Share News

విశ్వమిత్ర భారత్‌కే ఇరుగు పొరుగు బలిమి

ABN , Publish Date - Aug 24 , 2024 | 05:48 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన మొదటి హయాంలోనూ, ఆ తరువాత కూడా విశ్వ–గురుగా భారత్‌ ప్రభవించనున్నదని ప్రభుత్వ మద్దతుదారులు పెద్ద ఎత్తున పదే పదే ప్రకటిస్తుండేవారు.

విశ్వమిత్ర భారత్‌కే ఇరుగు పొరుగు బలిమి
Ramachandra Guha

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన మొదటి హయాంలోనూ, ఆ తరువాత కూడా విశ్వ–గురుగా భారత్‌ ప్రభవించనున్నదని ప్రభుత్వ మద్దతుదారులు పెద్ద ఎత్తున పదే పదే ప్రకటిస్తుండేవారు. మన నాగరికతా విలువలు, తాత్త్విక సంప్రదాయాలు, సమున్నత ఆధ్యాత్మిక అనుష్ఠానాలు సంస్కృతి విషయంలో మనలను ఎప్పుడో ప్రపంచ ఆగ్రగామిగా ప్రముఖంగా నిలిపాయని, ఇప్పుడు అసాధారణ ఆర్థికాభివృద్ధి, సాంకేతికతల విజయాలు ప్రపంచ నాయకత్వానికి మనలను అద్వితీయంగా అర్హులను చేశాయని మోదీ ప్రభుత్వ సమర్థకులు ఘోషించారు.


ప్రపంచానికి నాయకత్వం..

ఈ వాదనను మరింత ముందుకు తీసుకువెళ్లి దానిని వ్యక్తిగతీకరించడానికి సైతం సాహసించారు. భారత్‌ మాత్రమే కాదు, నరేంద్ర మోదీయే ప్రపంచానికి నాయకత్వం వహించి మానవాళిని అపూర్వ ప్రగతి సీమలకు నడిపించనున్నారని మోదీ భక్తులు చెప్పారు. 2023లో జీ20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టాక ఆ ప్రచారం మరింత ఉధృతమయింది. నా మిత్రుడు ఒకరు చెప్పిన ఒక ఆసక్తికరమైన ముచ్చటను పేర్కొంటాను: ఢిల్లీ మెట్రోలో ఒక ప్రయాణికుడు తన తోటి ప్రయాణికుడితో ఇలా అన్నాడట : ‘నీకు తెలుసా, ఇప్పుడు మోదీజీ కేవలం భారత ప్రధానమంత్రి మాత్రమే కాదు, మొత్తం ఇరవై దేశాలకు ప్రధానమంత్రి కూడా!’


pm-modi.jpg


విశ్వమిత్ర.. అందుకేనా..?

యాదృచ్ఛికంగా అదే కాలంలో అధికార పక్షం ప్రచారకాండ పరిభాషలో ఒక చిన్న మార్పు సంభవించింది. భారత్‌ను విశ్వ–మిత్ర (సమస్త దేశాలకు స్నేహితుడు)గా ప్రస్తావించడం ప్రారంభమయింది. ఇది, మోదీ ప్రభుత్వ ఆకాంక్షను తగ్గించడమే, సందేహం లేదు. ఒక నిర్దిష్టమైన, సుస్పష్టమైన మార్పు. ప్రపంచానికి బోధించగల స్థాయికి భారత్‌ ఇంకా చేరలేదని, అయినప్పటికీ ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశంతోను స్నేహం నెరపగల విశిష్టస్థానంలో భారత్‌ ఉన్నదని అంటూ ఆ మార్పుకు వివరణ ఇవ్వసాగారు. దీనిపై అనేక ఊహాగానాలు జరిగాయి. ఢిల్లీ మెట్రోలో మోదీ భక్త ప్రయాణికుడి వలే కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వ పక్షాన మాట్లాడే బీజేపీ శ్రేణులకు జీ20 అధ్యక్షత తాత్కాలికం మాత్రమేనన్న వాస్తవం బాగా తెలుసు కనుకనే విశ్వ–గురు అని కాకుండా విశ్వ–మిత్ర అనే మాటను అందుకున్నారా? ప్రజల అంచనాలకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి ఏ మాత్రం లేకపోవడమే ఆ మార్పును ప్రేరేపించిందా? హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో చైనా చొరబాటులతో ప్రపంచ నాయకత్వానికి మన ఆరాటాలు అసంబద్ధమైనవనే వాస్తవం తెలిసిరావడం వల్లే ఆ మార్పు అనివార్యమయిందా?


