Share News

రెండు ధ్రువాలుగా రాజకీయ భారత్

ABN , Publish Date - Jul 17 , 2024 | 05:17 AM

‘దేశ ప్రజలు కాంగ్రెస్‌ను వ్రేళ్లతో పెకిలించేందుకు నిర్ణయించారు. కాంగ్రెస్ లేకుండా భారత దేశాన్ని విముక్తి చేయాలన్నది బీజేపీ నినాదం మాత్రమే కాదు, ప్రజల సంకల్పం కూడా’ అని పదేళ్ల క్రితం...

రెండు ధ్రువాలుగా రాజకీయ భారత్

‘దేశ ప్రజలు కాంగ్రెస్‌ను వ్రేళ్లతో పెకిలించేందుకు నిర్ణయించారు. కాంగ్రెస్ లేకుండా భారత దేశాన్ని విముక్తి చేయాలన్నది బీజేపీ నినాదం మాత్రమే కాదు, ప్రజల సంకల్పం కూడా’ అని పదేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. పదేళ్లుగా ఆయన అనేకసార్లు కాంగ్రెస్ విముక్త భారత్ గురించి మాట్లాడుతూనే వచ్చారు. కాని పదేళ్ల తర్వాత కూడా ఈ దేశం కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తం కాలేదు. లోక్‌సభలో కాంగ్రెస్ సంఖ్యాబలం వందకు చేరుకుంది. బీజేపీ బలం 240 సీట్లకు తగ్గిపోయింది. గత వారం దేశ వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లు మాత్రమే దక్కగా, ఇండియా కూటమికి 11 స్థానాలు దక్కాయి. బిహార్, బెంగాల్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, తమిళనాడులో ఈ కూటమి అధిక స్థానాలు గెలుచుకుంది. హిమాచల్‌లో అసెంబ్లీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ముగ్గురిలో ఇద్దరిని కాంగ్రెస్ ఓడించడం, ఉత్తరాఖండ్‌లో రెండు చోట్లా కాంగ్రెస్ విజయం సాధించడం విస్మరించదగిన విషయం కాదు. ఈ ఫలితాలను బట్టి భారతదేశంలో రాజకీయాలు రెండు బలమైన కూటములుగా విడిపోతున్నాయని చెప్పేందుకు ఆస్కారం కలుగుతున్నది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లో జరిగే హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, వచ్చే ఏడాది జరిగే బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల దిశను నిర్దేశించవచ్చు. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏకూ, ఇండియా కూటమికీ మధ్య హోరాహోరీ పోరు జరుగుందనడంలో సందేహం లేదు.


గత రెండు సార్వత్రక ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ సంఖ్యాబలం కొంత పెరగడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశ్లేషిస్తూ కాంగ్రెస్ పరాన్నజీవి కనుకే కొన్ని సీట్లను పెంచుకున్నదని అన్నారు. ‘ఇటీవలే జరిగిన లోక్‌సభ ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిన చోట్ల ఎక్కువ సీట్లు గెలుచుకోలేదు. కాని వేరే పార్టీల భుజాలపై ఎక్కినప్పుడు మాత్రం చెప్పుకోదగిన ఫలితాలు సాధించింది. అంటే కాంగ్రెస్ ఒక పరాన్న జీవిలా తన సహచర పార్టీల ఓట్లను ఆరగిస్తుంది’ అని మోదీ లోక్‌సభలో జూలై 4న ప్రసంగిస్తూ తెలిపారు బీజేపీతో ముఖాముఖి తలపడిన అధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు పరాభవం ఎదురవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ఆయన ఈ సారి కాంగ్రెస్ విముక్త భారత్ అన్న పదాన్ని ఉపయోగించలేదు. అది అంత సులభంగా సాధ్యపడదని ఆయన గ్రహించి ఉంటారు.

