Share News

బడ్జెట్: సగటుజీవికి భరోసానిచ్చేనా?

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:02 AM

దేశ ఆర్థిక వ్యవస్థ సదా అభివృద్ధిదాయకంగా ఉండాలని కోరుకోనివారు ఎవరు ఉంటారు? సామాన్యుల శ్రేయస్సును హృదయపూర్వకంగా కోరుకుంటున్న వ్యక్తిగా కేంద్ర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టే తరుణంలో సంబంధిత

బడ్జెట్: సగటుజీవికి భరోసానిచ్చేనా?

దేశ ఆర్థిక వ్యవస్థ సదా అభివృద్ధిదాయకంగా ఉండాలని కోరుకోనివారు ఎవరు ఉంటారు? సామాన్యుల శ్రేయస్సును హృదయపూర్వకంగా కోరుకుంటున్న వ్యక్తిగా కేంద్ర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టే తరుణంలో సంబంధిత విషయాలను నేను శ్రద్ధగా చదువుతాను, నిశితంగా ఆలోచిస్తాను, సవివరంగా రాస్తాను... అయినా బడ్జెట్ రోజున తరచు అసంతృప్తితోనే పార్లమెంటు నుంచి ఇంటికి వెళ్లడం పరిపాటి అయిపోయింది. ఆ తరువాత ప్రజల వద్దకు వెళతాను, శాసనసభ్యులు, ఆర్థికవేత్తలు, వ్యాపారస్తులు, రైతులు, మహిళలు, యువజనులు, మరీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలతో సహా వివిధ జీవన రంగాలలోని వారితో మాటా మంతీ జరుపుతాను. కొత్త బడ్జెట్ గురించి ప్రజల, ముఖ్యంగా స్థానిక మార్కెట్లలో సామాన్యుల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకుంటాను గత పదేళ్లుగా ఏటా, బడ్జెట్ ‘ప్రకటనలు’ కేవలం 48 గంటలలోనే జాడలేకుండా పోవడాన్ని, ప్రజల ఆసక్తి బడ్జెటేతర అంశాలపైకి మళ్లడాన్ని నేను గమనిస్తూ వస్తున్నాను.

కేంద్ర వార్షిక బడ్జెట్‌లు ఎందుకు ఆశాభంగం కలిగిస్తున్నాయి? ప్రజల జీవన వ్యయాల వాస్తవాలపై బడ్జెట్ రూపకర్తలకు అవగాహన కొరవడడంతో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై నిష్పాక్షిక అంచనాకు రావడంలో విఫలమవుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లు కలిగిస్తున్న ఆశాభంగానికి అదే ప్రధాన కారణమని నేను విశ్వసిస్తున్నాను. ఈ నెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న 2024–25 వార్షిక బడ్జెట్‌నే తీసుకోండి. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై వాస్తవిక అంచనా వెల్లడించే సత్యాలు ఏమిటి? యువజనుల, కుటుంబాల శ్రేయస్సుకు, సామాజిక శాంతికి నిరుద్యోగిత అతి పెద్ద సవాల్‌గా ఉన్నది. కొన్ని డజన్ల ఉద్యోగ ఖాళీలకు వేలాది యువజనులు దరఖాస్తు చేస్తున్నారు. కేవలం ఒకటి రెండు వేల ఉద్యోగ ఖాళీలకు లక్షలాది నిరుద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. ఉద్యోగాలకు ముడుపులు చెల్లిస్తున్నారు. కొన్ని పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఆఖరి నిమిషంలో రద్దవుతున్నాయి. దీనివల్ల మాటల్లో చెప్పలేని అవస్థలకు లోనవుతున్నవారు ఎందరో! ఇవన్నీ, ముమ్మరమవుతోన్న నిరుద్యోగిత పర్యవసానాలే అనడంలో సందేహం లేదు. సీఎమ్ఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) తాజా నివేదిక ప్రకారం అఖిల భారత నిరుద్యోగిత రేటు 9.2 శాతం. వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని అంటున్నారు (నిజానికి ఆ పెరుగుదల ప్రచ్ఛన్న నిరుద్యోగితే). అలాగే నిర్మాణ రంగంలోనూ ఉద్యోగాలు పెరిగాయని అంటున్నారు (వాస్తవానికి ఇవి అవ్యవస్థిత ఉద్యోగాలు). ఇక గిగ్ ఎకానమీ (ప్రజల శ్రామిక శక్తి తాత్కాలిక లేదా పార్ట్ –టైమ్ ఉద్యోగంలో పాల్గొనే ఆర్థిక వ్యవస్థ)లో ఉద్యోగాలు ఏ మాత్రం భద్రత లేనివి.