bjp-flag.jpg


అందుకే ప్రశంసలు
ఏది ఏమైనా ఆ ప్రచార కథనాలలో ఒక స్పష్టమైన మార్పు చోటుచేసుకున్నది. అయితే విమానాలను, ప్లాస్టిక్‌ సర్జరీని సహస్రాబ్దాల క్రితమే ప్రాచీన హిందువులు కనిపెట్టారని విశ్వసించే మోదీ భక్త గణంలో భారత్‌ ఇప్పటికే విశ్వగురు అని, కాకపోయినా సమీప కాలంలోనే ఆ విశిష్ట హోదాను సంతరించుకుంటుందనే నమ్మకం పరిపూర్ణంగా ఉంది. వాస్తవికంగా ఆలోచించే రాజకీయ వివేకులు మాత్రం విశ్వ–మిత్ర అనే ప్రశంసనే మరింత తరచుగా ప్రస్తావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో ఈ మృదు గర్వాతిశయ స్వోత్కర్షను సైతం త్యజించడమే మంచిది. అంతేకాదు, శ్రేయస్కరం కూడా. ఎందుకని? మన ఇరుగు పొరుగు దేశాల ప్రజలు భారత్‌ను ఒక విశ్వసనీయమైన, ఆధారపడదగిన మిత్ర దేశంగా ఏ మాత్రం భావించడం లేదని బంగ్లా పరిణామాలు మరింతగా స్పష్టం చేయలేదూ? షేక్ హసీనా నిరంకుశ పాలనను న్యూఢిల్లీ అన్ని విధాల వెనకేసుకురావడం వల్లే భారత్ ఉద్దేశాలను బంగ్లాదేశీయులు తీవ్రంగా శంకిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో బంగ్లా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్‌ మరోసారి విజయం సాధించింది. ప్రజల మద్దతుతోనేనా? కాదు. ఎన్నికలలో అడ్డు అదుపూ లేని రిగ్గింగ్‌కు పాల్పడడం ద్వారా. అయినా ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించారంటూ భారత ఎన్నికల సంఘం బంగ్లాదేశ్‌ ఎన్నికల సంఘాన్ని ప్రశంసించింది!


modi.jpg


శ్రీలంక, నేపాల్ ఇలా..?

భారత్‌ తమ దేశం పట్ల దురహంకారపూరితంగా వ్యవహరిస్తుందనే భావన శ్రీలంక, నేపాల్‌ ప్రజలలో కూడా ప్రగాఢంగా ఉన్నది. బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకకు చెందిన పౌరుల సంయుక్త ప్రకటన ఒకటి తమ తమ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడాన్ని భారత్‌ విరమించుకోవాలని విజ్ఞప్తి చేయడమే అందుకొక నిదర్శనం. ‘దశాబ్దాలుగా న్యూఢిల్లీ తనకు సానుకూలురు అయిన రాజకీయవేత్తలు, ప్రభుత్వాధికారుల తోడ్పాటుతో తమ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ నిరంతర రాజకీయ అస్థిరతను సృష్టిస్తూ నిరంకుశ ప్రభుత్వాలకు వత్తాసునిస్తుందని ఆ సంయుక్త ప్రకటన నిరసించింది.


ప్రతిఫలం..

ఆ ఆరోపణను ధ్రువీకరించే వాస్తవాలను కూడా ఆ ప్రకటన ప్రస్తావించింది. బంగ్లాదేశ్‌లో ప్రజల మద్దతును కోల్పోయిన షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని ఒక దశాబ్ద కాలంగా నిలబెట్టి అందుకు ప్రతిఫలంగా భారత్‌ రాజకీయ, ఆర్థిక రాయితీలను పొందిందని ఆ ప్రకటన పేర్కొంది. ‘శ్రీలంకకు ఐపికెఎఫ్‌ను పంపక ముందు నుంచీ, ఆ తరువాత కూడా ఆ దేశ రాజకీయాలలో న్యూఢిల్లీ జోక్యం చేసుకుంటోంది. ఇప్పుడు శ్రీంకలో తమ కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనాలను సాధించేందుకు న్యూఢిల్లీ చురుగ్గా చొరవ చూపుతుందని’ ఆ ప్రకటన గర్హించింది. నేపాల్‌లో ‘ఒకప్పుడు తన అనుకూల రాజకీయవేత్తలు, దౌత్యవేత్తల ద్వారా జోక్యం చేసుకున్న న్యూఢిల్లీ ఇప్పుడు ఇంటెలిజెన్స్‌ వర్గాలు, ఆరెస్సెస్‌ కార్యకర్తల ద్వారా ఆ దేశ అంతర్గత వ్యవహారాలను ప్రభావితం చేస్తూ నిర్దేశిస్తుంది. 2015లో పెను భూకంపంతో నేపాల్‌ ప్రజలు అతలాకుతలమైన తరుణంలో కూడా భారత్‌ ఆ దేశానికి వ్యతిరేకంగా దిగ్బంధం విధించింది. నేపాల్‌ కొత్తగా అమలుపరచుకుంటున్న రాజ్యాంగం న్యూఢిల్లీకి నచ్చకపోవడం వల్లే ఆ దిగ్బంధాన్ని అమలుపరిచారని’ ఆ సంయుక్త ప్రకటన దుయ్యబట్టింది.


