Share News

RK Kothapaluku ; కారు.. కమలం ‘కలిసి’ పోతాయా?

ABN , Publish Date - Aug 18 , 2024 | 02:30 AM

‘త్వరలోనే భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్‌ పదవి ఇస్తారు. కవితకు బెయిల్‌ కూడా వస్తుంది’... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు...

RK Kothapaluku ; కారు.. కమలం ‘కలిసి’ పోతాయా?
RK

‘త్వరలోనే భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్‌ పదవి ఇస్తారు. కవితకు బెయిల్‌ కూడా వస్తుంది’... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ‘‘అదేమీ కాదు! కాంగ్రెస్‌ పార్టీలోనే బీఆర్‌ఎస్‌ విలీనమవుతుంది. కేసీఆర్‌కు ఏఐసీసీ పదవి, కేటీఆర్‌కు పీసీసీ అధ్యక్ష పదవి, హరీశ్‌కు రాష్ట్రంలో మంత్రి పదవి లభిస్తాయి’... ఇవి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి నిజంగానే రెండు జాతీయ పార్టీలలో ఏదో ఒక దానిలో విలీనంకాక తప్పదా? తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండిన బీఆర్‌ఎస్‌కు అలాంటి పరిస్థితి ఏర్పడిందా? తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరగబోతోంది? ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? విలీనం వార్తలను బీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఎందుకు గట్టిగా ఖండించలేకపోతున్నారు? కేసీఆర్‌ మనసులో ఏముంది? వంటి ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని, కేంద్రంలో బీజేపీని గద్దె దించుతానని కొంతకాలం క్రితం వరకు ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్‌ ఇంత బలహీనంగా ఎందుకు మారిపోయారు? కేసీఆర్‌ బలహీనతను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్‌ను మింగేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలలో వాస్తవం ఉందా? విలీనం వార్తలలో ఎంత నిజముంది? నిజమే అయితే తెర వెనుక ఏమి జరిగింది? అన్నది ఇప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం! ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న కేసీఆర్‌ కుమార్తె కవిత ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నారు. తన బిడ్డ నెలల తరబడి జైలులో ఉండాల్సి రావడాన్ని కేసీఆర్‌ భరించలేక పోతున్నారు. గుండెల్లో అగ్నిపర్వతం పెట్టుకొని బయటకు గంభీరంగా ఉంటున్నానని ఆ మధ్య కేసీఆర్‌ వ్యాఖ్యానించారు కూడా! ఈ నేపథ్యంలో తన బిడ్డ కవితను బెయిల్‌పై విడిపించుకునేందుకు కేసీఆర్‌ చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఆయన బీజేపీ సహాయాన్ని అర్థించడం వాస్తవం. కేటీఆర్‌, హరీశ్‌ రావులు రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి మంత్రాంగం కూడా నడిపారు. రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నట్టుగా వారిరువురూ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలను కలవలేదు. మరెవరిని కలిసుంటారు? బీజేపీతో రాజీ కుదర్చడానికి చొరవ తీసుకున్న ప్రముఖుడు ఎవరు? ఆయనకు ప్రధాని మోదీ వద్ద నిజంగా అంత పలుకుబడి ఉందా? వంటి సందేహాలు సహజంగానే కలుగుతాయి.


ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రస్తుతం ఒక రాష్ర్టానికి గవర్నర్‌గా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం–బీజేపీ మధ్య పొత్తు కుదరడంలో కూడా ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. సదరు గవర్నర్‌పై ప్రధాని మోదీకి గురి ఉంది. అదే సమయంలో ఆరెస్సెస్‌ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆరెస్సెస్‌ ప్రోద్బలంతో ఆ గవర్నర్‌ తెలుగుదేశం పార్టీతో మాట కలిపారు. చంద్రబాబు పొడగిట్టని ప్రధాని మోదీకి అదే సమయంలో నచ్చజెప్పారు. ఫలితంగా సదరు గవర్నర్‌కు, చంద్రబాబుకు మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలలో స్థూలంగా ఏకాభిప్రాయం కుదరడంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

