Share News

18వ లోక్‌సభ సవ్యంగా జరిగేనా?

ABN , Publish Date - Jul 10 , 2024 | 03:23 AM

‘ఇప్పటి వరకు జరిగిందంతా ట్రైలర్, ఇక మున్ముందు అసలు పిక్చర్ కనపడుతుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే విషయాన్ని గత వారం ...

18వ లోక్‌సభ సవ్యంగా జరిగేనా?

‘ఇప్పటి వరకు జరిగిందంతా ట్రైలర్, ఇక మున్ముందు అసలు పిక్చర్ కనపడుతుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే విషయాన్ని గత వారం ఆయన రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఇచ్చిన సమాధానంలో మరో రకంగా చెప్పారు. గత పదేళ్ల బీజేపీ పాలన భోజనానికి ముందు సేవించే అపిటైజర్ (సూప్) మాత్రమేనని ఇక ప్రధాన భోజనం వడ్డించడం ప్రారంభమైందని ఆయన అన్నారు. బహుశా ప్రతిపక్షాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. గత పదేళ్లూ బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చినందువల్ల పార్లమెంట్‌లో వారు ఎంత ప్రతిఘటించినా పెద్ద ఫలితం లేకపోయింది. ఇప్పుడు ప్రతిపక్షం బలోపేతం కావడం, బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో వారు తమ నిరసన ధ్వనులు మరింత మిన్నంటించేందుకు తయారవుతున్నారు. అందువల్ల ఎవరు అసలు పిక్చర్ చూపిస్తారో, ఏ భోజనం వడ్డిస్తారో రాబోయే రోజులు తేల్చనున్నాయి.

18వ లోక్‌సభ తొలి 9 రోజుల సమావేశాల్లోనే ప్రభుత్వానికీ ప్రతిపక్షాలకూ మధ్య ఘర్షణాయుత వాతావరణం కనిపించడంతో జూలై 22 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా అధికార పార్టీ, ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా ఆజన్మ శత్రువులుగా వ్యవహరించడం వల్ల ఉద్వేగపూరిత నాటకీయ సన్నివేశాలు కనిపించక తప్పదు. తద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన పార్లమెంట్ ప్రాధాన్యత మరింత తగ్గిపోయే అవకాశాలున్నాయి. నిశితంగా పరిశీలిస్తే ప్రతిపక్షాలు కేవలం నరేంద్రమోదీనే లక్ష్యంగా పెట్టుకుని వాగ్బాణాలు సంధిస్తున్నాయని అర్థమవుతుంది. చర్చల్లో బీజేపీ నేతలు ఎవరు మాట్లాడినా పెద్దగా స్పందించని ప్రతిపక్షాలు కేవలం మోదీ మాట్లాడినప్పుడు గందరగోళం సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష నేతల ప్రసంగాల్లో అధిక భాగం మోదీని విమర్శించేందుకు, ఎద్దేవా చేసేందుకు పరిమితమయ్యాయి.


సాధారణంగా చట్టసభల సమావేశాల్లో అద్భుతమైన ప్రసంగాలు ప్రతిపక్ష శిబిరంనుంచే వస్తాయి. ప్రభుత్వ పక్షం తరఫున మాట్లాడే వారికి తమ పాలన గురించి గణాంక వివరాలు చెప్పడం మినహా చెప్పగలిగింది పెద్దగా ఉండదు. కొద్ది రోజులు జరిగినప్పటికీ ఈ లోక్‌సభ సమావేశాల్లో సహజంగానే రాహుల్‌గాంధీ, మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ, ఎ. రాజా లాంటి నేతలు ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధానమంత్రిపై శక్తిమంతంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అంతే శక్తిమంతంగా మాట్లాడగలిగిన నేత అధికార పక్షంలో మోదీ తప్ప ఎవరూ కనపడకపోవడం విస్మరించదగిన విషయం కాదు. ఒక రకంగా ఈ సమావేశాలను చూస్తుంటే ఎన్నికలు ఇంకా కొనసాగుతున్నాయా అన్న అభిప్రాయం కలుగుతోంది. నిన్నమొన్నటి వరకూ జరిగిన ఎన్నికల ప్రసంగాలు మళ్లీ అదే ధోరణిలో పార్లమెంట్‌లో కూడా వినపడడమే ఇందుకు కారణం.

