Share News

ప్రాజెక్టులపై నిర్లక్ష్యం... ప్రజలకు శాపం

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:16 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్ర–తెలంగాణ సరిహద్దులోని ఏలూరు–భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఉన్న మీడియం ఇరిగేషన్ పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. ఇది...

ప్రాజెక్టులపై నిర్లక్ష్యం... ప్రజలకు శాపం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్ర–తెలంగాణ సరిహద్దులోని ఏలూరు–భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఉన్న మీడియం ఇరిగేషన్ పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. ఇది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలను తుడిచిపెట్టేసింది. ఇళ్ళు, వాకిళ్లు కొట్టుకుపోయాయి. వేలాది కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. రోడ్లు దెబ్బతిని మండలంలో 30 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వందల ఎకరాలలో ఇసుక మేటలు వేసి పంటలు పండించుకునే అవకాశం లేకుండా పోయింది. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆస్తి నష్టం అంచనా రూ.150 కోట్లు పైనే. ఇక్కడ రైతులు, ప్రజల బాధలు వర్ణనాతీతం.


పెద్దవాగు ప్రాజెక్టు గండితో రాష్ట్రం ఉలిక్కి పడింది. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 85:15 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయాలి. 1981లో పూర్తి చేసిన ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధి 16వేల ఎకరాలు కాగా, ఇందులో ఏలూరు జిల్లా పరిధిలోని వేలేరుపాడు మండలంలో 13,640 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వారావుపేట మండలంలో 2,360 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ పనులకు రూ.100 కోట్లు ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.85 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయాల్సి ఉండగా, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ప్రాజెక్టు గేట్లు నిర్వహణ లేకపోవడం, గట్లు బలహీనంగా ఉండడం వల్ల భారీ నష్టానికి కారణమైంది. మూడు భారీ గండ్లు, 25 చిన్నగండ్లు పడ్డాయి. ప్రజలు ఇళ్ళు, పంటలు, పశువులు, సామాగ్రి అన్నీ కోల్పోయారు. అర టీఎంసీ వాటర్ స్టోరేజి సామర్థ్యం కలిగిన పెద్దవాగు ప్రాజెక్టు పరిధిని పెంచి సాగు విస్తీర్ణం పెంచే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రణాళికలు గానీ, నిధులు కేటాయింపు కానీ లేకపోవడం అన్యాయమే. ప్రాజెక్టు పరిధి పెంచడం సంగతి అలా ఉంచితే, కనీసం గేట్లకు గ్రీజు పెట్టడానికి నిధులు లేవు. ఏలూరు జిల్లా పరిధిలోని మిగిలిన ముఖ్యమైన జలాశయాల పరిస్థితీ ఇదే.


ఒక్క పెద్దవాగు ప్రాజెక్టే కాదు. బుట్టాయిగూడెం మండలంలో గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం 217 మీటర్ల నిల్వ సామర్థ్యంతో ఉంది. దీని నిర్వహణకు రూ.28 లక్షల ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణ చర్యలు చేపట్టడం లేదు. గేట్ల తలుపులకు చిల్లులు పడి వాటర్ లీక్ అవుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. గట్లు బలహీనంగా ఉన్నాయి. కాలువల్లో పూడిక తీయకపోవడంతో తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయాయి. ప్రాజెక్టు పరిధి పెంచి సాగు విస్తీర్ణం పెంచే అవకాశం ఉన్నా, నిర్వహణకే దిక్కులేదు.

