సత్యాగ్రహ శిఖరం
ABN , Publish Date - Oct 02 , 2024 | 02:23 AM
ఓ కరమ్ చంద్... కర్త కర్మ క్రియలన్నీ నువ్వై ప్రబోధించిన పాఠాలు పల్లవించట్లేదిక్కడ గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమన్న స్వాప్నికుడా.. పల్లెలన్నీ వల్లకాళ్లుగా మారుతున్నాయ్ పాల పాకెట్లు నీళ్ల సీసాలు పట్నం నుంచే...
ఓ కరమ్ చంద్...
కర్త కర్మ క్రియలన్నీ నువ్వై
ప్రబోధించిన పాఠాలు పల్లవించట్లేదిక్కడ
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమన్న స్వాప్నికుడా..
పల్లెలన్నీ వల్లకాళ్లుగా మారుతున్నాయ్
పాల పాకెట్లు నీళ్ల సీసాలు పట్నం నుంచే
చేనేతన్న చావును నేసుకుంటున్నాడు
భగ్గునమండే కుమ్మరి కొలిమి
గిర్రున తిరిగే కమ్మరి చక్రం నీరుగారాయి
ఇచ్చిపుచ్చుకోవటాలు పుచ్చుపట్టి పోయాయి
నీ కలల గ్రామస్వరాజ్యం కన్నీరుపెడుతోంది
నిండు చందురుడిలాంటి కరమ్ చంద్..
నువ్విప్పుడుంటే కన్నీటి సంద్రమయ్యేవాడివి
ఓ మహాత్మా...
మద్యం ఏరులై పారుతోంది
మనిషి మత్తులో జోగుతున్నాడు
నిరుపేదల బ్రతుకులు ఛిద్రమవుతున్నయి
రాజకీయాలు రంగులు మారుతున్నాయి
పాశ్చాత్యుల్ని చూసి వాతపెట్టుకుంటున్నారు
వాయిదాల్లో విలాసాలు కొంటున్నారు
రక్షకులు భక్షకులవుతున్నారు
గల్లీ గల్లీలో ఘోరాలు నేరాలు
పోటీ పరీక్షల్లో కలుపు మొక్కలు పెరిగి
తరుచూ రద్దవుతున్నాయి
యువత నిరుత్సాహంలో మునిగిపోయింది
మహత్మా మన్నించు ఇది నీ రాజ్యమే..
ఓ బాపూ...
బోసి నవ్వుల బాపూ.. వెలుగు పువ్వుల చూపూ
నీ అడుగడుగూ ఓ నిధి
నీ మాటల మూటలు ఓ పెన్నిధి
నువ్వు ద్వేషించిన హింస
నువ్వు ప్రేమించిన అహింస
అన్నీ ఆదర్శనీయం ఆచరణీయం
నీ ఆకాంక్షల వాదం అస్పృశ్యతా నినాదం
నీ సేవా నిరతి.. నీ నూలు పోగుల హారతి
మాకిచ్చిన ఆత్మీయ బంధువు.. జాతి సింధువు
నీ చరఖా చక్రం స్వావలంబన చిహ్నం
నీ దండియాత్ర పరతంత్రంపై దండయాత్ర
మహిమాన్విత రూపూ మళ్లీ జన్మించు బాపూ..
నువ్వే మా హృదయ సత్యాగ్రహ శిఖరం..!
కటుకోఝ్వల రమేష్