అయితే ప్రతిపక్ష నేత అయిన తర్వాత రాహుల్ గాంధీ తడుముకోకుండా, సూటిగా, విస్పష్టంగా మాట్లాడడం కాంగ్రెస్ నేతలకు చాలా కాలం తర్వాత హర్షాతిరేకం కలిగించింది. 2008లో రాహుల్‌గాంధీ తన పర్యటనలో కలుసుకున్న ఒక పేద మహిళ కళావతి గురించి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని విస్పష్టంగా చెప్పలేక నవ్వుల పాలయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన పార్లమెంట్‌లోను, బయటా అనేకసార్లు మాట్లాడినప్పుడు వినేవారికీ, ఆయనకూ మధ్య సమాచార అగాధం కనిపించేది. శిక్షపడ్డ ఎంపీలను కాపాడేందుకు 2013లో జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రతిని రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చింపివేసి తమ యూపీఏ ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టారు. 2018లో తన ప్రసంగం తర్వాత రాహుల్ మోదీ వైపు వచ్చి ఆయనను కౌగిలించుకోవడం, ఆ తర్వాత సహచర ఎంపీలకు కన్నుకొట్టడం కూడా చర్చనీయాంశమైంది.


కాని 2008లో రాహుల్ ప్రసంగం విన్న వారికి, దాదాపు 16 ఏళ్ల తర్వాత 2024లో ప్రతిపక్ష నేతగా ఆయన ప్రసంగం విన్న వారికి ఒక చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. అప్పటి, ఇప్పటి రాహుల్‌లో స్పష్టమైన తేడా ఉన్నది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్, అగ్నివీర్, నీట్ ప్రశ్నపత్రాల లీక్‌పై మాట్లాడడంతో పాటు మోదీ వ్యవహార శైలిపై తడుముకోకుండా తీవ్రవిమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడుగా భావిస్తున్న వ్యక్తి ఇన్నాళ్ల వరకూ లోక్‌సభలో పెద్దగా గొంతు విప్పగలిగేవాడు కాదు. ఒకవేళ మాట్లాడినా అందులో ఒక ధార కానీ, ప్రవాహం కానీ కనిపించేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌కే కాక ప్రతిపక్షాలకు ఒక నేత అంటూ లభించాడని చెప్పక తప్పదు. మోదీ సభలో ప్రవేశించినప్పుడు ఎప్పటి మాదిరి మోదీ, మోదీ అన్న నినాదాలు వినిపిస్తే రాహుల్ సభలో ప్రవేశించినప్పుడు మొదటి సారి రాహుల్, రాహుల్ అన్న నినాదాలు ప్రతిపక్ష శిబిరం నుంచి వినిపించాయి. మోదీ తన ప్రసంగంలో రాహుల్‌ను బాలకుడని అభివర్ణించినప్పటికీ రాహుల్ బాలకుడి స్థాయిని వయసు రీత్యానే కాక, పరిణతి రీత్యా దాటిపోయారని ఎవరికైనా అనిపిస్తుంది. గతంలో సభలో అరుదుగా కనిపించే మోదీ ఇప్పుడు రాహుల్ ఉన్నంత సేపూ సభలో కూర్చోవడం విస్మరించదగిన విషయం కాదు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ అంటే రాహుల్ అబద్ధాలు చెబుతున్నారని మోదీ అంటున్నారు. మోదీ ఇప్పుడు ఎన్డీఏ నాయకుడని రాహుల్‌కు, రాహుల్ మొత్తం ఇండియా కూటమి నాయకుడని మోదీకి తెలిసినా ఇరువురూ పరస్పరం ఒకర్నొకరు లక్ష్యంగా పెట్టుకోవడం వెనుక ఒక వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.


