Share News

‘సార్’ ప్రబోధించిన ఉద్యమ స్ఫూర్తిలో...

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:40 AM

స్వీయ అస్తిత్వం కోసం, ప్రజాస్వామ్య పరివర్తన కోసం కన్నీళ్ళు, రక్తం కలగలిసిన అసంఖ్యాక బలిదానాలను చేసింది తెలంగాణ. ఈ క్రమంలోనే తన స్వీయజీవితాన్ని మండించి, మూడుతరాల ఉద్యమానికి వంతెనగా మారి తెలంగాణ లక్ష్యాన్ని తీరం చేర్చిన వైతాళికుడు ఆచార్య జయశంకర్ సార్. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, సామాజిక

‘సార్’ ప్రబోధించిన ఉద్యమ స్ఫూర్తిలో...

స్వీయ అస్తిత్వం కోసం, ప్రజాస్వామ్య పరివర్తన కోసం కన్నీళ్ళు, రక్తం కలగలిసిన అసంఖ్యాక బలిదానాలను చేసింది తెలంగాణ. ఈ క్రమంలోనే తన స్వీయజీవితాన్ని మండించి, మూడుతరాల ఉద్యమానికి వంతెనగా మారి తెలంగాణ లక్ష్యాన్ని తీరం చేర్చిన వైతాళికుడు ఆచార్య జయశంకర్ సార్. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక స్వేచ్ఛ సాధించుకుంటారని, తెలంగాణ చారిత్రక స్ఫూర్తి పునాదిగా అధికారాన్ని ప్రజలు నియంత్రిస్తారని భావించిండు. విద్యావంతులు మౌనంగా ఉంటే భవిష్యత్తు సమాజాన్ని కాపాడలేమని, గతంలో చేసిన త్యాగాలకు విలువ ఉండదని, ఉద్యమ విలువలకు సమాజంలో నీడ ఉండదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా అంతర్గత దోపిడీ విధానాలు కొనసాగుతాయని, వాటి మీద నిరంతరం పోరాటం చేయగలిగే చైతన్యవంతమైన పౌర సమాజం తెలంగాణలో ఎల్లకాలం ఉంటుందని విశ్వసించారు. ఈ దోపిడీ విధానాలను ఎదుర్కొనేందుకు మరింత పదునైన పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిండు.

ఆ క్రమంలోనే 2004లో ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం ఆయన అధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ విద్యావంతుల వేదిక (టివివి) రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్వయంపాలన పేరు మీద గత పాలకులు చేసిన మోసాలను, ఉద్యమ పీఠికను విధ్వంసం చేసి, ఉద్యమ ఫలితాన్ని తమ వారి కోసం వినియోగించుకున్న తీరును విప్పిచెప్పింది. ఉద్యమ సంస్థలను, ఉద్యమకారులను సంఘటితం చేసి ఆ నియంతను తొలగించడంలో టివివి విశేష కృషి చేసింది. కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం నుంచి కూడా ఉద్యమ ఆకాంక్షలని సాధించుకోవడానికి సైతం జయశంకర్ సార్ ప్రభోదించిన ఉద్యమ స్ఫూర్తే ఏకైక మార్గం అని టివివి విశ్వసిస్తున్నది.

మరోవైపు బహుళత్వ భారతదేశాన్ని అసహన సమాజంగా మార్చివేయడం కోసం తరాలుగా పోగుచేసుకున్న మహాత్తర భారతీయ భావనను కేంద్ర పాలకులు చిదిమి వేస్తున్నారు. ఈ దేశ నేల, నీరు, అడవులు, కార్మిక మానవ శక్తులను తన స్వదేశీ, విదేశీ కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతూనే, ఇక్కడి ప్రజల ధార్మిక జీవితాన్ని కూడ తన ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులలో తమ హావభావాల చాటున కప్పివేయబడిన కుయుక్తులను బయటపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తులను, పౌరసమాజాన్ని రక్తపు మడుగులలోకి, భయ సంస్కృతిలోకి, మౌన లొంగుబాటులోకి పంపుతున్నారు. సమాజాన్ని చీకట్లు కమ్మేస్తున్నప్పుడు, ఆధిపత్య శక్తులు పంజా విసురుతున్న విధ్వంసక పాలనా విధానాలను ప్రతిఘటించకపోతే ఈ దేశాన్ని, ఉదాత్త విలువల రాజ్యాంగాన్ని, ఉద్యమ ఆకాంక్షలను రక్షించుకోలేం. అందుకే ఈ పాలనా విధానాలను ఎదిరిద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సంఘటితంగా, సమన్వయంతో, సమాంతరంగా పనిచేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన తోవలో పనిచేసే వారిని కలుపుకోవడానికైనా లేదా వారితో కలిసి నడవటానికైనా చారిత్రక ప్రాధాన్యత, వర్తమాన పోరాటగరిమ కలిగిన సంస్థగా టివివి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే జయశంకర్ సార్ అమరులైన నాటి నుంచి దేశంలోను, రాష్ట్రంలోను ప్రముఖ మేధావులను ఆహ్వానించి ప్రతి ఏటా స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తూ వస్తున్నది.

జూలై 28 ఆదివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జయశంకర్ 13వ స్మారకోపన్యాసం నిర్వహిస్తున్నాం. ప్రఖ్యాత అంతర్జాతీయ డిజిటల్ న్యూస్ పోర్టల్ ‘ది వైర్’ పత్రిక సీనియర్ ఎడిటర్, సామాజిక కార్యకర్త అర్ఫా ఖానుమ్ షేర్వానీ ‘సమకాలీన భారతీయ సమాజం–ముందున్న సవాళ్ళు’ అంశంమీద ప్రసంగిస్తారు.

l అంబటి నాగయ్య

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - Jul 27 , 2024 | 05:40 AM