Share News

హరియాణా ఎన్నికలు, ప్రాంతీయ అస్తిత్వాలు

ABN , Publish Date - Aug 28 , 2024 | 01:45 AM

తెలుగుదేశం అధినేత నందమూరి తారకరామారావు 1987లో హరియాణాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి లోక్‌దళ్ ఘన విజయానికి తోడ్పడిన విషయం చరిత్ర పుటల్లో రికార్డు అయింది. ఆ ఎన్నికల్లో రైతు నాయకుడు దేవీలాల్...

హరియాణా ఎన్నికలు, ప్రాంతీయ అస్తిత్వాలు

తెలుగుదేశం అధినేత నందమూరి తారకరామారావు 1987లో హరియాణాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి లోక్‌దళ్ ఘన విజయానికి తోడ్పడిన విషయం చరిత్ర పుటల్లో రికార్డు అయింది. ఆ ఎన్నికల్లో రైతు నాయకుడు దేవీలాల్ సారథ్యంలోని లోక్‌దళ్ – భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసి 90 సీట్లలో 76 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. లోక్‌దళ్‌కు 60 సీట్లు రాగా, బీజేపీకి 16 సీట్లు లభించాయి. దాదాపు 37 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్న హరియాణా ఎన్నికల్లో దేవీలాల్ మునిమనుమడు, నాలుగోతరం నేత దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జెజెపి) భవిష్యత్ ఏమిటో అక్టోబర్ 1న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు తేల్చనున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 15 శాతం ఓట్లు, 10 సీట్లు సాధించిన జెజెపి మూడునెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 0.87 శాతం ఓట్లు సాధించింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలోని 90 సీట్లలో బీజేపీ కేవలం 47 సీట్లు సాధించడంతో జెజెపి కీలక మద్దతునిచ్చి ప్రభుత్వం ఏర్పాటుకు దోహదం చేసింది. అయిదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జెజెపిని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. 2020లో రైతుల ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు, మహిళా మల్లయోధుల నిరసన సమయంలోకూడా అధికారంతో అంటకాగడంతో జెజెపి ప్రజలకు దూరమైంది. లోక్‌సభ ఎన్నికల్లో గ్రామాల్లో ప్రజలు ఆ పార్టీని ప్రచారానికి కూడా అనుమతించలేదు. ఒకప్పుడు హరియాణా రాజకీయాలను శాసించిన దేవీలాల్ – చౌతాలా కుటుంబం ముక్కలుముక్కలై, వేర్వేరు పార్టీలుగా చీలి ఇప్పుడు అస్తిత్వ పరీక్షలో ఉన్నది.


ఉనికిని కాపాడుకునేందుకు చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో కలిసి జెజెపి పోటీ చేస్తోంది. తద్వారా ఎంతో కొంత ఓటు బ్యాంకును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకోలేకపోయాం. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మూల్యం చెల్లించాం’ అని దుష్యంత్ చౌతాలా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. హరియాణాలో ప్రధాన పోటీ ఇప్పుడు కాంగ్రెస్– బీజేపీలకే పరిమితం కావడంతో తాను మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాననే ఆశతో దుష్యంత్‌ ఉన్నారు.

నిజానికి హరియాణాలో ప్రాంతీయ రాజకీయాలు 1967లోనే ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌లో ముఠా తగాదాలే ఈ ప్రాంతీయ పార్టీలకు కారణమయ్యాయి. 1967లో హరియాణా వికాస్ పార్టీ స్థాపించిన బీరేంద్ర సింగ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా అధికారం చలాయించినప్పటికీ ఏడాది కూడా పాలించలేకపోయారు. ఆ తర్వాత నిలదొక్కుకోకపోవడంతో 1978లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత భారతీయ క్రాంతిదళ్, హరియాణా వికాస్ పార్టీ, హరియాణా జనసభ వంటి నాలుగైదు ప్రాంతీయ పార్టీలు ఏర్పడినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కేవలం భారత జాతీయ లోక్‌దళ్ మాత్రమే చాలా కాలం హరియాణా రాజకీయాలను ప్రభావితం చేసింది. కాని ఈ పార్టీ ముక్కలై 2019లో జననాయక్ జనతా పార్టీ రూపంలో మిగిలింది. ఇప్పుడా పార్టీ కూడా కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది.


