Share News

కుల వాస్తవికతపై ‘సంఘ్‌’ కర్తవ్యబోధ

ABN , Publish Date - Sep 04 , 2024 | 01:01 AM

సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించడంలో తమకు అభ్యంతరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన జాతీయ సదస్సులో ప్రకటించడంతో...

కుల వాస్తవికతపై ‘సంఘ్‌’ కర్తవ్యబోధ
Sangh

సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించడంలో తమకు అభ్యంతరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన జాతీయ సదస్సులో ప్రకటించడంతో ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ దృక్పథాలకు మధ్య వైరుధ్యం ఉన్నదా? లేక బీజేపీకి ఆ సంస్థ కర్తవ్యబోధ చేస్తున్నదా? అన్న ప్రశ్నలకు దారితీస్తోంది. మూడురోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి 32 సంఘ్ అనుబంధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో వీహెచ్‌పీ, బీఎంఎస్ నేతలతో పాటు బీజేపీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా కూడా ఉన్నారు. ఇలాంటి ఆర్ఎస్ఎస్ విస్తృత సమావేశాలు జరిగినప్పుడు కాని మనకు సంఘ్ పరివార్‌లో బీజేపీ స్థానం అర్థం కాదు.


కులజనగణనపై ఆర్ఎస్ఎస్ వైఖరి స్పష్టం కావడంతో భారతీయ జనతా పార్టీ ఏ వైఖరి అవలంబిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. బహుశా గత మూడేళ్లుగా మోదీ ప్రభుత్వం వాయిదా వేస్తున్న జన గణన ఇక ఇప్పటినుంచైనా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ చరిత్రలో జనాభా లెక్కల సేకరణ జరగకుండా నిరవధికంగా వాయిదా వేయడం ఇప్పటి వరకూ ఎన్నడూ జరగలేదు. 2011 తర్వాత ఈ దేశంలో జనాభా ఎంత పెరిగిందీ ఎవరికీ తెలియదు. గత ఏడాదే మనం చైనా జనాభాను అధిగమించామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది కాని అందుకు నిర్దిష్టమైన ఆధారాలు లేవు. దేశంలో జనాభా లెక్కలు తెలిస్తే కాని అందుకు అవసరమైన ఆర్థిక సూచికలను మనం అంచనా వేయలేము. ఇప్పటి వరకూ మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉన్నదో కూడా మనకు తెలియదు. నిరుద్యోగుల సంఖ్య కేవలం 3.1 శాతం ఉన్నదని, రోజురోజుకూ వారి సంఖ్య పడిపోతోందని ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటిస్తే, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం దేశంలో నిరుద్యోగం 9.2 శాతం ఉన్నదని తేలింది. జనాభా లెక్కలను పూర్తిగా సేకరిస్తే గాని నిరుద్యోగ భీకర స్వరూపం మనకు అర్థం కాదు.


అంతేకాదు, జనాభా లెక్కల సేకరణ జరిగితే దేశంలో పేదరికం, ద్రవ్యోల్బణం ప్రభుత్వ కార్యక్రమాలు, నిరక్షరాస్యత, ప్రజల ఆర్థిక అసమానతలు, స్త్రీ, పురుషులు తదితరుల వారీగా జనాభా తీరుతెన్నులు, వలస కార్మికులు, అసమానతలు మొదలైన అనేక అంశాల స్థితిగతులు మనకు తెలుస్తాయి. దేశంలో 81.35 కోట్ల మందికి ఆహార ధాన్యాలను ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా పంపిణీ చేయవలిసిన స్థితిలో ఉన్నట్లు ప్రభుత్వమే గుర్తించింది. జనాభా లెక్కల సేకరణ పూర్తయితే ఇంకా ఎంతమందికి ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలో తేలుతుంది. నిజానికి ఈ దేశంలో మరో పది కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జనాభా లెక్కలు సరిగా లేనందువల్ల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఉపాధి కల్పించాల్సిన వారి సంఖ్యను, కేటాయించాల్సిన నిధుల మొత్తాన్ని కేంద్రం అంచనా వేయలేకపోతోంది. ఉపాధి కల్పన విషయంలోనే కాక, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాప్య పింఛను తదితర పథకాల లబ్ధిదారుల సంఖ్యను కూడా అంచనా వేసి నిధులు కేటాయించేందుకు వీలు కలుగుతుంది. జనాభా లెక్కల సేకరణ పూర్తయితే పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కూడా ఒక నిర్దిష్టమైన స్పష్టత ఏర్పడుతుంది. మతాలవారిగా జనాభా పెరిగిందో లేదో కూడా ఈ లెక్కల ద్వారా తేలి అనేక వ్యాఖ్యానాలకు తెరపడుతుంది.


