Share News

కొత్త పార్లమెంట్ చరిత్ర సృష్టిస్తుందా?

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:25 AM

‘ఓహ్, నీవు నన్ను ఓడించావు కదా!’ అని ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు అసెంబ్లీలో నమస్కరించిన లక్ష్మణ్ బాగ్ అనే ఎమ్మెల్యేకు ప్రతి నమస్కారం చేస్తూ చిరునవ్వు నవ్వారు...

కొత్త పార్లమెంట్ చరిత్ర సృష్టిస్తుందా?

‘ఓహ్, నీవు నన్ను ఓడించావు కదా!’ అని ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు అసెంబ్లీలో నమస్కరించిన లక్ష్మణ్ బాగ్ అనే ఎమ్మెల్యేకు ప్రతి నమస్కారం చేస్తూ చిరునవ్వు నవ్వారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి, ఒక నియోజకవర్గంలో కేవలం 4,700 ఓట్లతో గెలిచిన నవీన్ పట్నాయక్ ఇటీవల అసెంబ్లీలో ప్రవేశించినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవహేళన చేయలేదు. పైగా ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడి పట్నాయక్‌ను గౌరవపూర్వకంగా ఆహ్వానించారు. పార్లమెంటరీ ఉత్తమ సంప్రదాయాల్ని ఈ దృశ్యం అద్భుతంగా ప్రతిఫలించింది.

అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇలాంటి సత్సంబంధాలు నెలకొనాలంటే ఇరు వర్గాలు పరస్పరం పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరించాలి. జాతీయ స్థాయిలో గత కొన్నేళ్లుగా ఉభయ పక్షాలు ఈ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నాయి. 17వ లోక్‌సభలో అనేక అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అది పార్లమెంటరీ ప్రమాణాల క్షీణతను తార స్థాయిలో ప్రతిఫలించింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని అంశాలకు పార్లమెంట్‌లో ప్రతిస్పందించేందుకు ప్రభుత్వం నిరాకరించడం, దాన్ని కారణంగా తీసుకుని అసలు సభలే నిర్వహించకుండా రోజుల తరబడి ప్రతిపక్షాలు స్తంభింపచేయడం... చివరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 మంది ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేయించడం 17వ లోక్‌సభలో పార్లమెంటరీ ప్రమాణాలను ప్రశ్నార్థకం చేసింది. పార్లమెంట్‌లో ఎవరు గౌరవం కోల్పోవడానికి ఎవరు కారణమయ్యారు అనే చర్చను పక్కన పెడితే, ఇరు వర్గాలు పరస్పర గౌరవం కోల్పోయినప్పుడే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న విషయంలో సందేహం లేదు. తత్ఫలితంగా లేబర్ కోడ్ వంటి అనేక ముఖ్యమైన బిల్లులు చర్చలు లేకుండా ఆమోదమయ్యాయి. పార్లమెంట్ చరిత్రలో మొదటిసారిగా 17వ లోక్‌సభ సమావేశాలు అతి తక్కువ రోజులు జరిగాయి. బడ్జెట్ ప్రతిపాదనలపై కూడా కూలంకషంగా చర్చలు జరగలేదు. ప్రజల జీవితాలపై ప్రభావం చూపించే ఆర్థిక నిర్ణయాలు చర్చకు నోచుకోలేదు. స్థాయీ సంఘాలకు నివేదించకుండానే నూటికి 90 శాతం బిల్లులను ఆమోదించారు. దీనితో సమావేశాల పట్ల ప్రజాప్రతినిధులకే ఆసక్తి తగ్గిపోయింది. ప్రెస్ గ్యాలరీ కూడా దాదాపు ఖాళీగా కనిపించేది. శాసన, అధికార, న్యాయవ్యవస్థల్లో అధికార వ్యవస్థ చాలా శక్తిమంతమైనది. మిగతా రెండు వ్యవస్థలు తమ అస్తిత్వాన్ని, ప్రాధాన్యాన్ని నిరూపించుకోకపోతే అధికార వ్యవస్థ ఆధిపత్యాన్ని అంగీకరించినట్లవుతుందన్న విషయంలో సందేహం లేదు. అందువల్ల ఈ మూడు వ్యవస్థలూ సమతుల్యం పాటించి పరస్పర ప్రాధాన్యాన్ని గుర్తించినట్లయితే ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా, జవాబుదారీతనంతో పరిఢవిల్లుతుంది. తద్వారా వ్యవస్థల పట్ల ప్రజల గౌరవం కూడా పెరుగుతుంది.