1989 లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 85 సీట్లు సాధించినప్పటికీ బీజేపీ హరియాణాలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. సుష్మాస్వరాజ్, సూరజ్‌భాను వంటి నేతలు కూడా పరాజయం పాలయ్యారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా 120 సీట్లు సాధించినప్పటికీ హరియాణాలో రెండు సీట్లు సాధించింది. దీనితో దేశవ్యాప్తంగా బీజేపీ పుంజుకోవాలంటే ప్రాంతీయ పార్టీల భుజాన ఎక్కడం తప్పదని గ్రహించింది. సరిగ్గా అదే సమయంలో నరేంద్రమోదీని పార్టీ ఇన్‌ఛార్జిగా బీజేపీ రంగంలోకి దించింది. అప్పటికి కాంగ్రెస్‌తో విభేదాల వల్ల బన్సీలాల్ హరియాణా వికాస్ పార్టీ పేరుతో స్వంత కుంపటిని ఏర్పాటు చేసుకుని 1991 ఎన్నికల్లో 5.35శాతం ఓట్లతో ఒక సీటును సాధించడం మోదీ దృష్టిని ఆకర్షించింది. మోదీ ప్రయోగం విజయవంతమై 1996 ఎన్నికల్లో హరియాణా వికాస్ పార్టీ–బీజేపీ కూటమి కలిసి 76 సీట్లను సాధించింది. 11 సీట్లతో బీజేపీ బన్సీలాల్ ప్రభుత్వానికి కీలక మద్దతును అందించింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే బన్సీలాల్ ప్రభుత్వం దుష్పరిపాలన మూలంగా రెండేళ్లలోనే ప్రజాదరణ కోల్పోయింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 182 సీట్లను సాధించినప్పటికీ బీజేపీ, హెచ్‌విపి హరియాణాలో చెరొక సీటును మాత్రమే పొందాయి. దీనితో మోదీ చక్రం తిప్పి వెంటనే బన్సీలాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని భారత జాతీయ లోక్‌దళ్ నేత దేవీలాల్ కుమారుడు ఓం ప్రకాశ్ చౌతాలాతో చేతులు కలిపారు. కేంద్రంలో ఏర్పడ్డ వాజపేయి తొలి ప్రభుత్వానికి నలుగురు ఎంపీలతో చౌతాలా మద్దతు నీయడమే ఇందుకు కారణం. ఆ తర్వాత బన్సీలాల్ గతిలేక మళ్లీ కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేశారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వ్యూహం ఫలించి ఐఎన్ఎల్‌డి–బీజేపీ మొత్తం పది సీట్లను సాధించగలిగాయి.

2000 అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్ఎల్‌డి స్వంతంగానే 62 సీట్లు సాధించడంతో బీజేపీ మద్దతు అవసరం లేకుండా పోయింది. అయినప్పటికీ బీజేపీ వెలుపలి నుంచి మద్దతునందించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా మోదీ మళ్లీ గుజరాత్ రాజకీయాల్లో ప్రవేశించడం, వాజపేయి ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోవడం, కాంగ్రెస్ పుంజుకోవడంతో హరియాణా రాజకీయాలు బీజేపీ చేతుల్లోంచి జారిపోయాయి. 2005 నుంచి 2014 వరకు భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో అధికారం చలాయించింది. ఐఎన్ఎల్‌డి ప్రతిపక్ష స్థానంలో ఉండగా, బీజేపీ రెండు మూడు సీట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.


మళ్లీ 2014లో నరేంద్రమోదీ ప్రభంజనం వీచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే హరియాణాలో బీజేపీ దశ తిరిగింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీ హరియాణాలో బీజేపీని గెలిపించి 1995– 2001 మధ్య తనతో పాటు పార్టీ యంత్రాంగంలో పనిచేసిన మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి చేశారు. 2019లో ఖట్టర్ పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో చౌతాలా మనుమడి సహకారంతో ప్రభుత్వం నిలబెట్టుకున్నారు. కాని లోక్‌సభ ఎన్నికల సమయంలో జెజెపితో విభేదాలు రావడంతో ఖట్టర్‌ను తప్పించి నాయబ్‌సింగ్ సైనీ అనే బీసీ నేతకు పగ్గాలు అప్పజెప్పారు. జెజెపిని పక్కన పెట్టి స్వంతంగా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల ప్రజా వ్యతిరేకతను తట్టుకుని బీజేపీ హరియాణాలో గెలుస్తుందా, పది సంవత్సరాల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌కు అధికారం అప్పజెబుతుందా ఇప్పుడే చెప్పడం కష్టం. ఏమైనా ‘ఉద్ధతుల మధ్య పేదలకుండతరమే’ అన్నట్లుగా హరియాణాలో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య జరిగే భీకరపోరులో ఒక చరిత్ర గలిగిన ప్రాంతీయ పార్టీ అవశేషం మనుగడ ఏమిటో ఈ ఎన్నికల్లో తేలుతుంది.

