Share News

రెండు భారత్‌లు, రెండు మిత్రపక్షాలు

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:12 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బిహార్ పేర్లను పదే పదే ప్రస్తావించినప్పుడు ఎంతో వీనుల విందుగా అనిపించింది. గత పది సంవత్సరాలుగా బడ్జెట్‌లో...

రెండు భారత్‌లు, రెండు మిత్రపక్షాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బిహార్ పేర్లను పదే పదే ప్రస్తావించినప్పుడు ఎంతో వీనుల విందుగా అనిపించింది. గత పది సంవత్సరాలుగా బడ్జెట్‌లో రాష్ట్రాల పేర్లను కేవలం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపించినప్పుడే ప్రస్తావించడం జరిగింది. ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రానికి తన మనసులో సమున్నత స్థానం ఉన్నదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల గురించి ఆర్థికమంత్రి సభలో ప్రకటనలు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా బల్లలు చరిచి హర్షం ప్రకటిస్తున్న దృశ్యం అపురూపం అని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి కేంద్రమే ముందుకు వస్తుందని, విభజన చట్టం ప్రకారం తాము అందుకు కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక ఎంత ఖర్చయినా భరిస్తామని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఇంతకాలం లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఆర్థికమంత్రి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని మరీ రాజధాని నిర్మాణానికి మద్దతునిస్తామని, రాష్ట్రం అందులో కొంత మొత్తం భరించలేకపోయినా, గ్రాంట్గా ఇచ్చే విషయంపై చర్చిస్తామని తెలిపారు.


ఇక బిహార్‌కైతే విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, హైవేలు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, కారిడార్ల నిర్మాణానికి ఆమె భారీ మొత్తాన్ని ప్రకటించారు. నిర్మలా సీతారామన్ ఏపీ, బిహార్‌ల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నప్పుడు సభలో తెలుగుదేశం, బిహార్ ఎంపీలు మాటిమాటికీ ఆనందాతిరేకంతో హర్షధ్వానాలు చేయడం కనిపించింది. నిర్మలా సీతారామన్ బడ్డెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఏపీ, బిహార్ పట్ల ఆమె పక్షపాతం చూపించారని, ఇక ఈ రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ది చెందితే ఇతర రాష్ట్రాలు బిహార్, ఏపీలుగా మారిపోతాయని సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చెలరేగాయి.

దాదాపు పది సంవత్సరాల తర్వాత ఏపీ, బిహార్‌లకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం, ఆ రాష్ట్రాల అవసరాలను గుర్తించడం చెప్పుకోదగిన విషయమే. ఈ కాలంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్, బిహార్ అన్న పదాలు ఢిల్లీలో వినపడేవి కావు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి కొన్ని పార్టీల మద్దతుపై ఆధారపడవలిసివస్తే ఏం జరుగుతుందో మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. ‘ఇది కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, బిహార్‌లకు కేంద్రం మద్దతు ప్రకటించడాన్ని వారెవరూ వ్యతిరేకించలేదు.


పదేళ్ల క్రితం విభజనకు గురై తీవ్ర ఆర్థిక లోటుకు గురైన ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ముఖ్యమైన రాజధాని, పోలవరం నిర్మాణం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అదే విధంగా ఇవాళ కేంద్రం బిహార్‌కు ప్రకటించినన్ని ప్రాజెక్టులు గతంలోనే దశల వారీగా ప్రకటించి అమలు చేసినట్లయితే ఆ రాష్ట్రం రూపురేఖలు మారి ఉండేవని కూడా అందరికీ తెలుసు. ప్రతిపక్షాలు అన్నట్లు ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లకు గురై మోదీ ప్రభుత్వం బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు పెద్ద ఎత్తున చేయూతనివ్వాలని అనుకున్నప్పటికీ అది మంచి పరిణామమే. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ సాధించిన సీట్ల వల్లనే ఇవాళ కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు కాగలిగిందన్నది సర్వ విదితం.