18వ లోక్‌సభ కాలంలో కూడా గత సమావేశాల నాటి సంక్లిష్ట పరిస్థితులు పునరావృతం అవుతాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. పార్లమెంట్‌లో ఎవరి సంఖ్యాబలం ఎంత మేరకు ఉన్నదో అన్న అంశంతో నిమిత్తం లేకుండా పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడం నేతల వ్యవహార శైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. 1957లో లోక్‌సభలో జనసంఘ్‌కు నలుగురే సభ్యులు ఉండేవారు. అయినప్పటికీ ఆ పార్టీ నేత అటల్ బిహారీ వాజపేయి చివరి వరుసలో నిలబడి విదేశాంగ విధానంపై అనర్గళంగా మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి నెహ్రూ ఆయనను అభినందించారు. ‘మీకు దేశ ప్రధాని అయ్యే లక్షణాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడా పరస్పర గౌరవాలు మృగ్యమయి పోయాయి.

ఆశ్చర్యకరమేమంటే 18వ లోక్‌సభలో వాతా వరణం చూస్తుంటే అధికార కూటమి శిబిరంలో కంటే ప్రతిపక్ష కూటమిలో విజయోత్సాహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి కంటే దాదాపు 60 సీట్లు తగ్గినప్పటికీ బిజెపి మెజారిటీని బాగా తగ్గించామని ప్రతిపక్ష నేతల్లో ఆనందం కనిపిస్తోంది. గత లోక్‌సభలో కంటే అధికంగా సీట్లను దక్కించుకోవడమే ఈ సంతోషానికి కారణం కావచ్చు. ఈ రకంగా పార్లమెంట్‌లో రెండు గెలిచిన పార్టీలు కనిపిస్తున్నాయి.


అధికారంలోకి రాలేకపోయినా గెలిచామనుకోవడమంత అల్పసంతోషం మరొకటి లేదు. ఈ సంతోషంతోనే ప్రతిపక్షాలు మరింత సంఘటితమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సీట్లను తగ్గించిన కాంగ్రెస్ నేత రాహుల్, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ పక్కపక్కనే కూర్చోవడం, మొదటి రోజు నుంచే ఇండియా కూటమి పార్టీలన్నీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడం విస్మరించదగిన పరిణామం కాదు. ప్రమాణ స్వీకారం నాటి నుంచే కలిసికట్టుగా కార్యాచరణ నిర్ణయించుకోవడం, రాజ్యాంగ ప్రతితో ఊరేగింపు నిర్వహించడం, ప్రోటెమ్ స్పీకర్ అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకించడం, డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు కేటాయిస్తేనే స్పీకర్ పదవి విషయంలో అధికార కూటమికి మద్దతు నిస్తామని ప్రకటించడం ప్రతిపక్షాల సంఘటిత వైఖరిని స్పష్టం చేస్తోంది. ప్రశ్నపత్రాల లీక్ వల్ల యుజిసి నెట్ పరీక్షలు రద్దు కావడం, లక్షలాది మంది అభ్యర్థులు రాసే నీట్ పేపర్లు లీక్ కావడం వంటి పరిణామాలన్నీ ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయి. ఈ రీత్యా ప్రతి అంశంపై ఇకనుంచి ప్రతిపక్షాలు విభేదించి అధికార పార్టీని ఆత్మరక్షణలో పడవేసేందుకు ప్రయత్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రీత్యా 18వ లోక్‌సభలో కూడా గత సమావేశాల్లో కంటే తీవ్రంగా సంఘర్షణాయుత వాతావరణం కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వయనాడులో రాహుల్ గాంధీ ఖాళీ చేసిన సీటులో ప్రియాంక కూడా గెలిచి వస్తే లోక్‌సభలో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్ల దాడిని ఎదుర్కొనేందుకు బిజెపి, మిత్రపక్షాలు సిద్ధపడాల్సి ఉంటుంది. గత సమావేశాల్లో బహిష్కృతురాలైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా మళ్లీ గెలిచి సభలో అడుగుపెట్టారు. ఎన్డీఏతో పోలిస్తే ప్రతిపక్ష శిబిరంలోనే అద్భుత వక్తలు ఉన్నారు. వారిని ఎదుర్కొనే వక్తలను ఎన్డీఏ సిద్ధం చేయవలసి ఉంటుంది.

