Share News

రాజీపడని రాజకీయపోరాట వీరుడు

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:43 AM

వాగ్ధాటి, ముక్కుసూటితనానికి పేరుగాంచిన నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డి. ఆయన తన రాజకీయ ప్రయాణంలో విలువల విషయంలో ఎన్నడూ రాజీపడలేదు. ఎమర్జెన్సీ ప్రకటనపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఎదిరించడానికి కూడా వెనుకాడలేదు. పోలియో కారణంగా జైపాల్‌రెడ్డి పరిమిత శారీరక చలనశీలత ఆయన రాజకీయ ఎత్తులను

రాజీపడని రాజకీయపోరాట వీరుడు

వాగ్ధాటి, ముక్కుసూటితనానికి పేరుగాంచిన నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డి. ఆయన తన రాజకీయ ప్రయాణంలో విలువల విషయంలో ఎన్నడూ రాజీపడలేదు. ఎమర్జెన్సీ ప్రకటనపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఎదిరించడానికి కూడా వెనుకాడలేదు. పోలియో కారణంగా జైపాల్‌రెడ్డి పరిమిత శారీరక చలనశీలత ఆయన రాజకీయ ఎత్తులను సాధించడానికి అవరోధం కాలేదు. తెలంగాణ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక శిఖరం. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు భారత రాజకీయాల్లో అధ్యయనం, అవగాహన, వాక్పటిమల మేళవింపుగా రాణించిన అరుదైన రాజకీయవేత్త జైపాల్‌రెడ్డి.

ఆయన వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణం, మాట్లాడే విధానం ప్రశంసనీయం. ప్రజాప్రయోజనాల విషయంలో రాజీపడని నిష్కళంకమైన నాయకుడిగా జాతీయ రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్‌లో ప్రజల ప్రాముఖ్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. విద్యార్థి దశ నుంచి జైపాల్‌రెడ్డి అవినీతిని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. కొన్ని దశాబ్దాలపాటు పార్లమెంటేరియన్‌గా ఉన్న ఆయన వివిధ ప్రభుత్వాల్లో కీలక శాఖలను నిర్వహించారు. 1998లో ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. యునైటెడ్ ఫ్రంట్ కామన్ మినిమం ప్రోగ్రామ్‌ రూపకర్త ఆయనే. భారతదేశ ప్రాధాన్యాల గురించిన ఆయన అవగాహన ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆ డాక్యుమెంట్ ఒక్కటి చాలు.

1942 జనవరి 16న తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల్‌లో జన్మించిన జైపాల్‌రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్‌ పట్టా తీసుకున్నారు. ఉస్మానియాలో విద్యార్థి నాయకుడిగా ఉండగానే జైపాల్‌రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది.

ఎమర్జెన్సీ తరువాత జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతాపార్టీలో చేరి 1980లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇందిరాగాంధీపై పోటీకి దిగారు. తరువాత జనతా చీలిక సమూహం జనతాదళ్‌లో చేరారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఆయనుకున్న ప్రావీణ్యం అమోఘమైంది. అసాధారణమైన ఉపన్యాస నైపుణ్యం, ఉచ్చారణ ఆయనను యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలకు, కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గట్టిగా శ్రమించారు. 2010 తొలినాళ్లలో ప్రత్యేక తెలంగాణ పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆయన మార్గదర్శకశక్తి.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యూపీఏ–2 ప్రభుత్వాన్ని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని ఆశ చూపినా తిరస్కరించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసమే సాగింది. జైపాల్‌రెడ్డి మంచి వక్త. అపారమైన మేధస్సుతో అందరినీ ఆకట్టుకునే విశ్లేషణలు ఆయన సొంతం. ఆయన రాజకీయ తత్వవేత్త లేదంటే తాత్విక రాజకీయవేత్త.

1969 నుండి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. 1984లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990–96; 1997–98 రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1991–92లో ఎగువసభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. 1999లో తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2004లో మిర్యాలగూడ, 2009లో చేవెళ్ల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. జైపాల్‌రెడ్డి 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి ఓడిపోయి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. అనారోగ్య కారణంగా 77వ ఏట జైపాల్ రెడ్డి హైదరాబాద్‌లో 2019, జూలై 28న కన్నుమూశారు.

ఐ.కె గుజ్రాల్ ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా; మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వివిధ శాఖలను జైపాల్‌రెడ్డి నిర్వహించారు. యూపీఏ–2లో ఆయన పట్టణాభివృద్ధి మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ చేపట్టారు. తదనంతరం రాజకీయ తుఫాను కారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలకు బదిలీ అయ్యారు. ఆయన “Ten Ideologies: The Great Asymmetry Between Agrarianism and Industrialism”తో సహా కొన్ని పుస్తకాలు కూడా రాసారు.

కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ప్రోత్సహించకపోగా సోదరులు, కుమారులను రాజకీయాలకు దూరంగా ఉంచారు, ఎన్నికల సమయంలో ప్రచారానికి మాత్రమే వారి పాత్ర పరిమితమయ్యింది. పార్లమెంటులో జైపాల్‌రెడ్డి ప్రసంగాలు గమనిస్తే, ఏ అంశాన్నీ, ఆరోపణలే ప్రధానంగా చేసుకుని మాట్లాడక ప్రతి సమస్యకు తాత్విక పునాదులను అర్థం చేసుకుని లోతైన అవగాహనతో మాట్లాడేవారు. లౌకిక స్ఫూర్తికి ఆయన నిఖార్సయిన నిదర్శనం.

n నందిరాజు రాధాకృష్ణ

సీనియర్ జర్నలిస్ట్

(రేపు జైపాల్ రెడ్డి వర్ధంతి)

Updated Date - Jul 27 , 2024 | 05:43 AM