ఎర్ర కాలువ నది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దుఃఖదాయనిగా పేరుగాంచింది. వరదల నుంచి రక్షణ కోసం జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం వద్ద కరాటం కృష్ణమూర్తి జలాశయం నిర్మించారు. నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు గట్లు బలహీనంగా ఉండడంతో మూడు టీఎంసీలు వాటర్ వస్తేనే గేట్లు ఎత్తేస్తున్నారు. ఏలూరు జిల్లా పరిధిలో కొయ్యలగూడెం మండలం, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నల్లజర్ల, నిడదవోలు మండలాల్లో, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం తదితర మండలాల్లో వరద ముంపుతో వేలాది ఎకరాల్లో ప్రతి ఏటా పంటలు దెబ్బతింటున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్వహణకు రూ.15కోట్లు ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ నిధులు మంజూరు కాలేదు. ఈ ప్రాజెక్టు పరిధిలో అత్యధిక భాగం మెట్ట ప్రాంతంగా ఉంది. బోర్లు పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అన్నదాతలు పంటలు ఎండిపోయి నష్టపోతున్నారు. ప్రాజెక్టు విస్తృతిని పెంచి సాగు విస్తీర్ణం పెంచేందుకు, మెట్ట ప్రాంతంలో ఎర్రకాలువ నది నీటి ద్వారా చెరువులు నింపేందుకు అవకాశాలు ఉన్నాయి.


పోలవరం మండలం ఎల్.ఎన్.డి పేట వద్ద కొవ్వాడ ప్రాజెక్టు ఉంది. దీని నిల్వ సామర్థ్యం 90.5 అడుగులు. దీని గేట్లకు గ్రీజు పూయడానికి కూడా నిధులు లేవు. ప్రాజెక్టు వద్ద కాపలా కాసే వాచ్‌మెన్‌లకు కూడా మూడు సంవత్సరాలుగా జీతాలు లేవు. గేట్లు ఎత్తే మోటార్లు పాడైపోయాయి. ప్రాజెక్ట్ నిర్వహణకు రూ.30 లక్షలు ప్రతిపాదనలు ఉన్నా, నిధుల కేటాయింపు లేదు. భారీ వర్షాలకు వరద వచ్చి చేరడంతో నిర్వహణ లోపాలతో ప్రజలు, రైతులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. గండ్లు పడితే వేలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురవుతాయి.

చింతలపూడి మండలం పరిధిలో నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మాణం చేశారు. నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు కాగా 1.7 టీఎంసీలు రాగానే గేట్లు ఎత్తివేస్తున్నారు. ప్రాజెక్టు మెట్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. తమ్మిలేరుకు వరద పెరిగితే ఏలూరు నగరంతో పాటు వేలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురవుతాయి. నిర్వహణ పనుల కోసం రూ.15 కోట్లు ప్రతిపాదన చేయగా, నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. కానీ విడుదల చేయలేదు. బుట్టాయిగూడెం మండలం చింతలగూడెం వద్ద రూ.70 కోట్లతో పోగొండ రిజర్వాయర్ నిర్మాణం చేశారు. దీని నిర్వహణకు నిధులు లేవు. కాలువలు పూర్తిగా తవ్వలేదు. కోట్లు ఖర్చు పెట్టినా కాలువల తవ్వకం జరగకపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదు.


ఈ రకంగా ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న సాగునీటి జలాశయాలు నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా నిర్వహణ లోపాలతో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో పెద్దపీట వేశామని పాలకులు గొప్పగా చెబుతుంటారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఉంది. కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం సంగతి అలా ఉంచితే, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణయినా సక్రమంగా లేదు. గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ జలాశయాలు ఉండటం వల్ల వీటిని పర్యాటక ప్రాంతాలుగా కూడా అభివృద్ధి చేయవచ్చు. సాగునీరు, తాగునీరు అవసరాలకే కాదు యువతకు ఉపాధి, ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలుగా కూడా ఈ జలాశయాలను ఉపయోగించుకోవచ్చు. కేరళ రాష్ట్రం తరహాలో ఈ జలాశయాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలి. ప్రాజెక్టు నిర్వహణ లోపాలను సరిచేయాలి. నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించాలి. పెద్దవాగు ప్రాజెక్టు నేర్పిన అనుభవంతో మైనర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.

కె. శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

Updated Date - Jul 26 , 2024 | 03:16 AM