ఈ క్రమంలో కులాల వారీగా కూడా జనగణన చేస్తే ఏ కులాలు నిర్దిష్టంగా వెనుకబడి ఉన్నాయో తేల్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. బిహార్‌లో నితీశ్‌ కుమార్ ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన కులజనగణన ప్రకారం బిహార్‌లో 34.13 శాతం ప్రజలు నెలకు రూ. 6000 కన్నా తక్కువ మొత్తంపై ఆధారపడి జీవిస్తున్నారని తేలింది. రాష్ట్ర జనాభాలో కేవలం 1.5 శాతం మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని, దాదాపు 95.49 శాతం మందికి ఎలాంటి వాహనాలు లేవని ఈ లెక్కలు తెలిపాయి. బిహార్‌లో దాదాపు 82 శాతం హిందువులేనని, వారిలో దళితుల సంఖ్య అత్యధికమని తేలింది. 36 శాతం పైగా అత్యంత వెనుకబడిన వర్గాలు బిహార్‌లో ఉన్నారని ఈ లెక్కలు తేల్చాయి. దేశవ్యాప్తంగా కులాలవారీగా జనగణన చేస్తే కులాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఎంతమేరకు ఉన్నాయో తేలుతుంది. దీన్నిబట్టి సంక్షేమపథకాలను నిర్దిష్టంగా రూపొందించడం సాధ్యమవుతుంది.


భారతీయ జనతా పార్టీ గత పదేళ్లుగా కులాలవారీగా జనగణనను తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజాన్ని కులాల వారీగా చీల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగాల్లో ఆరోపించారు. కులజనగణనను ఆయన ఏనాడూ సమర్థించలేదు. ప్రజలను మతాల వారీగా మాత్రమే కాని కులాల వారీగా చూడదలుచుకోవడం బీజేపీకి ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీని అగ్రవర్ణాల పార్టీగా చిత్రించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రయత్నించారు. ప్రభుత్వ అధికారుల్లో అగ్రవర్ణాలవారు ఎక్కువ మంది ఉన్నారని ఎత్తిచూపారు. ఆఖరుకు బడ్జెట్ రూపొందించిన అధికారులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఫోటో దిగినప్పుడు అందులో వెనుకబడినవారు లేరని ఎద్దేవా చేశారు. రాహుల్ విమర్శల వల్లే సివిల్ సర్వీస్ నుంచి కాకుండా బయటి నుంచి అనేకమందిని నియమించాలన్న నిర్ణయాన్ని మోదీ సర్కార్ వెనక్కు తీసుకుంది. కులజనగణన గురించి మాట్లాడినందుకు పార్లమెంట్‌లో రాహుల్, ఇతర నేతలపై అనురాగ్ ఠాకూర్ వంటి నేతలు దాడి చేశారు. ‘అసలు నీ కులమేమిటి?’ అని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు నాటి ప్రధాని విపి సింగ్ మండల్ కమిషన్ నివేదికను తెరమీదకు తీసుకువచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు ఆడ్వాణీ రథయాత్ర ప్రారంభించారు. అయితే బీజేపీ ఆ నివేదికను నేరుగా విమర్శించలేదు. ‘వెనుకబడిన వర్గాలవారికి కానీ, షెడ్యూల్డు కులాల జాతులకు కానీ రిజర్వేషన్ కల్పించడానికి నేను ఎన్నడూ వ్యతిరేకం కాదు. నిజాయితీ లేకుండా సంకుచిత భావంతో స్వల్పకాల రాజకీయ ప్రయోజనాలకోసమే విపి సింగ్ మండల్ కమిషన్ నివేదికను ఎవరితో చర్చించకుండా తెరమీదికి తీసుకువచ్చారు’ అని ఆడ్వాణీ తన ఆత్మకథలో రాశారు.