పార్లమెంట్‌లో ప్రారంభమైన ఈ వ్యూహాలు ఇప్పుడు బయట కూడా అమలయ్యే అవకాశాలున్నాయి. మణిపూర్, హథ్రాస్, అస్సాం దేశంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా రాహుల్‌గాంధీ అక్కడకు వెళ్లి జనంలో కలిసిపోవడమే కాకుండా మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, మీడియా విభాగం గతంలో కంటే మరింత చురుకుగా కనిపిస్తోంది. ప్రతిపక్షాల సంఘటిత కార్యాచరణ గతంలో కంటే బలంగా మారింది. ఈ రీత్యా బలమైన ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు మోదీ కూడా సంఘటిత కార్యాచరణ ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఎవరు ఎన్ని చెప్పినా దేశంలో ప్రజలు ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య చీలిపోయారన్నది విస్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు పక్షాల్లో లేనివారు కకావికలయ్యే పరిస్థితి ఏర్పడింది తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ వైపుకు తిప్పుకుంటోందని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మంగళవారం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో విలేఖరుల సమావేశం పెట్టి మరీ వాపోయారు. దేశంలో చాలా మంది నేతలకు రాజ్యాంగం వారు కష్టకాలంలో ఉన్నప్పుడే గుర్తుకు వస్తుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే రాజ్యాంగాన్ని తామే కాలరాశామన్న విషయం వారు మరిచిపోతారు.

పరస్పర శత్రుత్వ వాతావరణంలో 18వ లోక్‌సభ ప్రారంభమైన తీరు ఈ దేశంలో నిర్మాణాత్మక రాజకీయాలకు విఘాతం కలిగిస్తుందా అన్న ఆందోళనకు దారితీస్తోంది. ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకదానినొకటి శత్రువులుగా కాకుండా రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించాలి. జాతీయ అంశాలపై ఏకాభిప్రాయ సాధనకోసం ప్రయత్నించాలి, తమ మధ్య సమాచార సంబంధాలు ఏర్పర్చుకోవాలి..’ అని బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ ఆడ్వాణీ తన ఆత్మకథలో రాశారు. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఎన్నికల అనంతరం నాగపూర్‌లో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మన సంప్రదాయం ఏకాభిప్రాయంతో ముడిపడి ఉన్నది..’ అని ఆయన చెప్పారు. ‘అందర్నీ కలుపుకుపోవడం, ఏకాభిప్రాయానికి ప్రయత్నించడం అధికారంలో ఉన్న వారి బాధ్యత’ అన్నారు. సమాజంలో ఉన్న వైమనస్యాలు, మైనారిటీల్లో ఉన్న ఆందోళనలు తొలగించడం అధికారంలో ఉన్నవారే చేయాలని. వివిధ వర్గాల మధ్య పరస్పర గౌరవం ఏర్పడేలా చూడాలని, అహంకారం లేని హుందాతనం అవసరమని ఆయన అన్నారు.


మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ అగ్రనేతలను ఉద్దేశించి చేసి ఉండవచ్చు కాని రాజకీయాల్లో ప్రవర్తనా నియమావళి అన్ని వర్గాలకూ వర్తిస్తుంది. ఎన్నికల ఫలితాలు మోదీకి ఒక సందేశాన్ని అందించాయన్న విషయంలో సందేహం లేదు కాని తమ బలం పెరిగినంత మాత్రాన సభలో గందరగోళం సృష్టించడానికి ప్రతిపక్షాలకు లైసెన్స్ ఇచ్చినట్లు ఎంత మాత్రమూ కాదు. రాహుల్ మాట్లాడినప్పుడు బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నా మోదీ మాట్లాడుతున్నప్పుడు విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడం అసంబద్ధంగా కనిపిస్తోంది.

గత లోక్‌సభ సమావేశాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా అతి తక్కువ రోజులు జరిగాయి. 18వ లోక్‌సభ సమావేశాలు కూడా వ్యర్థం కాకుండా చూసుకోవడం ఇరు పక్షాలకు అవసరం. ఇప్పటికే వ్యవస్థలు పనిచేయడం లేదని చాలా మంది వాపోతున్నారు. చట్టసభల పట్ల కూడా అలాంటి అభిప్రాయం ఏర్పడుతోంది. గత ఎన్నికల్లో కంటే ప్రజల ఓట్ల శాతం ఈ సారి తగ్గిపోయింది. ఓటర్లలో దాదాపు సగం మంది ఎన్నికలను విస్మరించడమో, విముఖంగా ఉండడమో చేశారు. ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి పెరిగేలా చేయాలంటే అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటులో తమ పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తించడం తప్ప వేరే మార్గం లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jul 10 , 2024 | 03:23 AM