ఇదీ జరిగింది...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లాభించినందున తెలంగాణలో కూడా మంత్రాంగం నడపవలసిందిగా సదరు గవర్నర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించినట్టు తెలిసింది. అప్పటికే ఆరెస్సెస్‌ సీనియర్‌ నాయకులు కూడా ఆయనకు ఆ బాధ్యత అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన గవర్నర్‌ భారత రాష్ట్ర సమితి ముఖ్యులకు సంకేతాలు పంపారు. అప్పటికే మద్యం కేసులో అరెస్టయి కవిత జైలులో ఉన్నారు. దీంతో మానసికంగా కుంగిపోయిన కేసీఆర్‌ తన పార్టీ తరఫున మంతనాలు జరపడానికి కేటీఆర్‌, హరీశ్‌ రావును పురమాయించారు. మొదటి దఫా చర్చలలో పెద్దగా పురోగతి లేకపోయినా... రెండో పర్యాయం జరిపిన చర్చలలో మాత్రం ఎవరికి ఏమి కావాలన్న దానిపై స్పష్టత ఏర్పడింది. భారత రాష్ట్ర సమితికి ఏమి కావాలో తెలిసిందే కనుక తమకు ఏమి కావాలో రెండో దఫా చర్చల సందర్భంగా సదరు గవర్నర్‌తో పాటు ఆరెస్సెస్‌ నాయకులు స్పష్టం చేశారు. జైలులో ఉన్న కవిత విషయంలో సహాయ సహకారాలు లభించాలంటే భారత రాష్ట్ర సమితిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయాలని లేదా పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించాలని, ప్రతిగా కేసీఆర్‌కు గవర్నర్‌ పదవి ఇస్తారని, హరీశ్‌ రావుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆ గవర్నర్‌తో పాటు ఆరెస్సెస్‌ ప్రతినిధులు ప్రతిపాదించారు.


ఆ తర్వాత దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరీశ్‌ రావును నియమిస్తామని కూడా ప్రతిపాదించినట్టు తెలిసింది. కేటీఆర్‌ భవిష్యత్‌ విషయమై ఎటువంటి చర్చా జరగలేదని అంటున్నారు. కేసీఆర్‌ కుటుంబం రాజకీయాల నుంచి నిష్క్రమించాలన్నది బీజేపీ పెద్దల అభిమతంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే చర్చలు ఏకపక్షంగా ఉండటం, తమకు షరతులు విధించడాన్ని బీఆర్‌ఎస్‌ ముఖ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని విలీనం చేయాలని కోరవద్దని, పొత్తు పెట్టుకొని ముందుకు వెళదామని బీఆర్‌ఎస్‌ ముఖ్యులు ప్రతిపాదించారు. ఈ దశలో చర్చలు అప్పటికి ముగిశాయి. ఢిల్లీ చర్చల వివరాలను కేటీఆర్‌, హరీశ్‌రావు తమ నాయకుడు కేసీఆర్‌కు వివరించారు. భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని విలీనం చేయడం ఆత్మహత్యాసదృశం అవుతుందని భావిస్తున్న కేసీఆర్‌ అండ్‌ కో అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు.

అస్తిత్వం కోల్పోయేందుకు సిద్ధమా?