సారాంశం ఏమంటే 1987లో ఎన్టీఆర్ లోక్‌దళ్‌కు ప్రచారం చేసినప్పుడు బీజేపీ బాల్యదశలో ఉన్న పార్టీయే. నాడు ఎన్టీఆర్, దేవీలాల్ నేషనల్ ఫ్రంట్ నేతలుగా కూర్చుని ఉండగా వాజపేయి, చంద్రశేఖర్‌లు వెనుకనిలబడి ఉన్న దృశ్యం మరిచిపోలేనిది. దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ను ప్రచారానికి ఆహ్వానిస్తున్న రోజులవి. ఆ తర్వాతి కాలంలో బీజేపీ దినదిన ప్రవర్థమానమైనట్లు ఎదిగి దేశ రాజకీయాలను తానే ప్రభావితం చేయగలిగే స్థాయికి చేరుకుంది. హరియాణాలో నిలదొక్కుకునేందుకు చాలా అవస్థలు పడింది. పేక ముక్కల్ని మార్చినట్లు మిత్రపక్షాలను మార్చింది. చివరకు బీజేపీ తానే స్వంతంగా అధికారంలోకి రాగలిగిన స్థాయికి చేరుకుంది.


హరియాణా అనుభవాలు దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలకు కూడా వర్తిస్తాయా అన్న విశ్లేషణకు ఆస్కారం కలిగిస్తున్నాయి. నేషనల్ ఫ్రంట్‌లో పాత్ర పోషించిన బిజూ జనతాదళ్ అధినేత బిజూ పట్నాయక్ కుమారుడు నవీన్ పట్నాయక్ ఇప్పుడు 24 సంవత్సరాల పాలన తర్వాత పార్టీ పరాజయం కావడంతో దాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఒడిషాలో బిజెడి భుజాలపై ఎక్కి ఎదిగిన పార్టీయే. బిజెడితో పాటు తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రలో వైసీపీ కూడా హరియాణాలో జన నాయక్ జనసేన పార్టీ మాదిరి మనుగడ తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. దేవీలాల్ తర్వాత నాల్గోతరం వరకైనా జెజెపి రూపంలో ఆయన వారసత్వం మిగిలి ఉంటే, బిజెడి రెండో తరం కొంతకాలం నిలదొక్కుకోగలిగింది. బిఆర్ఎస్ రెండో తరం వరకు రాకముందే సంక్షోభంలో పడింది. వైసీపీలో మొదటి తరమే మిగిలి ఉంటుందా అన్నది అనుమానమే. దేశంలో ఇప్పుడు తెలుగుదేశం, జనతాదళ్(యు) పార్టీల మద్దతుపై ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉండగా, అత్యధిక ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమికి మద్దతునిస్తున్నాయి. హరియాణా, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ–ఇండియా కూటమిల మధ్యే పరిమితం కాగా దేశవ్యాప్తంగా ఇక జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈ ఉభయ కూటముల ఆధిపత్యమే కొనసాగే అవకాశాలున్నాయి. భారత రాజకీయాలు ఇప్పుడు రెండు కూటముల మధ్యే పరిమితమయ్యాయని, ఈ రెండు కూటములకు చెందని పార్టీలు అస్తిత్వ పరీక్షలో ఉన్నాయని చెప్పేందుకు పెద్దగా రాజకీయ పరిశీలన అక్కర్లేదు. అవినీతి, అరాచక పాలన, ఒంటెత్తు పోకడల వల్లే దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు అదృశ్యమయే పరిస్థితిలో పడ్డాయి. వాటి పరిస్థితికి బీజేపీని పూర్తిగా నిందించాల్సిన పనిలేదు. సక్రమంగా పనిచేసే ప్రాంతీయ పార్టీలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. అలాంటి పార్టీల మద్దతుపై ఆధారపడినప్పుడే జాతీయ పార్టీలు బుద్దిగా నడుచుకుంటాయి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Aug 28 , 2024 | 01:45 AM