తమ మద్దతు ఆధారంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్పాత నితీశ్ కుమార్, చంద్రబాబునాయుడు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ రాష్ట్రాలకు కావల్సిందేమిటో మోదీకి స్పష్టంగా చెప్పారని అర్థమవుతోంది. వారు కేంద్రంలో కేబినెట్ పదవులు కానీ, ఇతర రాజకీయ ప్రయోజనాలు కానీ ఆశించకుండా తమ రాష్ట్రాల నిర్దిష్ట సమస్యలను పరిష్కరించుకోవడంపైనే దృష్టి సారించారు. ఒక రకంగా కేంద్ర విధానాలపై ఈ ఇద్దరు నేతల ప్రభావం గణనీయంగా ఉందని ఈ బడ్జెట్ ద్వారా అర్థమవుతోంది. గత పది సంవత్సరాల్లో చూడని నరేంద్రమోదీని ఈ బడ్జెట్‌లో తమకు కనిపించారని, తన వైఖరికి భిన్నంగా పట్టువిడుపులు ప్రదర్శించి, నిధుల కేటాయింపు విషయంలో ఉదారంగా వ్యవహరించారని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇది కూడా ఒకరకంగా ఆహ్వానించదగిన విషయమే.


గతంలో సంకీర్ణ ప్రభుత్వాధినేతలు కూడా ఇలాంటి పట్టువిడుపులతో వ్యవహరించేవారు. పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చాను సంతోషపెట్టేందుకు అటానమస్ హిల్ కౌన్సిల్‌ను ప్రకటించారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ తదితరులతో ఎంతో సత్సంబందాలు ఏర్పర్చుకున్నారు. కోల్‌కతాలో మమతా బెనర్జీ నివాసానికి వెళ్లిన వాజపేయి ఆమె తల్లి గాయత్రీ బెనర్జీని చూసి పాదాలకు నమస్కరించిన దృశ్యం చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ‘చంద్రబాబునాయుడు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించండి. ఆయన తన రాష్ట్రం గురించే కాని తన స్వంత సమస్యల్ని ప్రస్తావించరు’ అని వాజపేయి తనకు ఆదేశాలిచ్చారని అప్పుడు పీఎంఓలో ఓఎస్‌డీగా ఉన్న ఎన్‌కే సింగ్ ఒక సందర్భంలో చెప్పారు. సంకీర్ణ ధర్మాన్ని వాజపేయిలాగా ఎవరూ అద్భుతంగా నిర్వహించలేరని ఎన్‌కే సింగ్ చెప్పారు. తనతో విభేదించిన వారితో కూడా వాజపేయి మాట్లాడగలిగేవారని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉద్భవించిన నేత కనుక ఆయన ఏకాభిప్రాయానికి విలువనిచ్చేవారని బీజేపీ నేత అరుణ్ జైట్లీ సైతం ప్రశంసించారు. ఒకప్పుడు పూర్తిగా అంటరాని పార్టీగా ఉన్న బీజేపీ, ఇతర పార్టీల్లో కూడా ఆమోదయోగ్యత సాధించేందుకు వాజపేయి ప్రధాన కారణమని ఆయన మరణానంతరం రచించిన ఒక వ్యాసంలో జైట్లీ తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వమంటూ నిర్వహించిన తర్వాత కొన్ని పట్టువిడుపులు తప్పవని యూపీఏ ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ సైతం అన్నారు.


