Share News

నోటిఫికేషన్లను చూసి ఓర్వలేక!

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:57 AM

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలన్న ధ్యాసే తప్ప గత పదేళ్లలో చేసిన తప్పులను గ్రహించి సరైన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలన్న సోయి లేని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దొంగే ‘దొంగ దొంగ’ అని అరిచినట్టు

నోటిఫికేషన్లను చూసి ఓర్వలేక!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలన్న ధ్యాసే తప్ప గత పదేళ్లలో చేసిన తప్పులను గ్రహించి సరైన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలన్న సోయి లేని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దొంగే ‘దొంగ దొంగ’ అని అరిచినట్టు వ్యవహరిస్తున్నారు. ఎల్లవేళలా నిరుద్యోగుల పక్షాన ఉంటూ వారి కోరికలు నెరవేర్చడానికి ఏర్పడిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని ఏడు నెలలకే గాయపరచాలని, ఇంకో ఆరు నెలల లోపు భూస్థాపితం చేయాలని విచిత్రమైన కలలు కంటున్నారు.

ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు విద్యా వ్యవస్థను అత్యంత నిర్లక్ష్యానికి గురి చేసిన చరిత్ర కేసీఆర్ పాలనదే! తెలంగాణలో చాలా స్కూళ్లు పాతబడి కూలడానికి సిద్ధంగా ఉన్నా వాటి వైపు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ పాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు మౌలిక వసతులు, సొంత భవనాలు లేక అద్దె భవనాలలో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదు. మధ్యాహ్న భోజనానికి సరైన నిధులు కేటాయించమని ఎన్నిసార్లు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మొత్తుకున్నా కనికరించలేదు. విద్యార్థులు లేరన్న సాకుతో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను, జూనియర్ కాలేజీలను మూసివేశారు. యూనివర్సిటీల పరిస్థితి చెప్పనవసరం లేదు. సరైన మౌలిక వసతులు లేక, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేక వాటిని మూసివేసే పరిస్థితికి దిగజార్చారు. పార్టీ అనుచరులతోనే ప్రైవేటు యూనివర్సిటీలను పెట్టించి ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించారు. నాడు నిరుద్యోగుల విషయంలో జరిగిన పొరపాటు వల్లనే అధికారాన్ని కోల్పోయామని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు నేడు అదే నిరుద్యోగులను మరోసారి అస్త్రంగా తీసుకొని వారి జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తున్నారు.

నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా ఎప్పుడైనా పోరాటం చేయాల్సిందే, తప్పులేదు. కానీ గత పదేళ్లలో ఏ నోటిఫికేషన్ కూడా సరైన పద్ధతిలో వేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు. తెలంగాణ వస్తే ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం వస్తుందని చెప్పి వారిని ఉద్యమంలోకి లాగి ప్రాణాలను బలితీసుకున్న కేసీఆర్, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగుల బలిదానాలు ఆగకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోలేకపోయాడు. పైగా ఉద్యోగాలు వేయమని ధర్నాలు, ఉద్యమాలు చేసినవారిపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా అన్ని యూనివర్సిటీలలో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేయకుండా కట్టడి చేసేందుకు యూనివర్సిటీ వీసీలను తోలుబొమ్మల్లాగ ఆడించారు. ప్రతి రోజు యూనివర్సిటీలో పోలీస్ పికెటింగులు నిర్వహించారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్‌ఫార్మర్ పోలీసులతో ఉద్యమకారులపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నాలు చేయొద్దు, మీటింగులు పెట్టొద్దు, దిష్టిబొమ్మలు దగ్ధం చెయ్యొద్దంటూ, కనీసం నిరసన తెలిపే హక్కు లేదన్నట్లు నిర్బంధించారు. నిరుద్యోగులను, విద్యార్థి సంఘాలను హాస్టల్లోనే నిర్బంధించి గది గదికీ తిరిగి అరెస్టు చేయించేలా వైస్ ఛాన్సలర్ల చేత నోటీసులు ఇప్పించారు. ఏం అప్పుడు విద్యార్థులు చేసిన ఉద్యమాలు మీ కంటికి కనిపించలేదా? అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే ఇంకోలా ప్రవర్తిస్తారా!

నోటిఫికేషన్లు ఇచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే గురుకుల పరీక్షలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా! అప్పుడు గుర్తు రాలేదా పరీక్ష పరీక్షకు మధ్య వ్యవధి ఉండాలని? అప్పుడు పోస్టులు పెంచాలని అడిగిన నిరుద్యోగులను హేళన చేసింది మీరే కదా! జీవో 46ను మీకు సోయి లేకుండానే ఇచ్చారా? ఎన్నోసార్లు ఈ జీవోను ఎత్తేయండి అని నిరుద్యోగులు మిమ్మల్ని కలవాలని ప్రయత్నించినా ఒక్కసారీ కలవలేదు. నిరుద్యోగులతో ఏమైతుందిలే అనుకుని వారి ఉద్యమాలను అణచివేశారు. గత 10 ఏళ్ల నుంచి గ్రూప్–1 పరీక్ష నిర్వహించకుండా పేపర్ లీక్ చేస్తూ పోస్టులు అమ్ముకొని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా అన్యాయం చేశారు. 2016, 2017లో నిర్వహించిన డీఎస్సీ, గ్రూప్–2 పరీక్షల తర్వాత దాదాపు ఎనిమిదేళ్ళుగా మళ్లీ నోటిఫికేషన్లు లేవు. ఇప్పుడు ఈ అన్ని పరీక్షలూ నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రధాన ఎజెండాతో పనిచేస్తున్నారు! మీరు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇప్పటి నోటిఫికేషన్లకు తేడా మీరే చూస్కోండి. అయినా మీరు చెప్పకపోయినా నిరుద్యోగుల కోరికలను పరిగణనలోకి తీసుకొని పరీక్షకూ పరీక్షకూ మధ్య వ్యవధి ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తపడుతూనే ఉంది.

– మండ్ల రవి

ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - Jul 20 , 2024 | 04:57 AM