నిజానికి ఒక దశలో కాంగ్రెస్ విముక్త భారత్ నిజంగా ఏర్పడుతుందా అన్న అనుమానాలు చాలా మందికి కలిగాయి. 2009లో బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య 171 సీట్లలో ముఖాముఖి పోటీ జరిగితే కాంగ్రెస్ 93 స్థానాల్లోనూ, బీజేపీ 78 స్థానాల్లోనూ విజయం సాధించాయి. 2014లో నరేంద్రమోదీ రంగప్రవేశం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ ఎన్నికల్లో 189 స్థానాల్లో రెండు పార్టీలు ముఖాముఖి తలపడ్డప్పుడు బీజేపీ 166 సీట్లు, కాంగ్రెస్ 23 సీట్లు గెలుచుకున్నాయి. 2019లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ 190 సీట్లలో ముఖాముఖి తలపడితే బీజేపీకి 175, కాంగ్రెస్‌కు 15 దక్కాయి.


కాని 2024 ఎన్నికలు కాంగ్రెస్ పరిస్థితిలో కొంత మార్పు తీసుకువచ్చాయి. ఈ సారి గత మూడు ఎన్నికల్లో కంటే ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ బీజేపీతో ముఖాముఖి తలపడింది. ఈ ఎన్నికల్లో 215 సీట్లలో బీజేపీకి, కాంగ్రెస్‌కు ముఖాముఖి పోటీ జరిగితే బీజేపీ 162 సీట్లు, కాంగ్రెస్ 53 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీతో ముఖాముఖి తలపడిన అత్యధిక సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయి ఉండవచ్చు కాని గెలిచిన వంద సీట్లలో సగానికి పైగా సీట్లు బీజేపీ నుంచి దక్కించుకున్నవే అన్న విషయం గమనించాల్సి ఉంటుంది. మిగతా సీట్లు ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయడం వల్ల సాధించుకున్నవే. అందువల్ల కాంగ్రెస్‌ను పూర్తిగా పరాన్నజీవి అనడానికి వీల్లేదు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా కనీసం 15–20 స్థానాలు మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయడం వల్ల దక్కించుకున్నదనేది సత్యదూరం కాదు. అంతేకాక కొన్ని పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు పరస్పర ప్రయోజనాలు లేకపోతే అవి కూటమిగా పోటీ చేసే అవకాశాలు ఉండవన్న విషయం గమనించాలి. మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్‌లో అక్కడి స్థానిక పార్టీలు కాంగ్రెస్‌ను విస్మరించకపోవడానికి ఇదే కారణం.

కాంగ్రెస్ విముక్త భారత్ సాధ్యపడకపోవచ్చు కాని కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి ఇప్పట్లో అవకాశం లేదని కూడా ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. 2029 నాటికి కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. పదేళ్ల తర్వాత అతి కష్టమ్మీద వంద సీట్లు సాధించిన కాంగ్రెస్ మరింత బలం పుంజుకోవాలంటే బీజేపీతో ముఖాముఖి పోటీ చేసే సీట్లలో కనీసం సగానికి పైగా సాధించాలి. మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. ఉత్తరాదిన గత లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోయిన బీజేపీ దెబ్బతిన్న బెబ్బులిలా పుంజుకునేందుకు తీవ్ర యత్నాలు చేయక తప్పదు. తెలంగాణ, కర్ణాటకల్లో కూడా బీజేపీ పుంజుకునేందుకు సన్నాహాలు చేయక మానదు.


ఈ సార్వత్రక ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో జమిలి ఎన్నికలకు మోదీ రంగం సిద్ధం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదింపచేశారు. ఈ ఫలితాల తర్వాత జమిలి ఎన్నికల గురించి ఇప్పుడు బీజేపీ ఆలోచించే మూడ్‌లో ఉన్నట్లు కనపడడం లేదు. వీటన్నిటికి తోడు 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ ఇంతవరకూ జరగలేదు. 2026 తర్వాత ఈ జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కూడా నిర్వహించాల్సి ఉన్నది. గడచిన ఎన్నికల్లో కుల జనగణన, రిజర్వేషన్లను ప్రతిపక్షాలు ఒక ఎన్నికల అంశంగా మార్చాయి. ఈ అంశాలను విస్మరించి జనాభా లెక్కల సేకరణ, నియోజక వర్గాల పునర్విభజన ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించగలదా అన్న చర్చ కూడా జరుగుతోంది. అందువల్ల 2029 ఎన్నికలు మరింత సంక్లిష్ట సామాజిక పరిస్థితుల్లో జరుగుతాయనడంలో సందేహం లేదు.

భారతదేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు జన్మించి మటుమాయమైపోయాయి, ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన స్వతంత్ర పార్టీ ఇప్పుడెక్కడుంది? బిహార్‌లో శోషిత్ దళ్, జనక్రాంతి దళ్, సోషలిస్టు, కాంగ్రెస్ (ఓ) తదితర పార్టీల నేతలు ముఖ్యమంత్రులైన సందర్భాలు ఉన్నాయి. మండల్ కమిషన్ రచయిత అయిన బిపి మండల్, కర్పూరీ థాకూర్ అలాంటి నాయకులే. ఈ పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. రకరకాల పార్టీలతో కలిసి ఏర్పడిన జనతా పార్టీ రకరకాల వర్గాలుగా, పార్టీలుగా ముక్కలైపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు అధికారాన్ని చలాయించిన బహుజన సమాజ్ పార్టీ కూడా దాదాపు ఉనికి కోల్పోయింది.


తెలంగాణలో ఇటీవలి సార్వత్రక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు అన్న ప్రశ్నకు ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఆ పార్టీ నేతలు హరీశ్ రావు, కేటిఆర్ వద్ద స్పష్టమైన సమాధానం లేదు. ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటు వేయాలని అనుకున్నారు కనుకే తమ ఓటర్లంతా బీజేపీ వైపు మొగ్గు చూపారని ఒకరంటే, ప్రజలు ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య విడిపోయారని మరొకరు జవాబు చెప్పారు. ఒడిషా, తమిళనాడులో కూడా అదే జరిగింది కదా.. అని వారి అభిప్రాయం. కాని ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటో తేలడానికి మరో అయిదేళ్లు పడుతుందని వారికి తెలుసు. రేవంత్ రెడ్డికి మరో అయిదేళ్ల వరకు ఢోకా లేదని వారే చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారమే ప్రజలు రెండు కూటముల మధ్య విడిపోయారు కనుక బీఆర్ఎస్ భవిష్యత్ ప్రస్తుతానికి అగమ్య గోచర పరిస్థితిలో పడిందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తన రంగు, రుచి వాసన కోల్పోయి ప్రజల పార్టీగా ఏర్పడిన ముద్రను తన్ను తానే తొలగించుకున్నదనడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాధిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. పార్టీలను వ్యక్తి ఆధారితంగా మార్చి గుప్పెడు అస్మదీయులతో నడపాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో బీఆర్ఎస్, వైసీపీల అనుభవాలు నిరూపిస్తున్నాయి. ఒడిషాలో వృద్ధనాయకుడైన నవీన్ పట్నాయక్ వచ్చే అయిదేళ్ల వరకు తన పార్టీని ఎంతవరకు బలంగా ఉంచగలుగుతారా అన్న చర్చ జరుగుతోంది. అక్కడ బీజేడీ స్థానంలో బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేయక మానదు. తమిళనాడులో ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుచుకోలేని అన్నాడిఎంకే మళ్లీ బీజేపీ దరిచేరే అవకాశాలూ లేకపోలేదు. అక్కడ ఈ సారి బీజేపీ తన ఓటు శాతాన్ని 3.58 నుంచి 11.24 శాతానికి పెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలో 2029 నాటికి కేవలం రెండు కూటములే రంగంలో ఉంటాయా, ఈ కూటములలో లేని పార్టీలు అదృశ్యమవుతాయా అన్న చర్చ జరుగుతోంది.


భారతదేశ రాజకీయాలు రెండు ధ్రువాల మధ్య సాగడం ఆరోగ్యకరమా లేదా అన్న చర్చ కూడా సాగాల్సిన అవసరం ఉన్నది. కాని ఒకే పార్టీకి అధికారం అప్పజెప్పడం కన్నా ఒక కూటమి అధికారం నిర్వహించడం ఎప్పుడైనా ఆరోగ్యకరమే. ఈ రెండు ధ్రువాలు, లేదా కూటములు ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాల్లో సైద్ధాంతిక స్పష్టత నేర్పర్చుకుని ప్రజల ముందుకు వెళ్లడం ఇంకా అవసరం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jul 17 , 2024 | 05:17 AM