నాడు ఆడ్వాణీ వెలిబుచ్చిన అభిప్రాయాన్నే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా వ్యక్తపరిచిందా లేక మారిన పరిస్థితులను గుర్తించిందా? కొన్ని కులాల ప్రజలు తీవ్రంగా వెనుకబడి ఉన్నారని ఆర్ఎస్ఎస్ గుర్తించడం సాధారణ విషయం కాదు. సామాజిక సంక్షేమ పథకాలపై డేటా సేకరణకు తమకు అభ్యంతరం లేదు కాని జనగణనను రాజకీయ ఉపకరణంగా వాడుకోకూడదని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు ఆ సంస్థ పబ్లిసిటీ ఇన్‌ఛార్జి సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం వెనుకబడిన అణగారిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే కులాలవారీగా లెక్కలు అవసరమని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.


ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఈ స్పష్టీకరణ తర్వాత కులజనగణనపై చర్చ చల్లారేందుకు అవకాశం ఏర్పడింది. ఒక రకంగా ఈ సంస్థ బీజేపీని ఇబ్బందుల్లోంచి బయటపడేసేందుకే ఈ ప్రకటన చేసిందేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. కులాల వారిగా ప్రజలను చూడడం ఆ సంస్థకు అంతరాంతరాల్లో ఇష్టం లేదు. అలా చూస్తే హిందూమతం సమైక్యంగా ఉండదేమో అన్న అనుమానాలు కూడా రావడం సహజమే. కాని ఇవాళ దేశంలో కులజనగణన అంశం తీవ్రంగా తెరమీదకు వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు కులాల వారీగా ప్రజలను సంతృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో అస్తిత్వ ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. దేశంలో కులం ఒక వాస్తవమైనప్పుడు దాన్ని చూడడానికి నిరాకరించడం ఒక అమాయకత్వమే. ఏఏ కులాల వారు ఏమి మాట్లాడుతున్నారో, ఎవరి మాటల వెనుక ఏ కుల తత్వం దాగి ఉన్నదో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. అసలు ప్రతి అంశాన్నీ కులం ప్రాతిపదికగా అంచనా వేసే మనస్తత్వం కూడా ప్రబలంగా కనిపిస్తోంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఎంత మత ప్రాతిపదికగా ప్రజలను సమైక్యపరచాలన్నా దానికి కులం ఒక అవరోధంగా మారింది. మత ప్రాతిపదికగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం సాధ్యం కాదన్న విషయం కూడా అనేక సందర్భాల్లో తేలింది. గత ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశాయి. రామమందిరం నిర్మించిన అయోధ్యలోనే ప్రజలు బీజేపీని ఓడించడం, వారణాసిలో కూడా మోదీకి నూటికి నూరు శాతం హిందువులు ఓట్లు వేయకపోవడం గమనార్హం. రోజురోజుకూ ప్రతిపక్షాలు కులజనగణనను ఒక ప్రధానాంశంగా ప్రజల్లోకి ఉధృతంగా తీసుకుపోవడం, మిత్రపక్షాలు కూడా కులజనగణన కావాలని డిమాండ్ చేయడం బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. దీనితో ఆర్ఎస్ఎస్ కర్తవ్యబోధ చేయాల్సి వచ్చింది.


ఈ నేపథ్యంలో కులం అనే వాస్తవికతను ఆర్ఎస్ఎస్ గుర్తించడం సంఘ్ పరివార్ చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావించాలి. ‘కులం, కుల సంబంధాలు చాలా సున్నితమైనవి. దేశ సమైక్యతకూ, సమగ్రతకూ కులం ఒక ముఖ్యమైన అంశం. ఎన్నికల రాజకీయాలు, పార్టీలకు అతీతంగా దాన్ని తీవ్రంగా పరిగణించాలి’ అని సునీల్ అంబేకర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కులాల వారీగా జనాభా లెక్కలను రాజకీయం చేయకూడదని ఆయన హెచ్చరించారు కాని ఇన్నాళ్లూ మతాన్ని రాజకీయం చేస్తూ మనుగడ సాధించిన వారిని ఏమీ అనలేదేం?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Sep 04 , 2024 | 10:35 AM