Share News

జయ్‌షా జయకేతనం

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:55 AM

రాజకీయవేత్తల ప్రమేయం లేని జీవన రంగం ఏదైనా ఉన్నదా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా భారతదేశంలో క్రీడారంగం క్రమేణా రాజకీయమయమవుతోంది. చదరంగం మొదలు క్రికెట్ వరకు ప్రతి క్రీడా సంఘంలో రాజకీయ పార్టీల నాయకులు లేదా వారి...

జయ్‌షా జయకేతనం

రాజకీయవేత్తల ప్రమేయం లేని జీవన రంగం ఏదైనా ఉన్నదా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా భారతదేశంలో క్రీడారంగం క్రమేణా రాజకీయమయమవుతోంది. చదరంగం మొదలు క్రికెట్ వరకు ప్రతి క్రీడా సంఘంలో రాజకీయ పార్టీల నాయకులు లేదా వారి అస్మదీయులు చొరబడుతుండగా అసలైన క్రీడాకారులు ప్రేక్షకపాత్రకు పరిమితమవుతున్నారు.

భారతవనిలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దండీగా నిధులు, ఎనలేని కీర్తిప్రతిష్ఠలు సమకూర్చే క్రికెట్ జగత్తును నియంత్రించే క్రికెట్ సంఘాలలో పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా రాజకీయ నాయకులు దొడ్డిదారిన చొరబడుతున్నారు. అందులో వారిలో అతికొందరు మాత్రమే రాణిస్తున్నారు.


భారత క్రికెట్ రంగాన్ని ప్రభావితం చేసే దిశగా, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా వారసుడుగా, ఆటల రాజకీయంలో అరంగ్రేటం చేసిన జయ్‌షా నిస్సందేహాంగా అజేయుడు. అవును మరి ఆయన అమిత్‌ షా తనయుడు. రాజకీయ ఉద్దండులు శరద్ పవార్, ఫారూఖ్ అబ్దుల్లా, లాలూప్రసాద్ యాదవ్, నరేంద్ర మోదీ ఒక దశలో క్రికెట్ సంఘాలను ఏలారు. మోదీ అనంతరం గుజరాత్ క్రికెట్ సంఘం వ్యవహారాలలోకి అమిత్ షా ప్రవేశించారు. ఆయన స్వయంగా క్రికెటర్‌. గొప్ప ఆటగాడు కాకపోవచ్చు గానీ ఆ ఆటలో మంచి అభినివేశం ఉన్నవాడు. ఇటువంటి వ్యక్తి ఒక రాష్ట్రస్థాయి క్రికెట్ సంఘంలో ప్రాబల్యం పొందడం ఏ మాత్రం తప్పు కాదు. కుటుంబ బరువు బాధ్యతలు లేని నరేంద్ర మోదీ మినహా ముగ్గురు రాజకీయ నేతలు –పవార్‌, అబ్దుల్లా, యాదవ్‌– తమ రాజకీయ వారసత్వాన్ని స్వీయ సంతానానికి అప్పగించారు. అమిత్‌ షా మాత్రం రాజకీయంగా ఉన్నతి సాధిస్తూ తాను ఏలిన గుజరాత్‌ క్రికెట్ సంఘాన్ని స్వీయ, ఏకైక పుత్రరత్నం జయ్‌షాకు అప్పగించారు.


అహ్మదాబాద్ జిల్లా స్ధాయి క్రికెట్ సంఘం నుంచి మొదలైన జయ్‌షా ప్రస్థానం అనతి కాలంలో దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ మండలి వరకు నిర్విరామంగా జయకేతనం ఎగురవేస్తూ కొనసాగుతోంది. పదిహేను సంవత్సరాల వ్యవధిలో క్రికెట్ పాలనా రంగంలో అత్యున్నత శిఖరానికి చేరుకోవడం సాధారణ విషయమా? కాదు కదా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం జయ్‌షా కూడ గుజరాత్ నుంచి ఏకంగా జాతీయ స్ధాయి క్రికెట్ రంగాన్ని నియంత్రించే బీసీసీఐకు చేరుకోవడం యాదృచ్ఛికం కానేకాదు. బీసీసీఐలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత జయ్‌షాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకించి మహిళా క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఆయన చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. అదే విధంగా, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా చేర్చే దిశగా జయ్‌షా చేస్తోన్న కృషికి సైతం అంతర్జాతీయంగా అభినందనలు దక్కుతున్నాయి.