కవిత బెయిల్‌ పిటిషన్‌ ఈ నెల 28న సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు కవితకు బెయిల్‌ లభించవచ్చునని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆశగా ఉన్నారు. అదే జరిగితే బీజేపీతో తదుపరి చర్చలు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. లిక్కర్‌ కేసులో కవితకు ఉపశమనం లభించాలంటే ఆమె అప్రూవర్‌గా మారాలన్న షరతు కూడా బీజేపీ ప్రముఖులు విధించినట్టు తెలిసింది. ఈ నెల 28న కవితకు బెయిల్‌ లభిస్తే బీజేపీకి లొంగిపోవాల్సిన అవసరం కేసీఆర్‌కు ఉండదు. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున కేసీఆర్‌ లేదా కేటీఆర్‌కు ముప్పు లేకపోలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ ముఖ్యులు ప్రస్తుతానికి గుంభనంగా ఉంటున్నారు. తెలంగాణలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు కూడా ఇటీవలే జరిగినందున బీఆర్‌ఎస్‌తో ఇప్పుడే పొత్తు పెట్టుకొని ప్రయోజనం ఏమిటన్నది బీజేపీ ముఖ్యుల అభిప్రాయంగా ఉంది. యూటర్న్‌ తీసుకోవడంలో కేసీఆర్‌కు ట్రాక్‌ రికార్డు ఉన్నందున ఆయనను నమ్మి ఇప్పుడే పొత్తు ప్రకటించి ప్రయోజనం ఉండదని కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కాంగ్రెస్‌ పెద్దల్ని నమ్మించి కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకోవడాన్ని బీజేపీ ముఖ్యులు గుర్తు చేస్తున్నారు. ఈ కారణంగా విలీనం ప్రతిపాదననే ముందుకు తీసుకు వెళ్లాలని వారు భావిస్తున్నారు. అయితే, కేవలం కవితకు ఉపశమనం లభించేందుకు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసి అస్తిత్వం కోల్పోవడానికి కేసీఆర్‌ అండ్‌ కో సుముఖంగా లేరు. అలాగని భారతీయ జనతా పార్టీతో సంబంధాలను చెడగొట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా లేరు. ఈ కారణంగానే విలీనం వార్తలపై కేసీఆర్‌ అండ్‌ కో ఘాటుగా స్పందించడం లేదు.


కర్మఫలం...

కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరని అంటారు. కేసీఆర్‌ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని జైలుకు పంపి ముప్పుతిప్పలు పెట్టారు. ఒక్కగానొక్క కుమార్తె వివాహ వేడుకలను కూడా దగ్గరుండి జరిపించుకోలేని పరిస్థితి రేవంత్‌ రెడ్డికి కల్పించారు. ఇప్పుడు కేసీఆర్‌ ప్రతిపక్షంలో కూర్చోవలసిరాగా, రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. లిక్కర్‌ కేసులో చిక్కుకున్న కవిత జైలు పాలయ్యారు. దీంతో కేసీఆర్‌ జుట్టు బీజేపీ చేతికి చిక్కింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరెస్సెస్‌ ముఖ్యుడు బీఎల్‌ సంతోష్‌ను కూడా అరెస్టు చేయాలని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ప్రయత్నించారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కర్మ మనల్ని వదలదని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ప్రగల్భాలకు పోవడం రాజకీయ నాయకులకు అలవాటే. మామీద కేసులు పెట్టి జైలుకు పంపుతారా? దమ్ముంటే ఆ పని చెయ్యండి! అని సవాళ్లు విసురుతారు. నిజంగా అదే జరిగితే మాత్రం తట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్‌ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపారు. ఆ పరిణామం చంద్రబాబును బాగా కుంగదీసింది. అయితే ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు రావడంతో చంద్రబాబు వెంటనే కోలుకున్నారు. తెలంగాణను కనుసైగలతో పాలించిన కేసీఆర్‌ ఇప్పుడు తన బిడ్డ జైలులో ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ పరిణామం తనను మానసికంగా కుంగదీస్తోందని ఆయనే చెప్పుకొంటున్నారు. ఈ కారణంగానే తెలంగాణ రాజకీయాలను శాసించాలనుకున్న కేసీఆర్‌ బీజేపీతో రాజీకి తలవొంచాల్సిన పరిస్థితి. కవిత జైలులో ఉండివుండకపోతే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించాల్సిన అవసరం కేసీఆర్‌కు ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగీన కేసీఆర్‌లో ఇంత బేలతనం చూస్తామని అనుకున్నామా? అధికారం అనుభవించడానికి అలవాటుపడిన నాయకులలో పోరాట పటిమ పోతున్నందునే ఈ దుస్థితి! కవితకు ఇవాళ కాకపోతే రేపు బెయిలు లభిస్తుంది. అయితే బిడ్డపై ఉన్న మమకారంతో ఆయన రాజీ బేరాలకు దిగజారారు. తెర వెనుక ఏం జరిగిందో ఇప్పుడు తెలిసి పోయింది కనుక విలీనం లేదా పొత్తు ప్రతిపాదనలు ముందుకు వెళతాయా? లేదా? అన్నవి ప్రస్తుత ప్రశ్నలు. బీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవడం వరకు బీజేపీ రాష్ట్ర నాయకులకు అభ్యంతరాలు లేవు. పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే, రాష్ట్ర నాయకులకు కేంద్రంలో పెద్దగా పలుకుబడి లేదు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను ప్రభావితం చేయగలిగిన శక్తి తెలుగునాట బీజేపీ నాయకులు ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర నాయకులు ఎంత మంది వాదించినా పట్టించుకోని బీజేపీ కేంద్ర పెద్దలు.... చివరికి సొంత సమాచారం ఆధారంగానే పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారు. అప్పట్లో పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన సదరు గవర్నర్‌ వల్లనే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఆరు లోక్‌సభ స్థానాలు కేటాయించారు. అందులో మూడు స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. తెలంగాణ విషయంలో కూడా బీజేపీ కేంద్ర పెద్దలు ఏమనుకుంటారో అదే జరుగుతుంది. ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ వంటి వారి మాటలను పెద్దగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ భవిష్యత్తు ఏమిటి? ప్రచారంలో ఉన్నట్టుగా విలీన ప్రక్రియ పూర్తవుతుందా? పరిస్థితులు అనుకూలంగా మారే వరకు కొంత తలొగ్గుతూ ఉన్నప్పటికీ ఆ తర్వాత కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకుంటారా? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాలంటే వేచివుండక తప్పదు. తెర వెనుక ఏమి జరుగుతున్నదో తెలుసు కనుకే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీలో తాజా వ్యాఖ్యలు చేశారు.


