:36 AM