భద్రత, మంచి వేతన భత్యాలు లభించే ఉద్యోగాలనే యువజనులు సహజంగా ఆశిస్తున్నారు. అటువంటి ఉద్యోగాలు ప్రభుత్వంలోను, ప్రభుత్వ రంగ లేదా ప్రభుత్వ నియంత్రిత సంస్థలలో మాత్రమే లభిస్తాయి. 2024 సంవత్సరం ఆరంభంలో కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిని భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం కాదు కదా కనీసం శ్రద్ధ చూపుతున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. భద్రత, మంచి వేతన భత్యాలు లభించే ఉద్యోగాలను తయారీ రంగంలోను, సేవల రంగంలోను సృష్టించవచ్చు. ముఖ్యంగా పైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, షిప్పింగ్, పౌర విమానయానం, ఆతిథ్యం, ఆరోగ్య భద్రత, విద్య, పరిశోధన... అభివృద్ధి రంగాలలో కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. తయారీ రంగంలో ఉత్పత్తి విలువ జీడీపీలో 15 శాతంగా మాత్రమే ఉన్నది. అది అంతకు మించడం లేదు. కారణమేమిటి? దేశీయ పారిశ్రామికవేత్తలు వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడడమేనని చెప్పక తప్పదు.

దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో ప్రధాన సవాల్ ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం. ప్రభుత్వ అంచనాల ప్రకారమే టోకు ధరల ద్రవ్యోల్బణం 3.4 శాతంగా ఉన్నది. వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 9.4శాతంగా ఉన్నది. మన సువిశాల భారతదేశం ఒక అఖండ మార్కెట్ కాదు. సరుకులు, సేవలు దేశంలోని ప్రతి ప్రాంతానికి స్వేచ్ఛగా ప్రవహించే పరిస్థితి లేదు. వస్తు సేవల ధరలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. అలాగే ఒక రాష్ట్రం పరిధిలోని బాగా అభివృద్ధి చెందిన జిల్లాలలోను, మారుమూల జిల్లాలలోను ఆ రేట్లు ఒకే విధంగా ఉండవు. పై స్థాయిలో ఉన్న 20 నుంచి 30శాతం కుటుంబాలను మినహాయిస్తే మిగతా జనాభాలో ప్రతి కుటుంబమూ ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఈ దురవస్థపై కొంత మంది చిరచిరలాడుతుండగా అత్యధికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.


సరే, మరో నాలుగు రోజుల్లో కొత్త బడ్జెట్ రానున్నది. గౌరవనీయ ఆర్థిక మంత్రి బడ్జెట్ ఉపన్యాసాన్ని మీరు వింటారు లేదా చదువుతారు. నిరుద్యోగిత సమస్య తీవ్రతను తగ్గించేందుకు, నింగినంటిన ధరలను భూమి మీదకు తీసుకువచ్చేందుకు బడ్జెట్‌లో ఆమె చేపట్టే చర్యలపై మీ సంతృప్తి స్థాయిని బట్టి ఆ బడ్జెట్‌కు 50 మార్కుల మేరకు ఇవ్వవచ్చు. మిగతా 50 మార్కులను విద్యా వైద్య రంగాలకు, ప్రజలు ప్రాధాన్యమిచ్చే ఇతర రంగాలకు చేసిన కేటాయింపులను బట్టి ఇవ్వవచ్చు. ఉత్కృష్ట ప్రమాణాలు లోపించిన విద్యారంగం, నాసిరకం ఆరోగ్య భద్రతా సేవలు కొనసాగుతున్నంతవరకు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశం కాదు, కాబోదు. విద్యారంగం, ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగంలో ప్రమాణాలు చాలా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. బాలలు 7 నుంచి 8 సంవత్సరాల పాటు పాఠశాల విద్యాభ్యాసం చేస్తారు. దాదాపు సగం మంది బాలలు మాతృభాషలో సైతం సరిగా చదవలేని, రాయలేని పరిస్థితి ఉన్నది. అలాగే చాలా తేలిక కూడికలు, తీసివేతలు, భాగహారాలు కూడా వారు చేయలేకపోతున్నారని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరి ఇటువంటి బాలలు ఎటువంటి నైపుణ్యాలతో పెరిగి పెద్దవారవుతారు? ఎటువంటి ఉద్యోగాలకు వారు అర్హులవుతారు? ఏకోపాధ్యాయ పాఠశాలలు వేల సంఖ్యలో ఉన్నాయి. కనీస సదుపాయాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. లైబ్రరీలు, లేబొరేటరీలు అలా ఉంచి కనీస బోధనా సహాయ పరికరాలు లేని పాఠశాలలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ మౌలిక సమస్యలను సత్వరమే పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ప్రోద్భలించాలి. అంతేగాని విలువైన వనరులు, సమయాన్ని వివాదాస్పద నూతన విద్యా విధానం, కుంభకోణాల మయమైన ఎన్‌టీఏ/ నీట్‌పై వృథా చేయకూడదు.