అది విషయం

ఈ ధ్రువీకరణలు నిర్దుష్టమైనవి. చాలావరకు వాస్తవమైనవి. ప్రస్తావిత మూడు దేశాలలోను నాకు స్నేహితులు, వృత్తి సంబంధమైన సహచరులు ఉన్నారు. ఆ మూడు దేశాలను నేను అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను. ఒక పెత్తందారువలే భారత్‌ వ్యవహరిస్తుందని, పెద్దన్న మనస్తత్వం న్యూఢిల్లీకి బాగా ఉన్నదనే భావన బంగ్లా, నేపాలీ, సింహళ మేధావులు, రచయితలలో తీవ్రంగా ఉన్నది. ఈ సందర్భంగా 19వ శతాబ్ది మెక్సికో దేశాధ్యక్షుడు ఒకరు అమెరికా విషయమై చేసిన వ్యాఖ్య నొకదాన్ని తప్పక గుర్తుచేయవలసివున్నది. ఆ మెక్సికన్‌ పాలకుడు ఇలా అన్నాడు: ‘అభాగ్య మెక్సికో! భగవంతుడికి ఎంత సుదూరంలో ఉన్నదో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాకు అంత సామీప్యంలో ఉన్నది’. బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌ మూడూ అనేక ఆర్థిక సమస్యలు, రాజకీయ సవాళ్లతో సతమతమవుతున్నాయి. భారత్‌కు పొరుగునే ఉన్న కారణంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవడం, సవాళ్లనెదుర్కోవడం ఆ దేశాలకు మరింత క్లిష్టతరమవుతోంది.


పెద్దన్నలా

ఇరుగు పొరుగు దేశాల పట్ల భారత్‌ పెద్దన్న ప్రవర్తన మోదీ సర్కార్‌తోనే ప్రారంభమవలేదు. అంతకు ముందు నుంచే ఉన్నది. శ్రీలంకకు ఐపికెఎఫ్‌ను పంపింది రాజీవ్‌గాంధీ, నేపాల్‌కు వ్యతిరేకంగా నరేంద్రమోదీ ప్రభుత్వం దిగ్బంధం విధించక ముందే రాజీవ్ సర్కార్‌ సైతం ఆ అమానుష అమిత్ర చర్యకు పాల్పడింది. నిజానికి ఇటువంటి దురహంకారపూరిత ప్రవర్తనకు ఆద్యుడు మన మొదటి ప్రధానమంత్రి (ఆయనే మన మొదటి విదేశాంగమంత్రి కూడా) అని చెప్పక తప్పదు. ప్రముఖ దౌత్యవేత్త జగత్‌ మెహతా ఇలా వ్యాఖ్యానించాడు: ‘రెండు భిన్న, అసమాన ఇరుగు పొరుగు దేశాల మధ్య దౌత్యాన్ని నిర్వహించడమంత క్లిష్టసాధ్యమైన కార్యం ఇరవయో శతాబ్దిలో మరొకటి లేదన్న సత్యాన్ని నెహ్రూ పూర్తిగా గుర్తించలేదు. ఈ విషయంలో ఆయనకు ఉపయుక్తమైన సలహానివ్వడంలో విదేశాంగశాఖ విఫలమయింది’.


నో డిస్కషన్స్..?