17వ లోక్‌సభతో పోలిస్తే 18వ లోక్‌సభలో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు. బిజెపిలో 45 శాతం కొత్త ఎంపీలైతే, కాంగ్రెస్‌లో 60 శాతం కొత్త ఎంపీలే. తెలుగుదేశం, సమాజ్‌వాది పార్టీ, ఎన్‌సిపిల్లో కూడా మూడింట నాలుగోవంతు కొత్తవారే. దాదాపు 50 శాతం లోక్‌సభ ప్రక్షాళనం అయినట్లు కనిపిస్తోంది. సభలో తమ ప్రత్యేకత నిలబెట్టుకోవాలని కొత్త ఎంపీలు ఆశిస్తున్నారు. అతి సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన కలిశెట్టి అప్పల్నాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వచ్చి తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కూతురు బాన్సురీ స్వరాజ్ నుంచి యూపీ దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్ వరకూ ఒక రకమైన వైవిధ్యం ఈసారి లోక్‌సభలో కనిపిస్తోంది.


అయితే ఎంత వైవిధ్యం, ఎంత యువరక్తం ఉన్నా పార్లమెంట్‌లో సరైన చర్చలు జరగనంతవరకూ వాటి ప్రాధాన్యత ఏమీ ఉండదు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్ నుంచి కీలక బిల్లులు, స్వల్పవ్యవధి చర్చల వరకు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోకుండా తమ అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పే ఎంపీల కోసం దేశం ఎదురు చూస్తోంది. దేశం ఎదుర్కొనే సమస్యలను చర్చించాలంటే ఎంపీలు ముందుగా వాటిని లోతుగా అధ్యయనం చేయాలి. ఒక దృక్కోణం, దృక్పథం లేకుండా ఏ అంశంపై నైనా అలవోకగా ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే సభను ఆకట్టుకునే విధంగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడేవారు తక్కువ. 17వ లోక్‌సభలో అత్యధిక తెలుగు ఎంపీలు తమ ఉనికిని నిరూపించుకోలేకపోయారన్నది వాస్తవం.

18వ లోక్‌సభలో నిరక్షరాస్యులు ఎవరూ లేరు. అత్యధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వృత్తిపరమైన డిగ్రీలు సాధించిన వారు, డాక్టరేట్లు, న్యాయవాదులు, సినీ కళారంగానికి చెందినవారు దాదాపు వంద మందికి పైగా ఉన్నారు. వందమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. వీరందరి ప్రతిభను సరిగా ఉపయోగించుకోవాలంటే సభలో వారికి మాట్లాడే అవకాశం కల్పించాలి. మంత్రిత్వ శాఖలకు చెందిన స్థాయీ సంఘాల్లో వారిని చేర్చి మొక్కుబడిగా కాకుండా చైతన్యవంతంగా ప్రతి బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేలా చూడాలి. న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలో తీర్పు చెప్పగలిగేది సుప్రీంకోర్టు అయితే శాసన వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో చర్చలు జరిపి ప్రజల భవిష్యత్తును నిర్ణయించగలిగే వేదిక పార్లమెంట్ మాత్రమే.


దురదృష్టకరమైన విషయం ఏమంటే పార్లమెంట్‌లో దేశ ప్రయోజనకరమైన అంశాలపై కంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. 18వ లోక్‌సభలో రాజకీయాలను పక్కన పెట్టి దేశం ఎదుర్కొనే సమస్యలపై చర్చ జరిగేలా చూడాలి. మంచికో, చెడుకో ఇవాళ దేశ ప్రజలు రెండు కూటముల వైపే మొగ్గు చూపారు. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమిలో భాగం కాని పార్టీలను ప్రజలు దాదాపు తిరస్కరించారు. బిఆర్ఎస్, వైసీపీ, బిజెడి తదితర పార్టీలకు చెందినవారు కేవలం 18 మంది మాత్రమే ఉండగా మిగతా 525 మంది ఏదో ఒక కూటమికి చెందినవారే. ఎవరు ఒప్పుకోకపోయినా భారతదేశం రెండు రాజకీయ శిబిరాల మధ్య విభజితమైంది. ఈ విభజన కేవలం రాజకీయాలకే పరిమితం కాదని, అభివృద్ధి నుంచి ప్రజాసమస్యల వరకూ అవలంబించాల్సిన సైద్ధాంతిక దృక్పథానికి కూడా సంబంధించిందని భావించవలసి ఉంటుంది. ప్రస్తుత పార్లమెంట్‌లో రెండు వేర్వేరు సైద్ధాంతిక శిబిరాల అభిప్రాయాల బలమైన వ్యక్తీకరణకే కాని వ్యక్తుల ప్రాధాన్యతకు అంత తావు ఉండకూడదన్న స్పృహ ఇరు వర్గాలకు ఉండాలి. అప్పుడే పార్లమెంట్‌లో చర్చలు రసవత్తరంగా, అర్థవంతంగా మారుతాయి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jun 26 , 2024 | 05:25 AM