అందులో కొన్ని అతిశయోక్తులు ఉన్నప్పటికీ విలీనం లేదా పొత్తుకు సంబంధించిన చర్చలు జరిగాయి కనుక చివరకు ఏం జరుగుతుందో స్పష్టం కావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే కవితకు బెయిల్‌ లభించినా భారతీయ జనతా పార్టీపై ఇదివరకటిలా కత్తులు దూసే పరిస్థితిలో కేసీఆర్‌ అండ్‌ కో ఉండలేరు. కేసీఆర్‌ కుటుంబం రాజకీయాల్లో ఉండకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలపై ప్రధాని మోదీకి వ్యతిరేక భావం ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ సేఫ్‌ జోన్‌లో ఉంది. కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలో ఉండగా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌ పరిస్థితి చెంపదెబ్బ, గోడదెబ్బ చందంగా ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వేటాడుతున్నారు. కేసీఆర్‌ అండ్‌ కో తమ జుట్టును బీజేపీ చేతికి అందించారు. ఈ రెండు పార్టీలనూ ఎదుర్కొంటూ బీఆర్‌ఎస్‌ను బతికించుకోగల స్థితిలో కేసీఆర్‌ ఉన్నారా? తనలో పోరాట పటిమ సన్నగిల్లిందని గుర్తించి, అంగీకరించి తన పార్టీని బీజేపీకి అప్పగించి విశ్రాంతి తీసుకుంటారా? అదే జరిగితే కేటీఆర్‌, హరీశ్‌ రావుల భవితవ్యం ఏమిటి? వారిద్దరే కాదు, పార్టీని నమ్ముకొని అనేక మంది నాయకులు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి? మున్ముందు కేసీఆర్‌ వేయబోయే అడుగులను బట్టి ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది.

గురివింద చందం..

