Share News

యోగిపై అసమ్మతి

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:59 AM

ఇటీవలి సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్‌లో 33సీట్లకే పరిమితం కావడం, అది కేంద్రంలో మోదీ మూడో రాకను తీవ్రంగా ప్రభావితం చేయడంతో యూపీ బీజేపీని అసమ్మతి స్వరాలు, అంతర్గత వైరాలు చుట్టుముట్టాయని...

యోగిపై అసమ్మతి

ఇటీవలి సార్వత్రక ఎన్నికల్లో బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్‌లో 33సీట్లకే పరిమితం కావడం, అది కేంద్రంలో మోదీ మూడో రాకను తీవ్రంగా ప్రభావితం చేయడంతో యూపీ బీజేపీని అసమ్మతి స్వరాలు, అంతర్గత వైరాలు చుట్టుముట్టాయని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్ళివస్తున్నారు, ఏవో నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు అక్కడే తిష్టవేసి, ఇంతకాలమూ దాచుకున్న ఆగ్రహాన్ని వెళ్ళగక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కీ, ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకీ మధ్య విభేదాలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేందర్‌ చౌదరి రాజీనామాకు సిద్ధపడితే పెద్దలంతా సముదాయించారని, ఓబీసీ మౌర్యకు మరింత ప్రాధాన్యం పెంచి, ఠాకూర్‌ యోగిని నియంత్రించాలని అనుకుంటున్నారని ఏవో విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో పది అసెంబ్లీస్థానాలకు ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈమాత్రం హడావుడి సహజం.


తమకు తగ్గడం కంటే, సమాజ్‌వాదీ–కాంగ్రెస్‌ కూటమికి మరో పదిలోక్‌సభ స్థానాలు ఎక్కువ రావడం యూపీ బీజేపీ నేతలను భయపెడుతోంది. ఈ ఎదురుగాలి మరింత బలపడి రేపటి ఉప ఎన్నికలమీద ప్రభావం చూపుతుందన్న అనుమానం వారిని వెంటాడుతోంది. భారతీయ జనతాపార్టీని ఈ మారు యూపీ ఎన్నటికీ మరవనంత దెబ్బకొట్టింది. చార్‌సౌ పార్‌, తీన్‌సౌ పార్‌ ఎటూ లేకపోగా, సొంతకాళ్ళమీద కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేని స్థితిలోకి ఆ పార్టీ జారుకోవడంలో యూపీ పాత్ర ప్రధానమైనది. మోదీ దశాబ్దకాలపు ఏకపార్టీ పాలనకు ముగింపు పలికి, మిత్రపక్షాలమీద ఆధారపడాల్సిన పరిస్థితిని కల్పించింది. 80స్థానాలున్న రాష్ట్రంలో ఐదేళ్ళకంటే 29స్థానాలు తగ్గి 33సీట్లకు పడిపోయి, ఎనిమిదిశాతం ఓట్లను ఆ పార్టీ కోల్పోయింది. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన ఆయోధ్య (ఫైజాబాద్‌)లో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం, దళితుడైన ఓ సమాజ్‌వాదీ అభ్యర్థి అక్కడ మంచి మెజారిటీతో గెలవడం, వారణాసినుంచి పోటీచేసిన మోదీకి గతంలో కంటే మెజారిటీ సగానికి తగ్గిపోవడం వంటి విచిత్రాలు సైతం యూపీలో అనేకం జరిగాయి.

బీజేపీ ప్రవచించే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌కు ఆది, పునాది యూపీయే. మోదీ–యోగి ద్వయం మిగతా బీజేపీ ముఖ్యమంత్రులకు నిన్నటివరకూ ఆదర్శం. ఎన్‌కౌంటర్లు, బుల్‌డోజర్ల భాష కూడా వారికి యోగి నేర్పిందే. యోగి ఆధ్వర్యంలో ఇప్పటివరకూ జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలే సాధించింది. ఈ మారు ఆయన అభ్యర్థుల ఎంపికను పూర్తిగా అధిష్ఠానానికి వదిలేసి పెద్ద పొరపాటుచేశారని కొందరు అంటారు. ఓ నలభైమంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వవద్దని ఆయన ప్రతిపాదిస్తే ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదని మరికొందరు అంటారు. కారణాలు ఏమైనప్పటికీ, ఈ ఫలితాలతో యోగి తన ప్రాభవాన్ని కోల్పోయిన మాట నిజం. నిజానికి ఈమారు కూడా ఎప్పటిలాగానే ఎన్నికల ప్రచారంలో మోదీదే కీలకపాత్ర. రాష్ట్రాన్నే కాదు, యావత్‌ దేశాన్నే ఆయన చుట్టేశారు.


నాలుగువందలో, కనీసం మూడువందలో సాధించి ఉంటే, ఆ ఘనత సహజంగానే మోదీఖాతాలో పడివుండేది. కానీ, ఫలితాలు భిన్నంగా ఉండటంతో యోగి చుట్టూ వేడిరాజుకుంటోంది. చిన్నాచితకా కులపార్టీలు యోగిపై వ్యాఖ్యలు చేయడం కంటే, సొంతపార్టీలోనే విమర్శలు రేగడం విశేషం. పరీక్షాపత్రాల లీకులు, అగ్నివీర్, కొత్త పెన్షన్‌ వంటి విధానాల మీద ప్రజాగ్రహం, యాదవేతర ఓబీసీల ఓట్లు బీజేపీకి తగ్గి ఎస్పీవైపు మళ్ళడం, దళితుల ఓట్లు బీఎస్పీనుంచి కాంగ్రెస్‌కు పోవడం, రాజ్యాంగం మార్పు మాట అణగారినవారిని భయపెట్టడం ఇత్యాదివి అనేకం బీజేపీ వెనుకంజకు కారణాలైనాయి. హిందూత్వాన్ని అధిగమించి సామాజిక న్యాయం ఎజెండా పనిచేయడంతో ఫలితాలు తారుమారైనాయి.

రాష్ట్రంలో రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చూపని పక్షంలో అప్రదిష్టకు తోడు, అనేక కొత్త రాజకీయసమస్యలు పుట్టుకొస్తాయి. యోగి, మౌర్య, చౌదరీలను ఏకతాటిమీదకు తెచ్చి ఈ గండం దాటాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఉపఎన్నికల వరకూ మార్పుచేర్పులేవీ చేపట్టకుండా, ఆ ఘట్టం దాటాక సమూలప్రక్షాళన జరపాలన్న ఆలోచన కూడా ఉండివుండవచ్చు. ఎస్పీ– కాంగ్రెస్‌ కూటమి బలపడుతున్న దశలో యూపీ బీజేపీని గాడినపెట్టడం అధిష్ఠానానికి పెద్ద పరీక్షే.

Updated Date - Jul 19 , 2024 | 03:59 AM