విద్యారంగం కంటే ఆరోగ్య భద్రతా రంగం మెరుగ్గా ఉందేమో గానీ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అదే సరిపోదు. ప్రజారోగ్య వ్యవస్థ పరిమాణాత్మకంగా పెరుగుతుందే గానీ నాణ్యతాపరంగా పెరగడం లేదు. ఆరోగ్య భద్రతకు దేశ ప్రజలు చేస్తున్న మొత్తం వ్యయంలో 47 శాతాన్ని స్వయంగా తమ ఆదాయం నుంచి భరిస్తున్నారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రైవేట్ వైద్యరంగం పరిమాణాత్మకంగానే కాకుండా నాణ్యతతో కూడిన సేవలపరంగా కూడా విస్తృతంగా పెరుగుతోంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యానికి అయ్యే ఖర్చులను భరించగల శక్తి దేశ జనాభాలో ఎంత మందికి ఉంది? అత్యధికులకు లేదనేది స్పష్టం. మొత్తం మీద డాక్టర్ల, నర్సుల, మెడికల్ టెక్నీషియన్ల లోటు, డయాగ్నోస్టిక్ పరికరాల కొరత చాలా తీవ్రంగా ఉన్నది. ఇదొక కఠోర వాస్తవం. ఆరోగ్య భద్రతపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయం జీడీపీలో 0.28 శాతానికి తగ్గి పోయింది. ఆరోగ్య భద్రతకు చేస్తున్న మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వ్యయం 1.9 శాతంగా మాత్రమే ఉంది. ప్రజారోగ్య వ్యవస్థ తీరుతెన్నుల పట్ల ప్రజల సంతృప్తి చాలా చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నది.

సరే, ఎదుగు బొదుగు లేని వేతనాలు, కుటుంబ రుణ భారం పెరుగుదల, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, విద్యారుణాల భారం, అగ్నిపథ్ పథకం మొదలైన సమస్యలకు ప్రాధాన్యమిస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే మార్గాలు ఉన్నాయి: కనీస వేతనాన్ని రూ.400గా నిర్ణయించడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం; విద్యా రుణాల మాఫీ, అగ్నిపథ్ రద్దు. మరి ప్రస్తుత పాలకులు ఈ పరిష్కార మార్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతే కాదు, వాటిని అవహేళన చేస్తున్నారు! తత్కారణంగానే 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ గెలుచుకున్న సీట్ల సంఖ్య ఘోరంగా తగ్గిపోయింది. అయినా బీజేపీ పశ్చాత్తాపపడటం లేదు! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాపై పునరాలోచించే యోచన ఏ మాత్రం లేదని ఆ పార్టీ నాయకుల ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. సార్వత్రక ఎన్నికలలో బీజేపీకి బుద్ధిచెప్పిన ఓటర్లు ఆ తరువాత 13 అసెంబ్లీ ఉపఎన్నికలలో మరోసారి ఆ పార్టీకి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఆ ఉపఎన్నికలలో ఇండియా కూటమి 10 స్థానాలను గెలుచుకున్నది. ప్రతిపక్ష కూటమి ఓట్ల వాటా సైతం గణనీయంగా పెరగడం గమనార్హం. యథార్థమేమిటంటే మోదీ సర్కార్ పాలన పట్ల దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనుకనే ఎన్నికలలో ప్రతిపక్ష కూటమికి ఓటు వేయడం ద్వారా పాలనా పద్ధతులను మార్చుకోవాలని దేశ పాలకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి వచ్చేవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ఆ హెచ్చరికలకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తుందా?

నిరుద్యోగిత సమస్య తీవ్రతను తగ్గించేందుకు, నింగినంటిన ధరలను భూమి మీదకు తీసుకు వచ్చేందుకు ఈ నెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న 2024–25 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో పటిష్ఠ చర్యలు ఉంటాయా? ప్రజల జీవన వ్యయాల వాస్తవాలపై సరైన అవగాహన కొరవడడంతో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై నిష్పాక్షిక అంచనాకు రావడంలో బడ్జెట్ రూపకర్తలు విఫలమవుతున్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌లు కలిగిస్తున్న ఆశాభంగానికి ఇదే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Jul 20 , 2024 | 05:02 AM