తెలంగాణ రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల విషయానికి వద్దాం. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హద్దులు మీరి ప్రవర్తించిన పదహారు మంది ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్‌లో ఉంచడంతో పాటు ప్రతిరోజూ డీజీపీ ఆఫీస్‌కు వచ్చి రిపోర్ట్‌ చేసి సాయంత్రం వరకు కూర్చోవాలని ఆదేశించింది. దీనిపై జగన్‌ రెడ్డి రోత మీడియా గురివింద సామెతను తలపిస్తూ గుండెలు బాదుకుంటోంది. గతంలో జగన్‌ రెడ్డి ఎంత మంది అఖిల భారత సర్వీసు అధికారులను వేధించారో మరచిపోయారు. ఇప్పుడు వెయిటింగ్‌లో ఉన్న అధికారులను అప్పట్లో కిరాయి సైనికులుగా మార్చుకొని చేయించిన అరాచకాలను మరచిపోయారు. పీఎస్సార్‌ ఆంజనేయులు ద్వారా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును ఆత్మహత్య చేసుకొనే వరకు వేధించలేదా? సొంత ఎంపీ రఘురామ కృష్ణరాజును అరెస్టు చేయించి అరికాళ్లు పగిలేలా కొట్టడంలో పీవీ సునీల్‌ కుమార్‌ పాత్ర లేదా? ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ, హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశాలు పెట్టి నిబంధనలు ఉల్లంఘించిన సంజయ్‌కు ఏమి శిక్ష విధించాలి? రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కొల్లి రఘురామి రెడ్డి, రిషాంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడానికి కూడా ప్రయత్నించకపోవడం సమర్థనీయమా?


అఖిల భారత సర్వీసు అధికారులకు రాజకీయ అనుబంధాలు అవసరమా? అంతెందుకూ, స్కిల్‌ కేసులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చిన సీఐడీ అధికారులకు విచారణ సాఫీగా జరగడానికి సహకరించిన నాపై విధులకు ఆటంకం కలిగించానని కేసు పెట్టించింది కొల్లి రఘురామిరెడ్డి కాదా? ఆరోజు లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చిన విచారణ అధికారులకు రఘురామిరెడ్డి ఎన్ని పర్యాయాలు ఫోన్‌ చేశారో కాల్‌ డేటా చూస్తే తెలుస్తుంది కదా? ఇలాంటి అధికారులకు జగన్‌ రోత మీడియాతో పాటు తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వత్తాసు పలకడం వింతగా ఉంది. సదరు అధికారులు జగన్‌ హయాంలో అరాచకంగా ప్రవర్తించినప్పుడు ఇదే ప్రవీణ్‌ కుమార్‌కు తప్పు అని చెప్పడానికి నోరు రాలేదు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఇదే ప్రవీణ్‌ కుమార్‌ అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేశారన్న విషయం మరచిపోకూడదు. బీఎస్పీ ఎన్నికల చిహ్నం ఏనుగును ఎక్కి దొరల గడీలను బద్దలు కొడతానన్న ఇదే ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పుడు అదే దొర పంచన చేరారు. మొత్తానికి ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయాల్లోకి వచ్చి తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాడు జరిగింది ఒప్పు అయితే ఇప్పుడు జరుగుతున్నది కూడా ఒప్పే.

జగన్‌కు, చంద్రబాబుకు తేడా ఇది..