చరిత్ర తర్కం, భౌమ వాస్తవాలు చైనా, పాకిస్థాన్‌తో భారత్‌ సంబంధాలు సమస్యాత్మకంగా ఉండిపోవడాన్ని అనివార్యం చేస్తున్నాయి. మెక్‌మహాన్‌ రేఖను చైనా ఎప్పుడూ అంగీకరించలేదు. తాము పాశ్చాత్య సామ్రాజ్యవాదుల నియంత్రణలో ఉన్నప్పుడు ఆ సరిహద్దు ఒప్పందాన్ని బలవంతంగా అంగీకరించవలసి వచ్చిందని చైనా స్పష్టం చేసింది. 1962లో భారత భూభాగాలను చైనా దురాక్రమించడం భారతీయులను అమితంగా నొప్పించింది. ఆ పరాభవ మానసిక గాయాల నుంచి ఇప్పటికీ ఉపశమనం లభించలేదు. పాకిస్థాన్‌ దశాబ్దాలుగా కేవలం కశ్మీర్‌లోనే కాకుండా మన దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. ఈ దృష్ట్యా, ఆ దేశంతో ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించినా సత్ఫలితం సమకూరే అవకాశమే లేదు.


కాంట్రవర్సీ లేదు.. కానీ

మన ఇరుగు పొరుగు దేశాలతో అటువంటి వివాదాస్పద సమస్యలు లేవు. అందుకు భిన్నంగా సామరస్యపూర్వక సంబంధాలకు దోహదం చేసే పరిస్థితులే ఉన్నాయి. అయినా ఈ మూడు చిన్న దేశాలతో భారత్‌ సంబంధాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిన సందర్భాలు అరుదుగా ఉన్నాయి. ఇందుకు తన బాధ్యత ఏ మేరకు ఉన్నదో పెద్ద, శక్తిమంతమైన పొరుగు దేశంగా భారత్‌ నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి.


ఆశే..?

2007–08లో మన ఆర్థిక వ్యవస్థ అసాధారణంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రపంచ అగ్రరాజ్యంగా భారత్‌ ఆవిర్భవించనున్నదనే మాట బాగా విన్పించింది. అది అకాల ఆశాభావమని, తొందరపాటుతో అంటున్న మాట అని నేను భావించాను. ప్రపంచ బాధ్యతలు స్వీకరించడానికి ఆరాటపడడం కాకుండా మన సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతలు, రాజకీయ సమస్యలను పరిష్కరించుకోవడంపై పూర్తి శ్రద్ధ చూపించడం వివేకవంతంగా ఉండగలదని నేను అప్పుడే వాదించాను. మన్మోహన్‌ సింగ్‌ రెండోసారి ప్రధానిగా ఉన్న సమయంలో అగ్రరాజ్య హోదాకు ఆరాటాలు చాలా వరకు తగ్గిపోయాయి. నరేంద్ర మోదీ తన మొదటి ప్రభుత్వ హయాంలో అవి మళ్లీ సరికొత్తగా వ్యక్తమవ్వడం ఆరంభమయింది. స్వదేశీ ముద్రను సంతరించుకున్నాయి. భారత్‌ త్వరలో అగ్రరాజ్యంగా ప్రభవించనున్నదని చెప్పుతున్నవారు అచిరకాలంలోనే భారత్‌ ఇప్పటికే విశ్వగురుగా మారిందని ప్రకటించసాగారు!


పగటి కలే..?

ప్రపంచ నాయకత్వానికి భారత్‌ ఆరాటం వివేకహీనమైనది. అదొక పగటి కల. ఎందుకని? మన దేశం ఎదుర్కొంటున్న సంస్థల, వ్యవస్థల పతనం, అసమానతల పెరుగుదల, పెచ్చరిల్లిన అవినీతి, పరిపాలనలో ఆశ్రిత పక్షపాతం, ఎల్లెడలా పర్యావరణ విధ్వంసం మొదలైన సమస్యలు మన సమాజంలోని వాస్తవ పరిస్థితులను ముఖం మీద గుద్ది చెప్పడం లేదూ? విశ్వగురు భారత్‌ అనే భావన అర్థరహితం, చెత్త వాగుడే కావచ్చు గానీ విశ్వమిత్ర భారత్‌ అనే ఆదర్శం కొంతవరకు విలువైనది. సమస్త ప్రపంచ దేశాలకు ఒక మంచి స్నేహితుడుగా ఉండాలని భారత్‌ ఆకాంక్షిస్తుంటే అందుకు మున్ముందుగా తన ఇరుగు పొరుగు రాజ్యాలు ముఖ్యంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకల పట్ల తన వైఖరులను మార్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ దేశాలతో మెరుగైన సంబంధాలను నిర్మించుకునేందుకు గౌరవాదరాలు, విశ్వసనీయతను పెంపొందించుకోవాలి. మన పట్ల ఆ సుహృద్భావాలు కేవలం ఆ దేశాల నాయకులలోనే కాకుండా, ఆయా దేశాల పౌరులలో సైతం సుస్థిరంగా నెలకొనేలా మనం ప్రవర్తించాలి.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Aug 24 , 2024 | 08:03 AM