సంకీర్ణ ధర్మం మూలంగా ఇవాళ ఏపీ, బిహార్‌లకు ఎంతో కొంత ఊరట కలిగించే నిర్ణయాలు కేంద్రం తీసుకుంటోంది కాని ఇవాళ ఒక రాష్ట్రానికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్యాకేజీనివ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతోంది? భారత దేశంలో అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు సమానంగా ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? ఇవాళ మన దేశంలోనే రెండు భారత్ లు ఎందుకు ఉన్నాయి? ప్రముఖ రచయిత ఛార్లెస్ డికెన్స్ తన ‘రెండు మహానగరాలు’ నవలలో అభివర్ణించినట్లు వైభవోజ్వలంగా వెలిగే ప్రాంతాలు, వల్లకాడుగా కనిపించే ప్రాంతాలు ఒకేసారి మనకు ఎందుకు కనిపిస్తున్నాయి? కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ వర్గీకరించిన నాలుగు కులాల్లో పేదలు ఎప్పుడూ ఒక కులంగా ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఆ పేదల్లో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఎందుకు ఉన్నారు? వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇంకా ఎందుకు ప్రకటించాల్సి వస్తోంది? 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల సరఫరా ఎందుకు చేయాల్సి వస్తోంది? వేల కోట్లు ఖర్చు పెట్టి కుమారుడి వివాహం చేసిన అంబానీ ఉన్న దేశంలోనే, పెళ్లికోసం అప్పుల పాలైన అభాగ్యులు, ఇంకా వరకట్న మరణాలకు గురయ్యే యువతులు ఎందుకు కనపడతారు? భారతదేశం ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కావచ్చు కాని మానవాభివృద్ధి సూచికల్లోనూ, ఆరోగ్య సంరక్షణలోనూ, విద్యారంగంలోనూ భారతదేశం ఎంతో వెనుకబడి ఉన్నది. భారతదేశంలో 90 శాతం అట్టడుగున ఉంటే పది శాతం కనివినీ ఎరుగని స్థాయిలో సంపన్నులయ్యారని, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న జాతీయ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ సంస్థ డైరెక్టర్ రతిన్‌రాయ్ ఒక వ్యాసంలో రాశారు. ఇద్దరు సంపన్న భారతీయులు దేశ సంపదలో 1.4 శాతం హస్తగతం చేసుకంటే ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 60 శాతం జనాభా రోజుకు 3.10 డాలర్ల కంటే తక్కువ మొత్తంపై జీవిస్తున్నారనడంలో అవాస్తవం లేదు. చదువుకున్న ప్రతి కుటుంబంలోనూ ఒకరు విదేశాలకు పొట్ట కూటికోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లను మించిన ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు వెచ్చించే సంపన్నులు ఒకవైపు, ఎయిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఓపీడీ కోసం పడిగాపులు కాచే కోట్లాది పేదలు మనకు కనపడతారు.


కేంద్ర బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే చదివిన వారికి భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. భారతదేశంలో మౌలిక సదుపాయాలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని, రేవులు, విమానాశ్రయాలు, రహదారులు, వంతెనల నిర్మాణం వేగంగా జరుగుతోందని, సిమెంట్, స్టీలు, బొగ్గు, ఫార్మస్యుటికల్స్, టెక్స్‌టైల్స్, ఎలెక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఆహారోత్పత్తులు, వినియోగ వస్తువుల రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎకనమిక్ సర్వే తెలిపింది. రక్షణ రంగం ఎగుమతులు రూ. లక్ష కోట్లకు దాటిపోయాయని చెప్పుకుంది. అదే సమయంలో దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ఆర్థిక సర్వేలో ఎలాంటి జవాబు లేదు. నిరుద్యోగాన్ని నివారించడం అధికంగా ప్రైవేట్ రంగ బాధ్యత అని సర్వే చేతులు దులుపుకుంది. ఇవాళ్టికీ శ్రమజీవుల్లో 80 శాతం మంది అసంఘటితరంగంలో చాలీ చాలని జీతాలతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారనడంలో కూడా వాస్తవం లేకపోలేదు. అసమాన అభివృద్ధి, లోటు బడ్జెట్, అప్పులతో సతమతమవుతున్న రాష్ట్రాలు ఉన్నంతకాలం సంకీర్ణ ప్రభుత్వాల్లోనే ప్రజల సమస్యలు ఎంతో కొంత పరిష్కారమవుతాయన్న విషయంలో సందేహం లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jul 24 , 2024 | 05:12 AM