వాస్తవానికి చంద్రబాబు నాయుడు తొందరపడకుండా ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తున్నారు. నిర్టిష్టమైన ఆధారాలు లేకుండా ఎవరిపైనా చర్యలు తీసుకోవడంలేదు. అగ్రిగోల్డ్‌ భూముల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేసిన తీరే ఇందుకు నిదర్శనం. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఉభయ రాష్ర్టాలకు చెందిన సామాన్య మదుపరులు నష్టపోయారు. ఈ సంస్థ ఆస్తులను సీఐడీ అధికారులు జప్తు చేశారు. అలాంటి ఆస్తులలో ఒకదాని సర్వే నంబర్‌ మార్పించి మరీ జోగి రమేశ్‌ కుటుంబం సొంతం చేసుకుంది. ఇది నేరం మాత్రమే కాదు– పాపం కూడా. పైపెచ్చు అందరూ ఎలా కొన్నారో నేనూ అలాగే కొన్నానని జోగి రమేశ్‌ చెప్పడం వింతగా ఉంది. అంటే అగ్రిగోల్డ్‌ భూములను వైసీపీకి చెందిన చాలా మంది సొంతం చేసుకునే ప్రయత్నం చేశారన్న మాట. 2014 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ లాండ్‌ భూమిని ప్రస్తుత మంత్రి లోకేశ్‌ సొంతం చేసుకున్నారని జగన్‌ రెడ్డి ఆరోపించడం నిజం కాదా? ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా ఆ విషయంలో తప్పు జరిగినట్టు తేల్చలేదు. ఇప్పుడు అలా కాదే! పక్కా ఆధారాలతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేయబోయిన జోగి రమేశ్‌ను పద్ధతి ప్రకారం విచారించడానికి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఆనాటి దౌర్జన్యం నిజం కాదని చెప్పగలరా? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిపై కూడా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు. అదే జగన్‌ రెడ్డి అయితే, ముందు నిందితులు అందరినీ జైల్లో వేయండి, విచారణ సంగతి తర్వాత చూద్దాం అనేవారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన దేవినేని అవినాశ్‌పై లుక్‌ ఔట్‌ నోటీసులు ఉన్నప్పటికీ దుబాయ్‌ వెళ్లే ప్రయత్నం చేయగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు ఆపేశారు. ఇక్కడ నిబంధనల అతిక్రమణ జరగలేదు. ఇప్పటివరకు చాలా మందికి తెలియని ఒక విషయం చెప్పాలి.


మే 13న ఎన్నికలు పూర్తయిన తర్వాత విశ్రాంతి కోసం కుటుంబంతో పాటు ఇటలీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లుక్‌ ఔట్‌ నోటీసు లేకపోయినా సీఐడీ అధికారుల సూచనలతో ఆయనను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు ఆపేశారు. అప్పుడు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. విషయం తెలుసుకున్న ఏపీకి చెందిన సీనియర్‌ అధికారులు కల్పించుకొని విదేశాలకు వెళ్లడానికి చంద్రబాబును అనుమతించారు. అనుమతి రావడంలో అరగంట ఆలస్యం జరిగి ఉన్నా చంద్రబాబు విదేశీ పర్యటన నిలిచిపోయి ఉండేది. అధికార దుర్వినియోగం అంటే ఇదీ! జగన్‌ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలి. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసినప్పుడు న్యాయస్థానం అలాంటి షరతులేవీ విధించలేదు. అయినా అధికారం ఉందికదా అని చంద్రబాబును విదేశాలకు వెళ్లకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. చంద్రబాబు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను శిక్షించాలా? వద్దా? వెయిటింగ్‌లో ఉన్న పదహారు మంది ఐపీఎస్‌ అధికారులపై ప్రభుత్వం ఏయే కేసులు పెట్టబోతున్నదో తెలియదు. నిజంగానే వారిలో హద్దులు మీరి వ్యవహరించిన వారు ఉంటే శిక్ష తప్పదు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఈ పదహారు మందిలో ఒక అధికారి అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో ఒక అద్భుతం జరిగింది. జీసస్‌ కృపతో మెరుపులా మీరు ముఖ్యమంత్రిగా ఆవిర్భవించారు’’ అని పొగడ్తల వర్షం కురిపించారు. ఒక ఐపీఎస్‌ అధికారి ముఖ్యమంత్రిని ఇలా ప్రశంసించడం సమర్థనీయమా? అఖిల భారత సర్వీసు అధికారులను ఈ దుష్ట సంస్కృతి నుంచి బయటపడేయాలి. ప్రవీణ్‌ కుమార్‌ వంటి వారు ఆ దిశగా కృషి చేస్తే మంచిది. చెడును సమర్థిస్తే మనకు కూడా ఆ మకిలి అంటుకుంటుంది!

ఆర్కే

Updated Date - Aug 18 , 2024 | 05:23 AM