ఈ సందర్భంగా జయ్‌షా పెద్దరికం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసివుంది. 2022లో దుబాయిలో జరిగిన ఆసియా కప్ పోటీలలో భారత్‌, పాకిస్తాన్ జట్లు పోటీపడ్డాయి. దుబాయిలోని క్రికెట్‌ అభిమాని ఒకరు భారతీయ త్రివర్ణ పతాకాన్ని జయ్‌షాకు అందించగా దాన్ని స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై దుమారం చెలరేగింది. అయితే అసియా ఖండంలో క్రికెట్‌ ఆటకు పెద్ద దిక్కుగా ఉన్న జయ్‌షా ఏ దేశం వైపూ మొగ్గు చూపకుండా విజ్ఞతతో వ్యవహరించారు. సంకుచిత అభిమానాలకు పోకుండా నిష్పాక్షికంగా ప్రవర్తించడం ఆయన గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసింది.


పారిశ్రామికవేత్త జగ్‌మోహన్ దాల్మియా, తలపండిన రాజకీయయోధుడు శరద్ పవార్ గతంలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (అంతర్జాతీయ క్రికెట్ మండలి– ఐసీసీ)ను ఏలారు. పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవపర్యాయం పదవీ ప్రమాణం చేసిన సమయంలో జన్మించిన జయ్‌షా పిన్న వయస్సులో ఐసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. ఐసిసి పాలకమండలిలో కీలక సభ్య దేశమైన పాకిస్థాన్ లాంఛనంగా భారత అభ్యర్ధిత్వాన్ని సమర్ధించలేదు కానీ లోపాయికారీగా తన అంగీకారాన్ని తెలిపింది.

సుమారు 20 వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న బీసీసీఐలో జయ్‌షాది తిరుగులేని ఏకచక్రాధిపత్యం. దీంతో పోల్చితే 16 సభ్య దేశాల పాలకవర్గం కలిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో పేరు ప్రతిష్ఠలు మినహా ఇతర క్రియాశీలక కార్యకలాపాలు అంతగా ఉండవు. దౌత్య నియమాలు, దేశాల మధ్య ద్వైపాక్షిక రాజకీయ సంబంధాలు, ఉద్రిక్తతల మధ్య ఐసీసీ నడుచుకోవల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడను ప్రొత్సహిస్తూ పోటీలను నిర్వహించడం, సభ్య దేశాల మధ్య సమన్వయం చేయడం ఐసీసీ విధి.


ప్రపంచానికి క్రికెట్‌ను పరిచయం చేసిన ఇంగ్లాండ్‌లో ఉన్న ఐసీసీ కార్యాలయం పన్నుల మోత కారణాన ఆ దేశం నుంచి నిష్క్రమించింది. స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయిలు ఆ కార్యాలయాన్ని తరలించుకు వెళ్లేందుకు ప్రయత్నించాయి. అయితే భారత్‌, పాకిస్తాన్‌లు అభ్యంతరం తెలిపాయి. భారత ఉపఖండ సామీప్యత, పన్నుల బెడద లేకపోవడం వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి 2005లో దుబాయికి తరలింది. అప్పట్లో తన రాజకీయ, అధికారిక కార్యక్రమాలలో తలమునకలుగా ఉన్న శరద్ పవార్ తాను తీరికగా వచ్చి వెళ్ళడానికి దుబాయి వైపు మొగ్గారని చెబుతారు. బంగారు బాతు అయిన బీసీసీఐ కార్యవర్గం కొనసాగింపు వ్యవధిపై ఆంక్షలు ఉన్నందువల్ల జయ్‌షా కొంతకాలం దుబాయిలోని ఐసీసీలో సేద తీరుతారని క్రికెట్‌ ప్రపంచం భావిస్తోంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Sep 04 , 2024 | 12:55 AM