Share News

నెతన్యాహుపై నిరసన

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:36 AM

ఇజ్రాయెల్‌లో సోమవారం దేశవ్యాప్త సమ్మె జరిగింది. ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ గాజా యుద్ధం మొదలుపెట్టిన తరువాత ఇంతటి విస్తృతస్థాయి సమ్మె జరగడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద కార్మిక సంఘమైన హిస్తాడ్రట్‌ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది...

నెతన్యాహుపై నిరసన

ఇజ్రాయెల్‌లో సోమవారం దేశవ్యాప్త సమ్మె జరిగింది. ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ గాజా యుద్ధం మొదలుపెట్టిన తరువాత ఇంతటి విస్తృతస్థాయి సమ్మె జరగడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద కార్మిక సంఘమైన హిస్తాడ్రట్‌ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. అన్ని వ్యాపార వాణిజ్యసంస్థలూ, పరిశ్రమలు, విద్యాసంస్థలు సమ్మెలో పాలుపంచుకున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వకార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌ మూతపడ్డాయి. ఆర్థికవ్యవస్థకు ఆయువుపట్టులాంటి రంగాలన్నీ పనిచేయకపోవడం ఈ సమ్మె లక్ష్యం కనుక, అది నెరవేరినట్టే. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్నవారిని విడిపించడంలో నెతన్యాహూ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ సమ్మె జరిగింది. ఆదివారం నాడు బందీల్లో ఆరుగురు చనిపోయిన స్థితిలో కనిపించడంతో ఇజ్రాయెలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సొరంగంలో బందీలుగా ఉంచిన ఈ ఆరుగురినీ తమ సైన్యం అక్కడకు చేరుకోగానే హమాస్‌ అంతం చేసిందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. యుద్ధాన్ని కొనసాగించడం ద్వారా నెతన్యాహూ ఏమీ సాధించలేరనీ, తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో ర్యాలీలు జరిగాయి. రాజకీయ దురుద్దేశంతో పిలుపునిచ్చిన ఈ సమ్మెను నిలువరించాలంటూ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం న్యాయస్థానాల్లో వాదించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.


ఒకపక్క యుద్ధం సాగుతూ, మరోపక్కన చర్చలు మరింత వెనక్కుపోతున్న స్థితిలో హమాస్‌ చేతుల్లో బందీలుగా ఉన్నవారు మరణించడం తప్ప, బయటకు రావడం అసాధ్యమని ఇజ్రాయెలీలకు అర్థమైపోయింది. హమాస్‌ దాడిజరిగి మరోనెలలో సంవత్సరం అవుతుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై దాడిచేసిన హమాస్‌ దాదాపు పన్నెండువందలమందిని చంపి, 250మందిని బందీలుగా అపహరించుకుపోయింది. వీరిలో వందమంది ఆ తరువాత విడుదలైనప్పటికీ, ఈ పదకొండునెలల కాలంలో చనిపోయినవారు కాక, మరో వందమంది ఇంకా ‌హమాస్‌ గుప్పిట్లోనే ఉన్నారు. యుద్ధం సాగుతూంటే మరింతమంది హత్యకు గురయ్యే ప్రమాదమూ ఉంది. ఈ సమ్మె వెనుక ఏవో కుట్రలున్నాయనీ, రాజకీయ కక్షలున్నాయని నెతన్యాహూ ప్రభుత్వం వాదిస్తున్నది కానీ, ఆయన యుద్ధపిపాసి అని ఇజ్రాయెలీలకు తెలుసు.


యుద్ధం ముగిసి, ఎన్నికలు జరిగితే నెతన్యాహూ ఓడిపోవడం ఖాయమని చాలా విశ్లేషణలు వచ్చాయి. దానిని కొనసాగించడం ద్వారా ఇప్పుడున్న విస్తృతమైన అధికారాలను చెలాయించడంతోపాటు, తనకు రాజకీయంగా లబ్ధిచేకూరుతుందన్న నమ్మకం కుదిరినప్పుడే ముగించవచ్చునని నెతన్యాహూ అనుకుంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకుండా అడ్డుపడుతున్నది ఇజ్రాయెల్‌ ప్రధాని కదూ అన్న ప్రశ్నకు అవును ఆయనేనని అమెరికా అధ్యక్షుడు విలేకరులముందు ఒప్పుకోవాల్సివచ్చింది. ఈ అంగీకారం బాగున్నది కానీ, నెతన్యాహూ మొండితనాన్ని నిలబెడుతున్నది అమెరికాయే. చర్చల్లో హమాస్‌ కొంత దిగివచ్చినా ఏదో కారణంతో అవి సాగనివ్వకుండా చేస్తున్నారు. బందీలందరినీ విడిచిపెట్టేవరకూ యుద్ధం సాగిస్తానన్న ఆయన వాదనను దేశప్రజలు మెచ్చడం లేదు. బందీలను వదిలేశాక ఆయన ఇంకెంత విధ్వంసానికి పాల్పడతాడో హమాస్‌కు తెలుసు. యుద్ధం ఆపి, ఇజ్రాయెల్‌ తన సేనలను ఉపసంహరించుకున్న పక్షంలోనే బందీలను విడిచిపెడతానన్న వాదననుంచి హమాస్‌ కాస్తంత సడలిందని కూడా వార్తలు వచ్చాయి. ఈజిప్ట్‌–గాజా సరిహద్దు ప్రాంతంనుంచి ఇజ్రాయెల్‌సేనలు వెనక్కుపోవాలన్న హమాస్‌ డిమాండ్‌ కూడా చర్చల్లో ప్రతిష్టంభనకు కారణమంటారు. ఇక్కడ వెనక్కుతగ్గి చర్చలకు సానుకూలత ప్రదర్శించి, అంతిమంగా బందీలను విడిపించుకుందామని సన్నిహితులనుంచే ఒత్తిడి వస్తున్నప్పటికీ నెతన్యాహూ ఒప్పుకోవడం లేదు. టీకాలు వేయించుకుంటున్న పిల్లలమీద కూడా బాంబులు కురిపించి హతమార్చడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. యుద్ధాన్ని ఆపి, చర్చలకు మొగ్గుచూపిన మరుక్షణంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కూటమిలోని మితవాద, మతవాద భాగస్వామ్య పక్షాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన చర్చల ఊసెత్తబోరని విశ్లేణలు సాగుతున్నాయి. నిజానికి, హమాస్‌ దాడి, బందీల అపహరణను తీవ్రంగా నిరసిస్తూ, నెతన్యాహూ ప్రతీ చర్యనూ సమర్థిస్తూ ఆయనకు అండగా ఉండాల్సిన ప్రజలు, అందుకు పూర్తి భిన్నంగా నిరసన ప్రదర్శనలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆదివారం నాటి భారీ ప్రదర్శనలు, సోమవారం దేశవ్యాప్తంగా జరిగిన సమ్మె ఓ వందమంది బందీలు, వారి బంధువులతో ముడివడిన విషయం కాదనీ, నెతన్యాహూ మీద దేశప్రజలకు ఇక ఏమాత్రం విశ్వాసం లేదనడానికి నిదర్శనమని విశ్లేషకుల అభిప్రాయం.

Updated Date - Sep 05 , 2024 | 01:36 AM